*పోటాపోటీగా సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు *బయటపడ్డ విభేదాలు
*మెజార్టీ నియోజకవర్గాల్లో సేమ్ సీన్
సిఎం కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలు టిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించుకున్నారు. వలసలతో ఓవర్‌లోడ్ అయిన టిఆర్‌ఎస్ పార్టీలో మెజార్టీ నియోజకవర్గాలలో రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు కెసిఆర్ ప్రాపకం కోసం పోటాపోటీగా వేడుకలను నిర్వహించడం చూసిన జనం మాత్రం నవ్వుకున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో అధికార పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడానికి పోటీలు పడ్డారు. గులాబీ దళంలో సీనియర్‌లు, వలస నేతలు చాలా మంది రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ తమ నియోజకవర్గాలలో పెద్ద పెద్ద ఫ్లెక్ల్సీలను ఏర్పాటు చేయడంతో పాటు పోటీలు పడి ఆర్భాటంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో పాలమూరు ఎంపి జితేందర్ రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ ఆర్భాటంగా ఆర్‌ఆండ్‌బి అతిథి గృహంలో కేక్‌కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించి వృద్ధాశ్రమంలో వంట సామాగ్రీ అందచేశారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నేతృత్వంలో క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రెండు వర్గాలు షాద్‌నగర్‌లోనే వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం చూసిన స్థానికులు మాత్రం వర్గపోరుపై పలు రకాలుగా చర్చిం చుకుంటున్నారు. చేవెళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కె.యస్.రత్నంలో పోటీపడి వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. చేవెళ్ళ మండల కేం ద్రంతో పాటు పలు ప్రాంతాల్లో రెండు వర్గాల నేతలు ఎవరికి వారే యమునతీరే అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ కోసం పనిచేసే నేతలు చాలా మంది ఇద్దరి కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయా రు. కల్వకుర్తి నియోజకవర్గంలో సైతం కలసి కార్యక్రమాలు నిర్వహించడానికి ఇష్టం లేని బడా నాయకులు కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇంటి వద్ద కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించగా సీనియర్ నాయకులు గోలీ శ్రీనివాస్ రెడ్డి మాడ్గుల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. మరో ఇద్దరు ఆశావాహూలు మాత్రం అడ్రస్ లేకుండా పోవడంపై స్థానిక కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో సైతం నాయకులు ఎవరికి వారే పుట్టిన రోజు వేడుకల ను నిర్వహించుకుని తమ సత్తా చాటుకోవడానికి ప్ర యత్నించినట్లు ప్రచారం జరుగుతుంది. పలు నియోజకవర్గాలలో టిఆర్‌యస్ వర్గపోరు బహిర్గతం అయింది.
శివార్లలో సందడి…
కెసిఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని శివారు నియోజకవర్గాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్.బి.నగర్, మేడ్చల్ తదితర నియోజకవర్గాలలో కేక్ కట్ చేయడంతో పాటు అనాధశ్రమంలో దుస్తుల పంపిణి, అన్నదానం, దేవాలయాల్లో పూజలు వంటి కార్యక్రమాలు కొనసాగాయి. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలలో కార్పొరేటర్‌లు ఎమ్మెల్యేలకు దీటుగా పోటి కార్యక్రమాలు నిర్వహించారు. సియం కెసిఆర్ పుట్టిన రోజుతో పాటు మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పుట్టిన రోజు కూడ కలసిరావడంతో మేడ్చల్ నియోజకవర్గంలో టిఆర్‌యస్ శ్రేణులు అర్బాటంగా ఇద్దరు నేతల పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకున్నారు.