Friday, April 26, 2024

సంపాదకీయం: గాడిలో పడినట్టేనా!

- Advertisement -
- Advertisement -

Election expenditure limits for Lok Sabha and Assembly polls ఎన్నాళ్ల కెన్నాళ్లకు! ఏమిటీ వింత కాంతి !! వెలుగు విరుస్తున్నదా, మబ్బులు పటాపంచలవుతున్నాయా, కలయా, నిజామా? ఎనిమిది మాసాల తర్వాత అక్టోబర్ నెల వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటి రూ. 1,05,155 కోట్లకు చేరుకోడం ఉబ్బితబ్బిబ్బు కావలసిన పరిణామమే. ఆనందం ఆకాశానికి అంటవలసిన సంబరమే. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇంత వరకూ లేని అత్యంత శిఖరప్రాయమైన జిఎస్‌టి పన్ను ఆదాయమిది. కరోనా గాలి అప్పటికింకా సోకని గత ఏడాది అక్టోబర్ మాసం వసూళ్ల కంటే ఇది 10.25 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 2019 మార్చిలో వసూళ్ల వృద్ధి 15.6 శాతానికి చేరుకున్న తర్వాత మళ్లీ ఇంత వృద్ధి సాధించడం ఇదే మొదటి సారి. దిగుమతులపైన, దేశంలోని అమ్మకాలపైన కూడా జిఎస్‌టి వసూళ్లు ఈ అక్టోబర్‌లో విశేషంగా పెరిగాయి. కరోనా లాక్‌డౌన్ తీసిన అసాధారణమైన దెబ్బ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకొని ముందుకు పరుగులెత్తుతున్నదనడానికి ఇది తిరుగులేని సంకేతమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశాయి. వారికే కాదు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.

ఎందుకంటే జులై నెలలో జిఎస్‌టి ఆదాయంలో పెరుగుదల లేకపోగా 14 శాతం లోటు (మైనస్ 14 శాతం) నమోదయింది. ఆగస్టులో మైనస్ 8 శాతం రికార్డయింది. సెప్టెంబర్‌లో మాత్రం 5 శాతం పెరిగి, అక్టోబర్‌లో ఇంత ఉచ్ఛస్థితి (10.2 శాతం) కి చేరుకున్నది. సరకుల ఉత్పత్తి, రవాణా, వినియోగం ప్రతిబింబించే ఇ వే బిల్లులలో చెప్పుకోదగిన వృద్ధి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్‌లో వీటి పెరుగుదల గత సంవత్సరం అదే మాసంతో పోలిస్తే 10 శాతం ఎక్కువని, అక్టోబర్‌లోనైతే 21 శాతం అధికమని తేలింది. ఇది నిస్సందేహంగా విశేషమైన గుణాత్మకమైన మార్పే. కోవిడ్ 19 దించిన వ్యతిరేక వృద్ధి ఊబిలోంచి ఆర్థిక వ్యవస్థ బయటపడి మునుముందుకు పైపైకి చూస్తున్నదని భావించడానికి ఆస్కారమిస్తున్నదే. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు మాసాల్లో 23.9 శాతం దిగబడి పోయిన ఆర్థిక రంగం తిరిగి గట్టెక్కుతున్నదనే ధైర్యాన్ని అక్టోబర్ నెల జిఎస్‌టి విశేష వసూళ్లు కలిగిస్తున్నాయి. అయితే ఇందుకు దారి తీసిన కారణాలను పరిశీలించినప్పుడు ఈ వృద్ధి రేపటి నెలల్లో కూడా కొనసాగినప్పుడే ఈ సంతృప్తి నిలుస్తుంది, అర్థవంతమవుతుందని బోధపడుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు పండగల సీజన్ కాబట్టి కీలకమైన దసరా, దీపావళి సంబరాల సందర్భంగా విశ్వాసాలపరంగానైనా ప్రజలు కొత్త కొనగోళ్లకు ఉత్సాహం చూపుతారు గనుక జిఎస్‌టి వసూళ్లు సహజంగానే పెరుగుతాయి.

అదే సందర్భంలో నెలలు తరబడిగా వ్యాపారాలు లాక్‌డౌన్‌లో ఉన్నందున ఆ కాలంలో అణిగి ఉన్న కొనుగోళ్లు అవి తిరిగి తెరుచుకోగానే ఒక్కసారిగా పెల్లుబుకి ఉంటాయి. దాని ప్రభావం కూడా అక్టోబర్ నెల వసూళ్ల అనూహ్యమైన ఊర్ధ గతికి దోహదపడి ఉంటుందని భావించాలి. అందుచేత ఆర్థిక వ్యవస్థ కరోనాకు ముందున్న స్థితికి మళ్లీ చేరుకున్నదని గాని, ఇక ముందు చూపేగాని వెనుకపట్టు ఉండబోదని గాని భరోసా వహించడానికి వీలు లేదు. అమెరికాలో, యూరప్‌లో కరోనా మళ్లీ విజృంభించిందని, తిరిగబెట్టిందని వార్తలు వస్తున్నాయి. మన దగ్గర కూడా అలాగే జరిగినా ఆర్థిక పరిస్థితి మళ్లీ డీలాపడే ప్రమాదముంది. ప్రస్తుత సూచనలను బట్టి కరోనా మన దేశంలో పునర్విజృంభించకపోవచ్చు. మొదట్లో అది ముట్టడించినప్పటికీ ఇప్పటికీ తేడా కనిపిస్తున్నది. దానిని ఎదుర్కోడంలో ప్రజలు, ప్రభుత్వాలు గడించిన అనుభవం అది తిరిగి విరుచుకుపడకుండా చేయడంలో దన్నుగా నిలబడవచ్చు. పండుగల్లో కొత్త వాహనాల కొనుగోలుకు జనం ఎగబడడం మామూలే. కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఎలా ఉంటుందోననే భయాలు పొడచూపాయి. అప్పటికే అమ్మకాలు లేక ఈగలు తోలుకుంటూ వచ్చిన కార్ల పరిశ్రమ పండగల సీజన్‌లోనూ పడకేస్తే ఊహించని ప్రమాదమే ఎదురు కావచ్చని భయాలు తలెత్తాయి.

కాని దేశంలోని అన్ని కంపెనీల కార్లు ఈ పండగల సీజన్లో విశేషంగా అమ్ముడుపోయాయన్న సమాచారం ఆర్థిక వ్యవస్థకు వెయ్యి ఏనుగుల బలాన్నిపచ్చింది. మిగతా కంపెనీలన్నింటికంటే ఎక్కువగా కార్లు విక్రయించే మారుతి సుజుకి అమ్మకాలు అక్టోబర్ నెలలో 17.6 శాతం పెరిగాయి. హ్యుందయి విక్రయాలు 13.2 శాతం, మహింద్ర మహింద్ర 1 శాతం, టయోట క్లిర్లోస్కర్ మోటార్ 4.2 శాతం, హోండా కార్లు 8.3 శాతం పెరిగాయి. ఒక వర్గం ప్రజల కొనుగోలు శక్తి బలాన్ని ఇది చాటుతున్నది. ఇదే విధంగా పేద, మధ్య తరగతి ప్రజలు కోల్పోయిన, నష్టపోయిన ఉపాధులు, ఉద్యోగాలు తిరిగి మామూలు స్థితికి చేరుకొని వారి జేబులు బలపడితేనే దేశమంతా అన్ని వర్గాల ప్రజలు మళ్లీ పుంజుకున్నారని భావించడానికి అవకాశం కలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News