Home తాజా వార్తలు హరిత తెలంగాణను సాధిద్దాం!

హరిత తెలంగాణను సాధిద్దాం!

Gutha Sukhender Reddy

 గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
 పర్యావరణం గొప్పదనాన్ని చాటిన ఎంపి సంతోష్‌కుమార్‌పై ప్రశంసల జల్లు
 మొక్కలు నాటాల్సిందిగా మరో నలుగురికి సవాలు విసిరిన ఛైర్మన్

మన తెలంగాణ/హైదరాబాద్ : పెద్దఎత్తున మొక్కలు నాటి హరిత తెలంగాణను సాధించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం తన వ్యవసాయ క్షేత్రం లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ, పర్యావరణ గొప్పదనాన్ని చాటిచెప్పుతూ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకవెలుతున్న ఎంపి. జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. దీనిని ఒక సామాజిక ఉద్యమంగా కొనసాగిస్తున్న సంతోష్‌కుమార్ కృషి అభినందనీయమన్నారు. ఆయన విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటి తాను భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం మొక్కలు నాటాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సాగర్ సిమెంట్ అధినేత ఆనంద్ రెడ్డి, ఎన్‌టివి చైర్మన్ నరేంద్ర చౌదరిలకు గుత్తా గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో…ఫౌండర్ రాఘవ, టిఆర్‌ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
న్యూజిలాండ్‌లోనూ గ్రీన్ ఛాలెంజ్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా టిఆర్‌ఎస్ న్యూజీలాండ్ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి కొసన మొక్కలు నాటారు. టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్‌బిగిలా విసిరిన గ్రీన్‌ఛాలెంజ్‌కు స్పందించి మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి న్యూజీలాండ్‌లో మొక్కలు నాటుతున్నామన్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్‌లో తెలంగాణలో మూడు కోట్లకుపైగా మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ఈ స్పూర్తిని ప్రతి ఒక్కరు తీసుకుని మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణాన్ని పరిరక్షించి తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం త్వరలో 10 కోట్ల మొక్కల లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. తెలంగాణకు గ్రీన్ ఛాలెంజ్ ఆవశ్యకత ఉందని అందుకే తన నియోజకవర్గ ఎంఎల్‌ఎ సుంకే రవిశంకర్, గ్రామ సర్పంచ్ అప్పిడి సౌజన్యరెడ్డి , కరీంనగర్ మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, తన తండ్రి లక్ష్మారెడ్డిలు గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యణ్‌రావు కాసుగంటి, టిఆర్‌ఎస్ న్యూజీలాండ్ జనరల్ సెక్రటరీ నర్సింగరావు ఇనగంటి, ఉమెన్స్ అఫైర్స్ చైర్ పర్సన్ సునీత విజయ్, మెంబర్షిప్ ఇంచార్జీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.

Gutha Sukhender Reddy Accepts Green Challenge