Home తాజా వార్తలు జలం.. పదిలం..

జలం.. పదిలం..

 Krishna River

 

వనపర్తి : వానలు లేవు.. వరదలు లేవు.. కుండపోత వర్షాలు అంతంతమాత్రమే అయినా భూగర్భజలాలు భారీగా పెరిగాయి. వట్టిపోయిన బోరుబావులు మళ్లీ జీవం పోసుకున్నాయి. జలం పాతాళం నుండి ఉబికి వస్తుంది. ఇది నమ్మశక్యం కాని విషయమైనా వాస్తవం. దీనికంతటికి కారణం కృష్ణానది వరదనీటిని ఒడిసి పట్టడమే. ముఖ్యంగా భీమా జూరాల, కెఎల్‌ఐ కాల్వల ద్వారా జిల్లాలోని చెర్వులన్నింటిని దాదాపుగా నింపేశారు. దీంతో భూగర్బజలాలు పెరిగి పదిలంగా ఉండిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భూగర్భజలాలు భారీగా పెరిగాయి.

సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురిసినా ఈ ఏడాది సెప్టెంబర్‌నెలలో కృష్ణానదికి వరద రావడంతో జూరాల, భీమా, కెఎల్‌ఐ ప్రాజెక్టుల కాల్వల ద్వారా జిల్లాలో చాలా వరకు చెర్వులు నింపారు. అలాగే మొన్న వేసవిలో సైతం చాలా వరకు చెర్వుల్లో నీరు నిల్వ ఉండడం వల్ల భూగర్భజలాలు స్థిరంగా ఉంటూ క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

దీంతో గత ఏడాది ఆగష్టులో 8.80 మీటర్ల లోతులో ఉన్న నీరు ప్రస్తుతం 6.91 మీటర్ల దగ్గరే లభిస్తుంది. అంటే ఈ లెక్కన 1.89 మీటర్ల నీటి మట్టం పెరిగినట్లు తెలుస్తుంది. వనపర్తి జిల్లాలో వందలాది చెర్వులను నింపడంతో అనేక బోరుబావులు మళ్లీ జీవం పోసుకున్నాయి. ఏళ్ల తరబడి వట్టిపోయిన వాగులు, చెరువులు సైతం నిండుగా పారుతున్నాయి. దీంతో అన్ని మండలాల్లో నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

ఖిల్లాఘణపురం, పెద్దమందడి రికార్డు.
వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాల్లో గతంలో ఎన్నడు లేనంతగా భూగర్భజలాలు పెరిగాయి. గత వేసవి కాలంలో ఘణపురం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గణప సముద్రం రిజర్వాయర్ 36 సంవత్సరాల అనంతరం మొదటి పర్యాయం నింపారు. అలాగే పెద్దమందడి మండలంలో అనేక చెర్వులను కూడా నింపారు. ఇక మనిగిల్ల సమీపంలోని వాగులోకి వరదనీటిని వదలడంతో గ్రౌండ్ వాటర్ పెరిగి చుట్టు ఉన్న వందలాది బోరుబావులు రీచార్జి అయ్యాయి. ఘణపురం మండ కేంద్రంలోని వందకు పైగా బోరు బావులు జీవం పోసుకున్నాయి. ఇక గణపసముద్రం రిజర్వాయర్ సమీపంలో ఉన్న బోరు బావులయితే ఏకధాటిగా నీటిని ఎగజిమ్ముతున్నాయి.

నీటి మట్టం లెక్కింపు ఇలా..
భూగర్భ జలం ఎంత లోతులో ఉందో అన్న వివరాలు తెలుసుకోవడానికి భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో ఫిజియో మీటర్ల ద్వారా పరిశీలించి నమోదు చేస్తుంటారు. దీనికోసం జిల్లాలో మొత్తం 12 చోట్ల ఫిజియో మీటర్లు ఉన్నాయి. లోతుగా ప్రత్యేకంగా తవ్వించిన బోరు బావుల్లో ఈ మీటర్లతో నీటి మట్టాన్ని పరిశీలిస్తుంటారు. ఇక జూరాల ప్రాజెక్టు సమీపంలో ఉన్న అమరచింత మండలం సింగంపేటలో భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. ఇక్కడ కేవలం 0.50 మీటర్ల లోతులో నీరు ఉన్నట్లు గుర్తించగా ఘణపురం మండలం కమాలొద్దిన్‌పూర్ దగ్గర 0.97 మీటర్ల దగ్గరే జలాలు లభిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో 1.89 మీటర్ల నీరు పైపైకి వచ్చింది. ఇక కొత్తకోట మండలంలో భూగర్భ జలం అత్యంత లోతులో అంటే 16. 23 మీటర్ల లోతుకు వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు.

వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల్లో 1,32,532 వేల ఎకరాలకు
పైగా పంట సాగు విస్తీర్ణం వివరాలు..
వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో జూరాల, భీమాతో పాటు బోరుబావుల కింద 1,32,532 లక్షల ఎకరాల్లో రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగు చేశారు. అందులో అమరచింత 5వేల, 628 ఎకరాలు, ఆత్మకూర్ 13,279వేల ఎకరాలు, చిన్నం బావి 6,644 ఎకరాలు, ఘణపురం 7813 ఎకరాలు, గోపాల్ పేట 7488 ఎకరాలు, కొత్తకోట 14,281 ఎకరాలు, మదనాపురం 11,500 ఎకరాలు, గోపాల్‌పేట లో 7488 ఎకరాలు, పాన్‌గల్‌లో 11577 పైగా ఎకరాలు, పెబ్బేరు17,332 ఎకరాలు, పెద్దమందడి 6163 ఎకరాలు, రేవల్లి 5,890వేల ఎకరాలు, శ్రీరంగాపురం 8,244 ఎకరాలు, వనపర్తి 7856 ఎకరాలు, వీపనగండ్ల 8,837 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.

చెర్వులు, కాల్వలతో పెరుగుదల..
కృష్ణానదికి వరద రావడంతో భీమా, కెఎల్‌ఐ, జూరాల కాల్వల ద్వారా వనపర్తి జిల్లాలోని వందలాది చెర్వులను నింపాం. అలాగే కొన్ని వాగుల్లో సైతం నీరు పారడంతో భూగర్భజలాలు పెరగడానికి దోహదపడ్డాయి. గత ఏడాదితో ఆగష్టునెలతో పోలిస్తే ఈ ఏడాది ఆగష్టులో 1.89 మీటర్ల నీరు పెరిగింది. ఈ ఏడాది ముఖ్యంగా ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాల్లో భూగర్భజలాలు అధికంగా పెరిగింది. కొన్ని నెలల పాటు గణప సముద్రం రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయడం వల్ల సమీపంలోని వందలాది బోర్లు రీచార్జి అయ్యాయి. కొన్ని బోర్లలో అయితే నీరు పైకి ఉబికి వస్తుంది.

Groundwater rised with waters of Krishna River