Thursday, April 25, 2024

ఉద్యమపాటల పొద్దుపొడుపు గూడ అంజయ్య

- Advertisement -
- Advertisement -

Guda Anjaiah wrote songs based on plight of poor

 

నాకు పాట జీవితాన్ని ఇచ్చింది పాటను జీవితంలో భాగంగా తీసుకున్నాను అని చెప్పే చెప్పిన కవి, రచయిత గూడ అంజయ్య. వీరు మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం లింగాపురంలో నవంబర్ 1, 1956న జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మమ్మ లక్ష్మయ్యలు. చిన్నతనం నుంచి తండ్రి ద్వారా భారత , భాగవత కథలు వింటూ తిరిగారు అంజయ్య. యుక్త వయస్సు లో నక్సల్బరీ ఉద్యమం కు ఆకర్షితులై విప్లవ పోరాటంలో పార్టీ కార్యకర్తగా పనిచేశారు. అలాగే అరుణోదయ సంస్థలో పనిచేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుని జనం కోసం పని చేయడం మొదలుపెట్టారు. పదహారేళ్ల చిరుప్రాయంలోనే పాటను తనదిగా చేసుకోని పాటలపైన మమకారం పెంచుకున్నారు గూడ అంజయ్య. లింగాపూర్ గ్రామంలో ప్రాథమిక విద్యను , లక్ష్మీపేటలో ఇంటర్ విద్యను , హైదరాబాదులో బీఫార్మసీ విద్యను పూర్తీ చేశారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు లక్ష్మి పేట గ్రామంలో బాలుర విశాఖ హాస్టల్ లో చదువుకున్నారు , ఆ సమయంలో వీరికి ఆకలి బాధ తెలియదు కానీ తెలంగాణ ఉద్యమం సందర్భంగా రెండేళ్లపాటు స్కూలు మూసేశారు అప్పుడే కష్టం అంటే ఏమిటో అర్థమైంది.

ఆ తర్వాత హైదరాబాద్ చంచల్ గూడ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యను హాస్టల్లో స్టోర్ కీపర్ గా Part time పనిచేస్తూ చదువుకున్నాడు అదే సమయంలో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైంది అదీ వీరి పై పెద్ద ప్రభావాన్నే చూపింది. అప్పుడు వీరు అరుణోదయ సభ్యులుగా ఉండేవారు ఆ సంస్థ ద్వారా ఎన్నో గ్రామాలను సందర్శించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజా చైతన్య ఉద్యమాలలో క్రియాశీలంగా ఉన్న అంజయ్య ను అరెస్టు చేసి ముషీరాబాద్ జైల్లో పెట్టారు. అలా ఇంటర్ చదువుకు ఆటంకం ఏర్పడింది. విడుదల అనంతరం రెండేళ్ళ విరామం తర్వాత బీఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరారు. డి ఫార్మసీ చదివి ఫార్మసిస్ట్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన గూడ అంజయ్య వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ గా పని చేసి 2000 సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

గూడె లక్ష్మయ్య, లక్ష్మమ్మలకు ఐదుగురు -కుమారులు ఒక కుమార్తె. వీరిలో గూడె అంజయ్య నాలుగవవాడు. అయితే దురదృష్టవశాత్తు వీరిలో కొందరు మరణించగా ఇప్పుడు గూడె అంజయ్యకు ఒక సోదరుడు, ఒక సోదరి మాత్రం మిగిలారు.
గూడ అంజయ్యకుహేమనళినితో వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు వారు నవిత, శ్రీలత , సరిత, మమత. ఈ నలుగురు కుమార్తెల్లో నవిత అనే పదేళ్ల పాప హఠాత్తుగా చనిపోయింది. ఆ బాధలో ఉండగా వీరు రాసిన పాట సున్నంగా తల దువ్వి సన్న నేత చొక్కా తొడిగి సందు వెంట పోతుంటే నా కొడుకు బంగారు తండ్రి…..ఓ కోండ కోనల్లారా విసార్టిగా చెపుండ్రీ నా నెలవంక ఏమైనాడని అంటూ పాటను రాశారు. (మూడు తరాల ఉద్యమకారుడు గూడ అంజయ్య – ఉదారి నారాయణ వ్యాసం అధారంగా)

రచనలు : గూడ అంజయ్య సిన్మా పాటలు (2007), పోలిమేర (నవల), గిరిజన మహిళ మేలుకో (నాటిక), వాయిస్ ఆఫ్ తెలంగాణ ( ఆడియో క్యాసేట్లు), తెలంగాణ బుఱ్ఱ కథ ( ఆడియో క్యాసేట్లు), ఊరు మనదిరా (పాటల సంకలనం-1999), పొద్దుపొడుపు, దళిత పాటలు.

కథా రచయితగా : వీరి కథలు దళిత కథలు పేరిట 2006 లో ప్రధమ ముద్రణ పొందగా 2012 లో ద్వితీయ ముద్రణ ను పొందింది. ఈసంకలనంలో ఇనాంశేలుక, భీమపూరి, అ మ్మక్క, గౌరడు , జప్తి అనే 5- కథలు కలవు. ఈ కథలలో దోర కులంలో దళితుల పరిస్థితి ఎంత దయనీయంగా వుందో చెప్పారు.

నవలాకారుడిగా : గూడ అంజయ్య 2008 లో పోలిమేర అనే నవలను రాసారు. ఇదీ ఎమర్జన్సీ కాలం నాటి పరిస్థితులను చిత్రీకరణ చేసింది. ఈ నవలకు 2015 లో తెలుగు విశ్వవిద్యాలయ వారి ఉత్తమ నవలా పురస్కారం లభించింది.

సిన్మా పాటల రచయిత : పేదోడి కోసమే పాట అనీ చెప్పే అంజయ్య పాటను ఏనాడూ కమర్షియల్ సినిమా కోసం రాయలేదు. సినిమా కు వీరి పాట అవసరం అనుకోని పెట్టుకున్న వాళ్లే అధికం. 90 వ దశకం లో పీపుల్స్ ఎన్ కౌంటర్ అనే చిత్రం వచ్చింది. దీనిలో ఊరుమనదిరా అనే పాటను వేటూరి సుందర రామ్మూర్తి కాపీ కోట్టి వక్రీకరించి రాసారు. దీంతో దాని ఓరిజినల్ రచయిత గూడ అంజయ్య ప్రెస్ మీట్ పెట్టి ఖండించడక తప్పలేదు. అప్పుడే అసలు విషయం బయట పడింది.మరో విషయం ఈ పాట ను జన నాట్య మండలి వారి పాట కావడం చేత ఈ పాటను గద్దర్ రాసాడనీ అనుకునేవాళ్లు ఉన్నరట (గురి చూసే పాట గూడ అంజయ్య – సి.కాశీం గారి వ్యాసం అధారం గా) మరో పాట బి.నర్సింగరావు దర్శకత్వం లో రంగుల కల అనే సినిమా వచ్చింది. దాని లో అంజయ్య రాసిన భద్రం కొడుకో జర పదిలం కొడుకో అనే పాటను అంజయ్య రాయగా గద్దర్ పాట పాడారు. గూడ అంజయ్య పాటలు దండోరా , ఎర్ర సైన్యం , ఒసేయ్ రాములమ్మ , చీమల దండు , చీకటి సూర్యుడు , రైతు రాజ్యం , వీర తెలంగాణ, అడవిలో అన్న, పోరు తెలంగాణ , స్వర్ణక్క వంటి చిత్రా లలో కలవు. ‘ఊరు విడిచినే పోదునా…ఉరి వేసుకుని సద్దునా’ అనే పాట గూడ అంజయ్య తొలి పాట. నాటి గ్రామాలలో దొరల దాష్టీకం కు బలి అయిన ఒక పేదరైతు ఆత్మఘోష ఇది.

1972 లో నల్లగొండ జిల్లా పులివెల లో ఒక రైతు కూలీ వ్యధ విని ఆ రైతు కూలీ సభలో గూడ అంజయ్య పాడిన పాట ఊరు మనదిరా. వీరు రాసిన ఈ ఊరు మనదిరా పాట ఎంతగా ప్రాచుర్యం పోందినది అంటే ఏ మారు మూల పల్లె లో విన్నా ఒకప్పుడు ఈ పాటనే కూలీల సుప్రభాతంగా వినిపించేది.అంతెందుకు ఇప్పటి కూడా దోరల పెత్తనం ఏక్కడా వున్నా ఈ పాట వినిపించక మానదు. ఇప్పటి కీ నిరంకుశత్వ నాయకుల పైన సామన్యులు పలికే అస్త్రము ఈ పాట. పీడితుల పాలిట ధిక్కార స్వరం ఈ పాట. ఊరులో దోరతనం వున్నంత కాలం ఈ పాట ఉంటుందనీ ప్రజా యుద్దనౌక గద్దర్ ఈ పాట కు కితాబు ఇచ్చారు. ఇదే పేరు తో గూడ అంజయ్య పాటల సంకలనం వెలువడింది. ఇందులో 77 పాటలు కలవు. దీనిలో ఊరిడిసిబోదునా , అసలేటి మనల్లో మహామహుడు అంబేద్కర్ వంటి పాటలు కలవు. ఈ ఊరు మనది రా పాట 16 భాషలల్లోకి అనువాదం అయ్యింది.

గూడ అంజయ్య ప్రముఖ పాటలు : భద్రం కొడుకా…..నా కొడుకో కొమురన్న జర (ఎర్ర సైన్యం), లచ్చులోలచ్చన్న… (ఒసేయ్ రాములమ్మ), వేగి చుక్కల్లోకీ తీసుకున్న (ఒసేయ్ రాములమ్మ), ఊరి ఉసినే బోదునా, నా రక్తం తో నడుపుతాను రిక్షను…, ఎత్తర తెలంగాణ జెండా, నా తెలంగాణ నన్ను గన్న నా తెలంగాణ, పాలపిట్టలారా, పైడి కంటేల్లారా…, అసలేటి వానల్లో ముసలెడ్లు కట్టుకుని, ఇగ ఎగబడు దామురో ఎములాడ రాజన్న, నల్లగొండ జిల్లా ఇది విప్లవాల ఖిల్లా , ఎర్ర జెండా ఎగరాలి మల్లా మల్లా, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, ఊరు మనదిరా…వాడ మనదిరా, అయ్యోనివా….నువ్వూ అవ్వోనివా, రాజిగో ఓరీ రాజిగా, తెలంగాణ గట్టు మీద సందమామయ్యో.

పేదల కష్టాలే కలము చేసుకుని పాటలు రాసిన అంజయ్య గారు 2007 లో వారి 18 పాటలతో సంకలనం గా తీసుకొని వచ్చారు. దొరల పెత్తనం కు ,దోపిడీ కీ , ఆగడాలకు గురి చూసీ కొట్టిన ఫిరంగి లాంటి మాటలు గూడ అంజయ్య పాటలు. 1970-78 వరకు అంజయ్య రాసిన పాటలు ఒక సంకలనం గా వచ్చింది. ఆ తర్వాత 1999 లో వీరి పాటలు ఊరు మనదిరా పేరు తో మరో పుస్తకం గా వచ్చింది.

తెలంగాణ ఉద్యమంలో పాత్ర : తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న వీరు మలిదశలోను కీలక ముఖ్య భూమికను పోషించి పాటలతో ఉద్యమానికీ పల్లవి అందించారు.రసమయి బాలకిషన్ తో ధూం ధూం ప్రారంభించి ఉద్యమానికీ కొత్త ఊపును ఇచ్చారు. పాటకు ఇంత ప్రజా బలం ఉంటుందనీ నిరూపించిన కవి అంజయ్య. వీరి ప్రతి పాట వాస్తవ చిత్రణ గల ఒక దృశ్య కావ్యం. తడిమి చూడాలే కానీ ప్రతి పాటలోను పేదల కన్నీళ్ళు తగుల్తాయి.వీరి పాట ఉద్యమాల గుండె చప్పుడు. గూడ అంజయ్య 2003 లో మలి దశ ఉద్యమం లో పాట కవుల వేదిక ను ఏర్పాటు చేసి ఉద్యమం కు ఊపిరి పోసారు. అమరవీరులపైన పాటలు కట్టారు. తెలంగాణ ఉద్యమకారుడు శ్రీపాద శ్రీ హరిపై లక్షలాది చుక్కల్లో ఏ చుక్కల్లో వున్నావో అంటూ స్మృతి గీతం రాసారు.

దళితులకు అండగా : గూడ అంజయ్య గారు చిన్నతనం లో పగలంతా పంట పోలాలలో ఆడుకుంటూ రాత్రేయ్యేసరికి భాగోతము , జంగాల కథలు వింటూ గడిపేవారు. అంటరానితనం అనే అవలక్షణం వల్ల ఊరి బడి లో వివక్షకు గురి అయ్యాడు. ఆ తర్వాతే తెలుసుకున్నారు ఈ అంతరం బడి లోనే కాదు ఊర్లోను , దేశం లోను ఆనీ అందుకే దళితులనగా ఎవరు?! ధరణీలోని దరిద్రులంతా దళితులే అంటూ దళితుల పక్షనా నిలిచారు గూడ అంజయ్య.

వివిధ సంస్థలలో క్రియాశీల పాత్ర : గూడ అంజయ్య తన మిత్రులతో కల్సి 1971 లో అరుణోదయ కళా సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసారు. అలాగే 1987 లో కళా స్రవంతి అనే సంస్థ ను, 1990లో దళిత సాహితీ కళా వేదిక ను ఏర్పాటు చేసారు. 1992 లో రచయితలారా , కవులారా మీరేటూ అంటూ సవాల్ విసిరాడు. బి.యస్.రాములు వంటి కొందరు ప్రముఖులతో కల్సి కళాకారుల , మేధావుల ఐక్య వేదిక స్థాపించారు. దీని ద్వారా స్వేచ్ఛ అనే కవితా సంకలనం ను వెలువరించారు. గూడ అంజయ్య నటుడి గా కూడా కొన్ని చిత్రాలలో నటించారు. వీరు ఎర్ర సైన్యం , మా భూమి , దండోరా, చీకటి సూర్యులు వంటి చిత్రాలలో పాత్రలు పోషించారు. కంచికచర్లలో దళితుడైన కోటేశును సజీవ దహనం చేసినప్పుడు అంజయ్య ఈ దారుణ మారణకాండను నిరసిస్తూ ఒక పాటను రాసారు. దళితులపై వివక్షను ప్రశ్నించారు.

బిరుదులు : కీర్తి దళిత రత్న, కవి దిగ్గజ గండపెండేర, సాహిత్య రత్న (1986), గండ పండేరా (2000), దళిత సేవ రత్న, దళిత కళ రత్న.

పురస్కారాలు : తెలుగు సాహితీ సమితి అవార్డు (1998), మలయ శ్రీ సాహితీ అవార్డు (2004), తెలంగాణ ప్రభుత్వ సాహితీ పురస్కారం (2015), సుద్దాల హనుమంతు జానకమ్మ స్మారక పురస్కారం (2015), 2015 లో పోలిమేర నవలకు తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ నవలా పురస్కారం.

ముగింపు : మట్టి బిడ్డలు వీరి పాటలను సొంతం చేసుకొని గజ్జె కట్టి ఆడారు. పాడారు. ప్రజల నాలుక పైన దశాబ్దాల పాటు గా సాగుతున్న గానం గూడ అంజయ్య. వీరు పక్షపాతంతో బాధపడుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేయూత ఇచ్చింది. మహా వాగ్గేయకారుడైన గూడ అంజయ్య చివరిదశలో కామెర్లు, మూ త్రపిండాల వ్యాధితో బాధ పడుతూ 21జూన్ 2016న రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలోని తన స్వగృహంలో మరణించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News