Tuesday, April 16, 2024

హెచ్1 బి వీసాలపై నిషేధం

- Advertisement -
- Advertisement -
H-1B visas will be discontinued until end of this year

 

ఈ ఏడాది చివరి వరకు వీసాల జారీ నిలిపివేత
ట్రంప్ ప్రభుత్వం ప్రకటన
నేటినుంచే అమలు
ఇకపై ప్రతిభ ఆధారంగానే వలస విధానం: వైట్‌హౌస్ ప్రకటన
భారతీయ నిపుణులపై ప్రభావం

వాషింగ్టన్ : హెచ్1బి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమ వలస విధానం ‘ప్రతిభ ఆధారంగా’ మాత్రమే ఉంటుందని అంటూ… ఆ దిశగా మార్పులకు శ్వేత సౌధం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హెచ్ 1బి వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు రద్దు చేసింది. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే తమ దేశంలో స్థానం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నటు ్లఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నిర్ణయం బుధవారం(24వ తేదీ)నుంచి అమలులోకి రానుంది. కాగా ఈ నిర్ణయం ప్రభావం భారతీయ ఐటి నిపుణులపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇప్పటివరకు లాటరీ విధానం ద్వారా హెచ్1బి వీసాలు జారీ అయ్యాయని, ఇకపై గరిష్ఠ వేతనస్థాయి ఆధారంగా జారీ చేయనున్నామని అమెరికా అధికారులు చెప్పారు. సంస్కరణల్లో భాగంగా అత్యధిక వేతనాలు లభించే ఉద్యోగులకు మాత్రమే హెచ్1బి వీసాల జారీలో పెద్దపీట వేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. తద్వారా నిపుణులు మాత్రమే తమ దేశంలోకి అడుగుపెట్టడానికి వీలు కలుగుతుందని చెప్పారు. అమెరికా ఉద్యోగాలను చౌకగా లభించే ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులతో భర్తీ చేసే వీలు కల్పిస్తున్న ఇమిగ్రేషన్ విధానంలోని లోపాలను సవరిస్తున్నామని ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. హెచ్1బితోపాటుగా హెచ్2బి, జె1,ఎల్1బి వీసాల జారీని కూడా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నిలిపి వేశారు.

భారతీయ నిపుణులపై ప్రభావం

కాగా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు విదేశీయులనుంచి పోటీ తగ్గుతుందని భావిస్తున్నారు. ఇక వేతన, నైపుణ్య పరంగా వీసాదారులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇప్పటికే ఈ వీసాలపై అమెరికాలో ఉన్న భారతీయ ఐటి నిపుణులపై ఎలాంటి ప్రభావం ఉండదని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీసాల రెన్యువల్స్‌పై మాత్రం ప్రభావం పడనుందని నిపుణులు అంటున్నారు. వారు వీసా స్టాంపింగ్ కోసం ఏడాది చివరి వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అంతేకాకుండా అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1న ప్రారంభం కానున్నందున వివిధ భారతీయ, అమెరికన్ కంపెనీల్లో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న భారతీయుల వీసాల పునరుద్ధరణ కూడా జాప్యం కానుంది. అలాగే అమెరికాలో ఉద్యోగాలకోసం ప్రయత్నించే భారతీయ ఐటి నిపుణులకు సైతం నిరాశ ఎదురు కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News