Home ఎడిటోరియల్ సంపాదకీయం: టీచర్లకు తుపాకీ శిక్షణ!?

సంపాదకీయం: టీచర్లకు తుపాకీ శిక్షణ!?

 sampadakeyamఅమెరికా స్కూళ్లలో విద్యార్థులపై కాల్పుల ఘటనలను అదుపు చేసేందుకుగాను తుపాకులు పేల్చటంలో టీచర్లకు ఉత్తమ శిక్షణ!? పరిష్కారమా?
“టీచర్లకు, కోచ్‌లకు మంచి శిక్షణ ఇచ్చి తుపాకులిస్తే, పోలీసులు వచ్చేలోపు సమస్య పరిష్కారమవుతుంది. గొప్ప నిరోధన.” “స్కూల్లో తుపాకీ పేల్చటంలో సుశిక్షితులైన టీచర్లున్నారని తెలిస్తే ఎవడూ స్కూలుపై దాడికి ఎన్నడూ ప్రయత్నించడు” ఇవీ మోడీ ట్వీట్లు. అయితే ఈ సూచనను సిఎన్‌ఎస్, ఎన్‌బిసి అపహాస్యం చేయగా, అమెరికాలో అతిపెద్ద టీచర్ల సంఘం నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్(ఎన్‌ఇఎ) అధ్యక్షురాలు ఎల్.ఇ.గార్సియా అధ్యక్షుడి సలహాను తోసిపుచ్చారు. “స్కూలు సిబ్బందికి ఆయుధాలివ్వాలన్న ఐడియాను తల్లిదండ్రులు, టీచర్లు ఎన్నడూ అంగీకరించబోరు. స్కూళ్లలోకి మరిన్ని తుపాకులు ప్రవేశపెట్టటం తుపాకీ హింసనుంచి విద్యార్థులను, టీచర్లను కాపాడవు” అనిఆమె అన్నారు. మరో పెద్దసంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ అధ్యక్షురాలు ఆర్.వీన్‌గార్టెన్ మరింత కటువుగా వ్యాఖ్యానించారు. టీచర్లకు ఆయుధాలివ్వటం ద్వారా స్కూళ్లను సైనిక కోటలుగా మార్చే ప్రయత్నాలను “ఆయుధ పోటీగా” పోల్చారు.

ఫ్లోరిడా రాష్ట్రంలోని పార్క్‌లాండ్‌లో మర్జోరీ స్టోన్‌మాన్ డగ్లస్ హైస్కూలుపై నికోలస్ క్రుజ్ అనే పూర్వ విద్యార్థి ఒకడు గత బుధవారం కాల్పులు జరిపి 14 మంది విద్యార్థులను, ముగ్గురు టీచర్లను హతమార్చిన ఘోరకలి అనంతరం అమెరికన్ సమాజంలో

‘తుపాకీ సంస్కృతి’పై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ స్కూలు విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశంలో ట్రంప్ ఆ సూచన చేశారు. సెమీ ఆటోమేటిక్ తుపాకులను ఆటోమేటిక్ తుపాకులుగా మార్చే పరికరాల విక్రయాన్ని (వాటిపేరు ‘బంప్ స్టాక్స్’) నిషేధించాలన్న సూచనను ట్రంప్ అంతకుముందు బలపరిచారు. స్టీఫెన్ పెడ్డాక్ అనేవాడు 2017లో లాస్‌వెగాస్‌లో సంగీత కచ్చేరి వీక్షిస్తున్న వారిపై కాల్పులు జరిపి 58మందిని బలిగొన్న నాటినుంచీ ‘బంప్‌స్టాక్స్’పై నిషేధం విధించాలనే డిమాండ్ బలపడుతున్నది. ఆ రాక్షసుడు అటువంటి ఆయుధం ఉపయోగించాడు. వాటి నిషేధంపై డెమొక్రాట్స్, కొంతమంది రిపబ్లికన్స్, అత్యంత శక్తిమంతమైన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ తుపాకీ లాబీ ఏకీభవించటం అరుదైన విషయం. తుపాకులు కొనేవారి నేపథ్యంపై గట్టి దర్యాప్తు ఉండాలని ట్రంప్ భావిస్తున్నారు.

అమెరికన్‌లను, ముఖ్యంగా స్కూలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలవరపెడుతున్న పార్క్‌లాండ్ హైస్కూలు కాల్పుల ఘటన తదుపరి ఒకవైపు విద్యార్థులు నిరసన ప్రదర్శనలు జరుపుతుండగా అధ్యక్షుడు ట్రంప్ అయోమయంలో ఉన్నట్లు విదితమవుతున్నది. రాజకీయ పార్టీలనుంచి లాంఛనమైన ఖండనలు తప్ప ‘తుపాకీ సంస్కృతి’ని అంతం చేసే అభిప్రాయాలు వెల్లడి కావటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ‘తుపాకుల ఉత్పత్తి పరిశ్రమ’ లాబీ అత్యంత శక్తి కలిగి ఉండటమేకాదు, అమెరికా చరిత్ర వారికి అండగా ఉంది. అమెరికా ఖండాన్ని ఆక్రమించిన శ్వేతజాతీయులు మూలవాసులైన రెడ్ ఇండియన్‌లను ఊచకోతకోసి మారుమూల ప్రాంతాల్లోకి తరిమివేసిన నేపథ్యంలో, బానిసలుగా తెచ్చుకున్న నీగ్రోలకు స్వేచ్ఛ కల్పించిన పూర్వరంగంలో శ్వేతజాత్యాహంకార రాష్ట్రాలు తమ పౌరులు ఆత్మరక్షణ నిమిత్తం తుపాకులు కలిగి ఉండటాన్ని హక్కుగా ఇచ్చాయి. శతాబ్దా లు గడిచిపోయినా, ఎన్ని కాల్పుల ఘటనలు జరుగుతున్నా, ప్రాణాలు పోతున్నా ‘తుపాకీ సంస్కృతి’ని అంతం చేయటానికి రెండు రాజకీయ పార్టీల్లో ఏదీ ముందుకు రాదు. ఆ ప్రతిపాదన చేయటానికి ఏ గవర్నర్, ఏ రాష్ట్రం సాహసించదు. అదే ట్రంప్ డోలాయమాన స్థితిలో వ్యక్తమవుతున్నది. గత అధ్యక్షుడు ఒబామా కొన్ని ఆంక్షలు విధించటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

అధ్యక్షుడు ట్రంప్ వచ్చేవారంలో 50 రాష్ట్రాల గవర్నర్‌ల సమావేశం పిలిచారు. తుపాకుల చట్టాలను కట్టుదిట్టం చేయాలని కోరుతూ ఇప్పటికే నిరసన ప్రదర్శనలు, తరగతుల బహిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యార్థులు “మా ప్రాణాల కొరకు మార్చ్‌” పేరుతో మార్చి 24న వాషింగ్టన్‌లో ప్రదర్శన తలపెట్టారు. ఈ ఆందోళనలు, ఇతర ప్రయత్నాలు రాజకీయ వ్యవస్థపై తెచ్చే ఒత్తిడి ఏమైనా ఫలితమిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.