Home తాజా వార్తలు జిశాట్-30 ప్రయోగం సక్సెస్

జిశాట్-30 ప్రయోగం సక్సెస్

ISRO Gsat 30

 

ప్రసార సమాచార విస్తరణకు మరింత బలం

బెంగళూరు : భారతదేశపు అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ ఉపగ్రహం జిశాట్ 30 ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ గుయానా నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఈ శాటిలైట్‌ను ఏరియన్ 5 రాకెట్ నుంచి నిర్ణీత రీతిలో కక్షలోకి పంపించారు. ఉన్నత ప్రమాణాల టెలివిజన్, టెలీకమ్యూనికేషన్స్, ప్రసారాల సేవలకు ఈ దోహదపడే ఈ శాటిలైట్ భారతదేశ సమాచార వ్యవస్థ మెరుగుదల ప్రక్రియలో మరో మైలురాయి అవుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.35 నిమిషాలకు ఫ్రెంచ్ భూభాగం కౌరోవ్‌లోని ఏరియన్ ప్రయోగ కేంద్రం నుంచి ఎటువంటి అపశృతులు లేకుండా కక్షలోకి పంపించారు. పరీక్షించిన తరువాత ఇది సరిగ్గా 38 నిమిషాల 25 సెకండ్లకు అందుకోవల్సిన కక్షను అందుకుందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఉదయం ఒక సమాచార ప్రకటనలో తెలిపింది.

ప్రయోగం విజయవంతం అయిందనే విషయాన్ని ప్రయోగకేంద్ర కార్యనిర్వాహక అధికారి స్టఫేన్ ఇజ్రల్ తమ ట్వీటులో పేర్కొన్నారు. చాలా కాలంగా కమ్యూనికేషన్ సేవలు అందిస్తున్న ఇన్సాట్ 4 ఎ స్థానాన్ని ఇప్పుడు ప్రయోగించిన జి శాట్ భర్తీ చేస్తుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. 3357 కిలోల బరువుండే ఈ శాటిలైట్ ఇన్సాట్ శ్రేణి ఉపగ్రహా వరుసకు ప్రత్యామ్నాం అయింది. దీనికి 12 సి, 12 కెయు బ్యాండ్ ట్రాన్స్‌పాండర్స్ అమరి ఉన్నాయి. భారత భూభాగానికి, దీవులకు విస్తృత కమ్యూనికేషన్ సేవలు అందిస్తుందని, ఇక దీని సి బ్యాండ్ పరిధి గల్ఫ్ దేశాలు, పలు ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా వరకూ విస్తరించుకుని ఉంటుందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె శివన్ పేర్కొన్నట్లు సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

15 ఏండ్ల జీవితకాలం
జి శాట్ జీవితకాలం 15 ఏండ్లు. డిటిహెచ్, టెలీవిజన్ అనుసంధాన, విసాట్ సేవలకు ఇది ఉపయోగపడుతుంది. విసాట్ పరిధిలో ఎటిఎం, స్టాక్ ఎక్సేంజ్, టీవీ అప్‌లింకింగ్, టెలీపోర్టు సేవల ప్రమాణాల పెంపుదలకు ఉపయోగపడుతుంది. డిఎస్‌ఎన్‌జి, ఇగవర్నెన్స్‌కు ఈ శాటిటైల్ సహకరిస్తుంది. ప్రయోగ స్థలి వద్ద ఇస్రోకు చెందిన యుఆర్ రావు, పి కున్హికృష్ణన్ ఉన్నారు.

Gsat 30 successfully launched from French Guiana