Friday, April 19, 2024

సంపాదకీయం: మళ్లీ గుజ్జర్ల ఆందోళన

- Advertisement -
- Advertisement -

Election expenditure limits for Lok Sabha and Assembly polls రాజస్థాన్‌లో గుజ్జర్ల కోటా ఆందోళన మళ్లీ రగులుకున్నది. రైళ్లు సహా మొత్తం రవాణాను, దారులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. 2ంంకు పైగా బస్సులు ఆగిపోయాయి. ఢిల్లీ, ముంబై రైలు మార్గం మూతపడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గతంలో పదుల మంది దుర్మరణానికి దారి తీసిన గుజ్జర్ల ఉద్యమం ఇప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అగ్ని పరీక్షగా మారింది. హిమ్మత్ సింగ్ నాయకత్వంలోని ఒక వర్గం ఆందోళనకారులతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఫలించలేదు. 85 ఏళ్ల కైరోరి సింగ్ బెయిన్ స్లా సారథ్యంలోని గుజ్జార్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి పోరాటం కొనసాగుతున్నది. ప్రభుత్వ ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్ల సంపూర్ణ అమలును ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కోటా కింద రావలసిన ఉద్యోగాలన్నింటికీ తక్షణమే నియామక ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పోరాటం విరమించేది లేదని వారు భీష్మించుకున్నారు. అంత వరకు రైలు పట్టాల మీదనే భోజనాలు చేసి నిద్రపోతామని ప్రకటించారు.

తమ 5 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగం 9వ షెడ్యూల్‌లో చేర్పించాలని వారు పట్టుబడుతున్నారు. ఈ అంశం రాష్ట్రం చేతుల్లో లేదన్న విషయం తెలిసిందే. రాజ్యాంగం 9వ షెడ్యూల్‌లో చేర్చే చట్టాలు కోర్టులలో సవాలుకు అతీతంగా ఉండి శాశ్వతత్వాన్ని పొందుతాయి. తమిళనాడులో అమలవుతున్న 69 శాతం కోటాను ఈ షెడ్యూల్‌లో చేర్చారు. అది పార్లమెంటు ఆమోదంతో జరగవలసిన చర్య. అయితే ఈ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగకరమైనవిగా ఉంటే వాటిపై న్యాయస్థానాలు విచారణ జరపవచ్చని అవి కోర్టుల్లో సవాలుకు అతీతమైనవి కాబోవని సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం 1973 ఏప్రిల్‌లో తీర్పు చెప్పింది. కాని 9వ షెడ్యూల్ కొనసాగుతున్నందున దాని కింద రక్షణను కోరడమూ జరుగుతున్నది. హిమ్మత్ సింగ్ నాయకత్వంలోని గుజ్జర్ రిజర్వేషన్ కమిటీకి మంత్రివర్గ ఉప సంఘానికి కుదిరిన 14 అంశాల అంగీకారం ప్రకారం తాత్కాలిక ఉద్యోగ (ప్రొబేషన్ ) కాలాన్ని పూర్తి చేసుకున్న 1252 మంది సిబ్బంది కొలువులను క్రమబద్ధం చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.

ఈ ఒప్పంద పత్రాలు చిత్తు కాగితాలతో సమానమని కైరోరి సింగ్ బెయిన్ స్లా ఎద్దేవా చేశారు. ఈయన నాయకత్వంలో గతంలో గుజ్జర్లు, తదితర ఐదు అనుబంధ కులాల సంక్షేమం కోసం దేవ్ నారాయణ్ యోజన పథకాన్ని సాధించుకున్నారు. ఈసారి అటువంటి ఆర్థిక ప్రోత్సాహాలకు తల ఒగ్గే ప్రసక్తి లేదని ఈ వర్గం పట్టుబడుతున్నది. పశువుల మందలను మేపుకునే సంచార వృత్తికి చెందిన గుజ్జర్లు మరి నాలుగు అనుబంధ కులాలు రాజస్థాన్ జనాభాలో 5 శాతం వరకు ఉంటారు. వీరు అస్పృశ్యత అమానుషానికి గురైన వారు కానందున ఎస్‌సిలలో చేరరు. పూర్తి ఆదివాసీ స్థితిలో లేనందున ఎస్‌టిలు కారు. కాని నిరుద్యోగం, పేదరికం అనుభవిస్తున్నందున అత్యంత వెనుకబడిన కులాలు(ఎంబిసి) గా వర్గీకరించి ప్రత్యేక కోటాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ జనాభా శాతం మేరకు 5 శాతం కోటా ఇవ్వాలంటూ వీరు 2008లో, 2015లో జరిపిన ఆందోళనలపై జరిగిన కాల్పుల్లో 30 మందికి పైగా చనిపోయారు. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం కోటా హద్దుకు లోబడి 1 శాతం రిజర్వేషన్లు వీరు పూర్వం నుంచి అనుభవిస్తున్నారు. 5 శాతం కోటా ఇస్తే రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం హద్దును దాటిపోతాయి.

గత ప్రభుత్వాలు ఆ మేరకు కల్పించిన 5 శాతం కోటాను హైకోర్టు కొట్టి వేసింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారి(ఇడబ్లుఎస్) కి 10 శాతం కోటాను కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించడంతో గుజ్జర్ల కోటా కూడా చెల్లుబాటవుతుందని చెప్పి గెహ్లాట్ ప్రభుత్వం గత ఏడాది చట్టం ద్వారా వీరికి 5 శాతం కోటాను ఇచ్చింది. అయితే అది సమగ్రంగా అమలు కావడం లేదన్నది ప్రస్తుత ఆందోళనకు మూల కారణం. గుజ్జర్లకే చెందిన సచిన్ పైలెట్ తన 19 మంది ఎంఎల్‌ఎలతో ప్రకటించిన తిరుగుబాటును విరమించుకొని తిరిగి కాంగ్రెస్‌లో చేరి గెహ్లాట్ ప్రభుత్వానికి సహకరించడం ప్రారంభించిన తర్వాత గత సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రికి ఈ సమస్యపై ఒక లేఖ రాశారు.

గతంలో అంగీకరించిన దేవ్ నారాయణ్ సంక్షేమ పథకం మూలబడిపోయిందని పోలీసు, పంచాయతీరాజ్, జైల్ గార్డులు, సెకెండ్ గ్రేడ్ పాఠశాల ఉపాధ్యాయులు మున్నగు ఉద్యోగాల్లో గుజ్జర్లకు 5 శాతం కోటా అమలుకు నోచుకోడం లేదని అందులో పేర్కొన్నారు. అందుచేత ఈసారి 5 శాతం కోటా అమలుపై తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటేగాని గుజ్జర్లు శాంతించే సూచనలు కనిపించడం లేదు. సచిన్ పైలెట్ సహకారంతోనో, ఇతర చాకచక్యమైన వ్యూహాలు పాటించడం ద్వారానో ఈ సమస్యను పరిష్కరించుకోడం ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు క్లిష్టమైన పరీక్షగా మారవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News