Home ఎడిటోరియల్ విద్యా విప్లవం గురుకులం…

విద్యా విప్లవం గురుకులం…

Gurukulas

 

విద్యావిధానంలో ప్రస్తుతం ఉన్న అన్ని సమస్యలకు గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు, కానీ ఈ నమూనా తప్పకుండా, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, అగ్రకుల పేద వర్గాల్లో ఆణిముత్యలను వెలికి తీస్తున్నది. సురక్షితమైన, సుస్థిరమయిన, సమగ్రమైన రీతిలో తీర్చిదిద్దబడిన పిల్లలు వారి కుటుంబాలనే కాకుండా సమాజాన్ని కూడా తగురీతిలో తీర్చిదిద్దడంలో సఫలీకృతులవుతారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గురుకులాలు అంటే ప్రవీణ్ కుమార్‌కు ముందు, ఆయన తరువాత అనే ఒక తాత్విక సైద్ధాంతిక చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ మేము వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ, ఒక బాధ్యత గల ఐపిఎస్ అధికారిగా గురుకులాల సంస్థ సెక్రెటరీపై వస్తున్న ఆరోపణల గురించి మాత్రమే. ఏ స్వార్ధ ప్రయోజనాల కోసం ఆయన ప్రభుత్వ సహాయంతో గురుకులాల అభివృద్ధి చేయాలనుకున్నాడో చర్చించుకుందాం. భావి తరాలకు ఒక మేధా సంపన్నమైన కుల, మత రహిత విద్యార్థినీ విద్యార్థులను అందించడమే ఎజెండాగా, అదే స్వార్థంగా, విద్యార్థుల ఉన్నతి కోసం నియంతగా పని చేయడం తప్పయితే అలాంటి సెక్రెటరీని తప్పకుండా తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం.
ఎవరెస్టును మించిన సంకల్పం

1984 లో అప్పటి ఐఎఎస్ ఆఫీసర్ డా.ఎస్‌ఆర్ శంకరన్ ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ సొసైటీ (ఎపిఎస్‌డబ్లుఆర్‌ఇఐఎస్) ఏర్పడి ఎందరికో నిరుపేద వర్గాల వారికి కొంతమేర ఉన్నత విద్యను అందించిన గురుకులాలు నెలకొన్నాయి కాని చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించలేకపోయాయి. కానీ ఆ పరిస్థితులను ఛేదించుకుంటూ గురుకులంలో చదివిన ఓ అణగారిన వర్గాల బిడ్డ ఐపిఎస్‌గా ఎదిగి, తరువాత అదే గురుకుల సంస్థ సెక్రెటరీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం, విద్యార్థుల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం తారస్థాయికి వెళ్ళింది అనడంలో అతిశయోక్తి లేదు.

2012 జులై 4న ఎవరెస్ట్ మించిన సంకల్పంతో గురుకులాల సెక్రెటరీగా నూతన విద్యా విప్లవాన్ని ప్రవీణ్ మొదలుపెట్టారు. ఏ జాతి అయితే వేలాది సంవత్సరాలుగా విద్యకు దూరం చేయబడి, అణచివేతకు, అన్యాయానికి గురి చేయబడిందో ఎక్కడో ఊరికి దూరంగా గుడిసెల్లో బ్రతికే స్థితికి నెట్టి వేయబడిందో ఆ వర్గాల పిల్లలైన పూర్ణ, ఆనంద్ లను అతిచిన్న వయసులోనే 2014 మే 25 ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కించి, ఆ జాతి వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపాడు. 25 డిసెంబర్ 2016 న మరో చరిత్ర.
31 మంది దళిత, గిరిజన గురుకుల విద్యార్థులు, హిమాలయాల్లోని 17 వందల అడుగుల ఎత్తయిన రేనాక్ శిఖరాన్ని అధిరోహించారు. యూరోప్‌లో ఎత్తయిన శిఖరాగ్రం ఎక్కి, యావత్ భారత జాతి గర్వించేలా జాతీయ గీతం ఆలపించి తమ జాతీయతను చాటుకున్న విద్యార్థులు. అయినా ఎత్తయిన శిఖరాలు ఎక్కితే ఏమొస్తది అని అనుకునేటోళ్లు ఉన్నారు. ఎంత ఎత్తు నుండి చూస్తే అంత చిన్నగా కనిపిస్తాయి ఈ కులం, మతం, ఆచార, సంప్రదాయ కట్టుబాట్లు. ప్రపంచ దేశాలకు దీటుగా భారతీయురాలైన ‘మలావత్ పూర్ణ’ ఆనంద్ లను అతి చిన్న వయస్సులో ‘ఎవరెస్ట్ శిఖరం’ అధిరోహించేలా చేసి భారతీయతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత మన ప్రవీణ్ కుమార్‌దే. విద్యకు దూరమైనటువంటి ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. వివిధ రంగాలలో ప్రథమ స్థానాలలో మన గురుకుల విద్యార్థులు నిలుస్తున్నారు.

ప్రపంచ పోటీలలో భారతదేశం తరపున ఎన్నో క్రీడలలో పాల్గొని గురుకుల విద్యార్థులు పతకాలు సాధించేలా సమ్మర్ సమురాయ్ నిర్వహిస్తూ, విద్య అంటే చదువు ఒక్కటే కాదు ప్రాపంచిక జ్ఞానం, మానసిక, శారీరక ఔన్నత్యాన్ని ఒడిసి పట్టి అజ్ఞానాంధకారాన్ని తొలగించుకోవడం. భారత్ దర్శన్ పేరుతో భారతదేశ స్థితిగతులను అర్థం చేసుకొని భవిష్యత్‌లో నాయకులుగా ఈనాటి విద్యార్థులు తయారు అవుతారు. గ్రీన్ గురు, ఎర్న్ వైల్ యూ లర్న్ అనే గొప్ప కార్యక్రమాలతోపాటు, ఇ క్లబ్, యం క్లబ్ లపేరుతో అర్థం కాని విషయాలను సులువుగా అర్థం చేసుకుంటూ, కోడింగ్, మిషన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అత్యున్నత విద్యా విధానాలను గురుకులాల్లో ప్రవేశపెట్టారు. దీంతో అజీమ్ ప్రేమ్ జీ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీ లు గురుకుల విద్యార్థులతో నిండిపోతున్నాయంటే అది సాధారణ విషయం కాదు.

అణగారిన వర్గాల బిడ్డ గురుకుల కార్యదర్శిగా ఎదగడమే కాదు ఆ జాతి వారికి తిరిగి చెల్లించాలనే సంకల్పానికి కట్టుబడి పని చేయడం తను చేసిన మొదటి తప్పు. కార్పొరేట్ విద్య యుగంలో చదువును కొనుక్కొని ‘భట్టి’ విక్రమార్కుల తయారీకి పూనుకున్న కార్పొరేట్ సంస్థలకి, గురుకులాలు చెంపపెట్టులా చేయడం తను చేసిన మరో తప్పు.
విద్యను వ్యాపారం చేసుకున్న వాళ్లకు మించిన స్వచ్ఛమైన ఫలితాలు రావడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక్క 2017 లోనే 35 మంది విద్యార్థులు ఎంబిబిఎస్, బిడిఎస్ సీట్లు సాధించారు. ఫైన్ ఆర్ట్ మ్యూజిక్ స్కూల్ ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే పనిలో, డిగ్రీ కాలేజీ విద్యార్ధినిలకు డ్రైవింగ్ స్కూల్ పెట్టడం వల్ల పేద వారిని దోచుకుని వారి జీవితాలతో దోబూచులాడే ఇలాంటి ఏ సంస్థకైనా గురుకులాలు ఏకే అనుకుని కూర్చుంటే మేకు అయ్యాయి.

ఉన్నత వర్గాల విద్యార్థులే అమెరికా, ఆస్ట్రేలియాలలో పేరుగాంచిన యూనివర్శిటీలలో చదువుకోవడం ఇదివరకు ముచ్చట. ఇప్పుడు నిరుపేద అణగారిన వర్గాల పిల్లలూ ఓపెన్ కేటగిరిలో ఆయా యూనివర్శిటీలలో సీట్లు సంపాదిస్తున్నారు. వెరసి గురుకులాల విద్యార్థులు ఏ ఏ రంగాల్లో ఆసక్తికరంగా ఉన్నారో ఆ విద్యను నేర్పించడం నిష్ణాతులైన వారుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా సాగిపోతున్నాయి.

నేటి ప్రభుత్వ కలల ప్రాజెక్ట్ ఉచిత నిర్బంధ ఉన్నత విద్యా మిషన్‌లో భాగంగా గురుకులాల అభివృద్ధి ఆకాశమే హద్దుగా సాగిపోతుంటే, ఇది కార్పొరేట్ విద్యా సంస్థలకు, ప్రతిపక్షాలకు మింగుడు పడని అంశం. గురుకుల కార్యదర్శిని తొలగించడం అంటే గురుకులాల విద్యా విప్లవాన్ని అడ్డుకోవడం, లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల జీవితాల్లో చీకటి నింపడం ఇదీ మనువాద కార్పొరేట్ సంస్థల ప్రస్తుత లక్ష్యం.

దినదిన అభివృద్ధి చెందుతున్న గురుకులాలకు ఆదే విధంగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేస్తుంది. 2012-13లో రూ. 578 కోట్లు. 2013-14లో రూ. 956 కోట్లు. 2014- 15లో రూ. 1177 కోట్లు. 2015- 16లో రూ. 1378 కోట్లు. 2017-18లో రూ. 2167 కోట్లు. పూర్తి బడ్జెట్‌ను సద్వినియోగం చేసుకొని విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. ఇదే స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు.1984 నుండి 2012 -2013 వరకు 1,70,000 మంది విద్యార్థులు అయితే, ఇప్పుడు గురుకులాల్లో 1,64,798 మంది విద్యార్థులు వున్నారు.

గురుకులాల్లో విద్యార్థులకు జాతీయత వ్యతిరేక భావనలు నూరిపోస్తున్నారు అనడానికి కొంచమైనా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. జాతీయతను చాటడానికి కుల, మతరహిత సమాజ నిర్మాణంలో రాజ్యాంగబద్ధంగా గురుకుల కార్యదర్శి పని చేస్తున్నారు. వారి దృష్టిలో దేశభక్తి అనేది సినిమా టాకీస్‌లో నిలబడడం అయితే, మా విద్యార్థులు, ఎవరెస్టు శిఖరంపై, యూరోప్ శిఖరాగ్రంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి జాతీయ గీతం ఆలపించి తమ దేశభక్తి చాటుకోవడం. ఇందులో ఏది నిజమైన భక్తి? జ్ఞానం ఎవరి సొత్తూ కాదు. ఓపెన్ కేటగిరీలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిది దేశభక్తా, లేక జాతి అభివృద్ధిని ఓర్వలేక అసత్య ఆరోపణలు చేసే వారిదా..?

Gurukulas who Provided higher Education for Poor People