Home దునియా ఆది వాసి దండారి ఉత్సవం..

ఆది వాసి దండారి ఉత్సవం..

భారత్ మాట్రిమని, తెలుగు మాట్రిమని అంటూ మనం ’ఇ ’ ప్రపంచంలో మ్యాచ్ మేకింగ్ ల అవస్థలు పడుతూ ఉంటే ఆదివాసి ప్రపంచంలో ఎంత సులువుగా జంటలు కడుతున్నారో చూడాలి అంటే మటుకు తెలంగాణాలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళాల్సిందే . దీపావళి నాడు జరిగే దండారి – గుస్సాడీ నాట్య ఉత్సవమే వేదికగా స్వయంవరాలు జరిగే తీరు తెన్నులు తరతరాలుగా , ఎంత ముచ్చటగా జరుగుతున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు . దీపావళికి ఐదు రోజుల ముందే మొదలవుతాయి ఈ సంబరాలకి తయారీలు. ఆదివాసి రాజ్ గోండ్ ,కోలం తెగలకు చెందిన పెద్దలు తమ తెగలులో యువకుల కోసం దీపావళి నాడు పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు.

 

పెళ్లి కావలసిన యువకులు ఈ సంబరాల కోసమే వారి ఆనవాయితీ ప్రకారం నెమలి ఈకలుతో తయారు చేసిన ఘుసాడి టోపీలు ధరించి ఘుసారక్‌లుగా మారిపోతారు. కొంతమంది కొత్తగా మరి కొన్ని ఈకలు గుచ్చి, ఈ టోపీలని మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకుంటారుట. ఈ టోపీలు తయారుచేసే నిపుణులు ‘నెమలి మాకు పూజ్యనీయం, అందుకని మేం నెమళ్లని చంపి ఈకలు సంపాదించే చెడు పనులు చేయం, నేల మీద పడిన నెమలి ఈకలు మాత్రమే సంపాదించి ఇలా టోపీలు చేస్తాం, ఒక్కో టోపీలో సుమారు 1500 ఈకల వరకూ గుచ్చి తయారు చేస్తాం అని చెప్తుంటారు. ‘ అదే కాదు , ఘుసాడి గా మారడానికి కొన్ని పద్ధతులు పాటించాలి.

Gussadi-Dance1

ముందుగా దండేపల్లి మండలంలో గోదావరి నది ఒడ్డున వెలసిన పద్మాల్పురి కాకున్ దేవతకు మొక్కి , ఆ తరువాతే ఘుసాడిగా మారాలి. తెగకు ఇంతమంది అని లెక్క. మూడేళ్ళకి మించి ఒక్కరే ఘుసాడి కాలేడు అందరికీ అవకాశం లభించాలి అనే ఆదివాసి ఆలోచన ఎంత దూరదృష్టితో ఏర్పరిచినది. ఈ టోపీలు ధరించే యువకులు నాట్యం ఆడుతూ పెళ్లి కాని యువతులని ఆకర్షించే పనిలో పడతారు. ఆ ఉత్సవంలో ఓ రాత్రి , మర్నాటి పగలు దండారి ఘుసాడి నాట్యం ఆడుతూనే ఉంటారు నవ యువకులు. అవి చూస్తూ యువతులు తమకి నచ్చిన వారిని ఎంచుకోవడం వారి ఆనవాయితి. యువకులు ఆ రెండ్రోజులు రెండు మూడు తండాలను సందర్శిస్తూ , తమ ప్రజ్ఞలను ప్రదర్శిం చడం ఈ ఉత్సవం ప్రత్యేకత.

ఈ ఉత్సవం మరో ప్రత్యేకత ఏమిటి అంటే, ఇలా జత కట్టిన యువతీయువకుల నిర్ణయాన్ని పెద్దలు గౌరవించడం, ఆదివాసులు అయితేనేమీ, తరతరాల ఆనవాయితీలకు కట్టుబడి ఉండే కట్టు శ్లాఘనీయం. కాలంతో పాటూ వచ్చే మార్పులని అంగీకరిస్తూ గోండ్ తెగ పెద్దలు, ఈతరం పిల్లలకి చదువు చాలా అవసరం అని గుర్తించి , చదువుకున్న యువతీ యువకుల కు స్వాగతం చెపుతున్నారుట.ఆనవాయితీ, కట్టు , ఆచారాలు , నాగరికతలో ముఖ్యమైన చదువు చెట్ట పట్టాల్ వేసుకుని ఆడే ఈ దండారి నృ త్య ఉత్సవం సంగతులు ఎంత బాగున్నాయో కదా !

పి .వసంత లక్ష్మి