Home తాజా వార్తలు బ్లాక్‌ఫంగస్, కొవిడ్ మెడిసిన్ రేట్ల తగ్గింపు!

బ్లాక్‌ఫంగస్, కొవిడ్ మెడిసిన్ రేట్ల తగ్గింపు!

GST council meet to discuss tax on covid materials

 

12న జిఎస్‌టి కౌన్సిల్ భేటీలో నిర్ణయం

న్యూఢిల్లీ : జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ ఈనెల 12న సమావేశం కానుంది. ఈ సమావేశంలో కోవిడ్‌కు సంబంధించిన ముఖ్యమైన వస్తువులపై పన్ను రేట్లు తగ్గించడం, బ్లాక్ ఫంగస్ ఔషధంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతకుముందు మే 28న జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో పిపిఇ కిట్లు, మాస్క్‌లు, వ్యాక్సిన్లు వంటి కోవిడ్ వస్తువులపై పన్ను రేట్లు నిర్ణయించడానికి ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మే 29న ఎనిమిది మంది మంత్రుల బృందం ఏర్పాటు చేశారు.

మేఘాలయ సిఎం కాన్రాడ్ సంగ్మాను ఈ మంత్రుల బృందానికి కన్వీనర్‌గా చేశారు. జూన్ 7న ఈ బృందం తన నివేదికను సమర్పించింది. జూన్ 12న జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం నివేదిక ఆధారంగా పన్ను తగ్గింపులను పరిశీలిస్తారు. అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కోవిడ్‌కు సంబంధించిన నిత్యావసర వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాలని సూచించారు. రోగుల సౌలభ్యం కోసం కోవిడ్‌కు సంబంధించిన వస్తువులపై పన్ను తగ్గింపుకు అనుకూలంగా ఉన్నట్లు మంత్రుల బృందం సభ్యుడు, ఉత్తరప్రదేశ్ ఆర్థికమంత్రి సురేష్ కుమార్ ఖన్నా అన్నారు. అయితే పన్ను రేటుకు సంబంధించి కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది.

ఈ వస్తువులపై పన్ను మినహాయింపు ఉండొచ్చు
మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, హ్యాండ్ శానిటైజర్, వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, ఎన్ -95, సర్జికల్ మాస్క్‌లు, ఉష్ణోగ్రత కొలిచే పరికరాలపై పన్నును తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇవే కాకుండా కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ చికిత్సలో ఉపయోగించే ఔషధ-ం, కోవిడ్ దర్యాప్తులో ఉపయోగించే టెస్టింగ్ కిట్‌పై పన్ను రేట్లను కూడా మంత్రుల బృందం పరిశీలిస్తోంది.

మెడిసిన్‌లపై పన్ను రేటు
ప్రస్తుతం దేశీయంగా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌పై 5 శాతం జిఎస్‌టి వసూలు చేస్తున్నారు. అదే సమయంలో కోవిడ్‌కు సంబంధించిన మందులు, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లపై 12 శాతం జిఎస్‌టి విధిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు, సామాజిక సంస్థలు సహా ప్రజలు కోవిడ్‌కు సంబంధించిన మందులు, ఇతర పరికరాలపై జిఎస్‌టి రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సామాన్య ప్రజలు కోవిడ్ మందులను తక్కువ ధరలకు పొందే అవకాశం లభిస్తుంది.

GST council to meet to discuss tax on covid materials