Home దునియా అశ్వదత్తుడు

అశ్వదత్తుడు

 

ధవళ పురాన్ని పరిపాలించిన రాజులందరూ దత్త వంశీయులే. ‘దత్త’ అనే నామధేయం వారి పూర్వీకుల నుంచి వచ్చింది. దీనికి తోడు వారి పరిపాలన కాలం స్వర్ణయుగం. యుద్ధంలో వారికి ఎక్కువ విజయాన్ని తెచ్చి పెట్టినవి అశ్వాలే. అశ్వాలంటే ఆ వంశపు రాజులందరికి విపరీతమైన మక్కువ. మేలుజాతి అశ్వాలను, యుద్ధానికి అనువైన అశ్వాలను ఎంత వెల పెట్టైనా కొనుగోలు చేస్తారు.

ప్రస్తుతం ధవళపురాన్ని నాగదత్తుడు పరిపాలిస్తున్నాడు. దేశంలోని మేలుజాతి అశ్వాలన్నింటిని కొనుగోలు చేస్తున్నాడు నాగదత్తుడు. వాటికి శిక్షణ ఇచ్చే బాధ్యతను సుమవర్మకు అప్పగించాడు. ఎన్నింటికో శిక్షణ ఇచ్చిన నైపుణ్యం సుమవర్మకు ఉంది. సుమవర్మకు ఇప్పడు వయసు సహకరించడంలేదు. కొత్తగా కొనుగోలు చేసిన కొన్ని అశ్వాలు అసలు మాట విడంలేదు.
సుమవర్మ నాగదత్తుని కలిసి “రాజా! నాకు వయసు పైబడింది. కొన్ని అశ్వాలు దారికి రావడం లేదు. ఎవరినైనా శిక్షకుడిని ఏర్పాటు చేయండి” అని చెప్పాడు. రాజు సరే అని “ఈ విషయం పై రేపే చాటింపు వేయిస్తాను” అన్నాడు. ఆ మరుసటి రోజే చాటింపు వేయించాడు రాజు. చాటింపు విని ఎందరో వచ్చారు కాని ఆ అశ్వాలు మాట వినలేదు. ఇక మా వల్ల కాదని వెళ్ళారు. చివరకు నాగదత్తుడు “ అశ్వాలను మచ్చిక చేసుక్ను వారికి అశ్వదత్తుడు అనే బిరుదు ఇచ్చి, కొలువు ఇస్తానని ప్రకటించాడు. కొంత కాలం వరకు ఎవరూ రాలేదు.

చిరకు దేశదిమ్మరిగా తిరుగుతున్న సునందునికి ఈ విషయం తెలిసి ధవళపురానికి చేరుకున్నాడు. రాజును కలిశాడు. “మీ అశ్వాలను దారికి తెచ్చే బాధ్యతనాది” అన్నాడు. రాజ భటులను పిలిచి సునందునికి అశ్వాలను చూపించమని, అశ్వశాలకు తీసుకెళ్ళమని ఆజ్ఞాపించాడు. భటుడు సునందుని అశ్వశాలకు తీసుకువెళ్ళాడు. అశ్వశాలను చూడగానే కళ్ళు చెదిరాయి. ఎన్నో మేలు జాతి అశ్వాలు అక్కడ ఉన్నాయి. వాటన్నింటిని పరిశీలనగా చూస్త్తూ వున్నాడు. భటుడు సుమంతునితో “ అదిగో అక్కడ ప్రత్యేకంగా ఉన్నాయే వాటినే నీవు దారికి తేవలసింది” అని చెప్పాడు. సునందుడు ఆ అశ్వాల దగ్గరకు వెళ్లాడు. సునందుడిని చూడగానే అవి గట్టిగా సకిలించాయి. ఆ అశ్వాలను ఎక్కడో చూచినట్లు గుర్తు. అవి కూడా సునందుని గుర్తు పట్టాయి. అవి ముందరి కాళ్ళు ఎత్తి మళ్లీ సకిలించాయి. ఇవి విజయపురంలోని అశ్వాలే. వాటికి ఓ రోజు అడవిలోఒక దానికి కాలికి, మరొక దానికి కంటి దగ్గర, ఇంకోదానికి మెడ దగ్గర బలమైన గాయాలై రక్తం ఒడ్డుతూ బాధ పడుతుంటే వాటికి పసరు పూసి కట్టు కట్టి వైద్యం చేశాడు. అప్పడే విజయపురి పైనికుడు వచ్చి

“ అశ్వాలు మావే దారి తప్పి వచ్చాయి. మీరు చేసిన వైద్యానికి కృతజ్ఞతలు” అని చెప్పి అశ్వాలను తీసుకు వెళ్ళాడు. అది గుర్తుకువచ్చి వాటి మెడ నిమిరాడు. అవి ఉత్సాహంగా ఉల్లాసంగా సునందుడి దగ్గరకు వచ్చాయి. వెంటనే భటుని ఆజ్ఞాపించి వాటికి జీను, కళ్లెం తెప్పించి, వాటిపై కూర్చుని రకరకాలుగా విన్యాసాలు చేయించి లోబరుచుకున్నాడు. ఈ విషయం రాజుకు తెల్సి అశ్వశాలకు వచ్చాడు. ఎవరికీ లొంగని ఈ అశ్వాలతో సునందుడు చేయిస్తున్న విన్యాసాలను చూసి చప్పట్లు చరచి “ సెభాష్ మా అశ్వ అధికారివి ఈ రోజు నుంచి నువ్వే. నీకు ఈ అశ్వశాల బాధ్యతలను అప్పగిస్తూ అశ్వదత్తుడు అనే బిరుదు కూడా ఇస్తున్నాను” అని ప్రకటించాడు. ఆ రోజు నుంచి సునందుడు అశ్వదత్తుడిగా ధవళపురానికి పేరు తెచ్చాడు. ఎన్నో అశ్వాలను తనదైన శైలిలో తర్ఫీదు ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు.

Gurram Story in Telugu

కనుమ ఎల్లారెడి, 63000 39854