Home అంతర్జాతీయ వార్తలు ఏప్రిల్ 1 నుంచి హెచ్ 1బి దరఖాస్తుల స్వీకరణ

ఏప్రిల్ 1 నుంచి హెచ్ 1బి దరఖాస్తుల స్వీకరణ

H1B-Visa

 అంతా ఆన్‌లైన్ ..ఫీజు పది డాలర్లు
ప్రాథమిక ఘట్టంలో వడబోతలు

వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1 బి వీసాల దరఖాస్తులను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి పరిశీలనకు స్వీకరిస్తారు. ఈ విషయాన్ని అమెరికా ఇమ్మిగేషన్ సంస్థ శనివారం ప్రకటించింది. హెచ్1 బి వీసాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ ఐటి నిపుణులకు ఇది శుభవార్తగా భావిస్తున్నారు. 2021 సంవత్సరానికి ఈ వీసాల జారీ కోసం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు మరింత అధునాతనం చేశారు. 2021లో ఈ వీసాల జారీకి సంబంధించిన దేశాల వారిగా పరిమితిని ఖరారు చేసుకున్నారు.

హెచ్ 1 బి వీసా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. దీని మేరకే వీసాల జారీ ఉంటుంది. వలసేతర వీసా విధానం అయిన హెచ్ 1 బి వీసా పొందిన ఐటి నిపుణులను అమెరికా కంపెనీలు ఉద్యోగాలలోకి తీసుకుంటున్నాయి. ఇండియా చైనాలకు చెందిన ఐటి నిపుణులను ఎక్కువ సంఖ్యలో అమెరికా ప్రముఖ సంస్థలు ఎంచుకుంటున్నాయి. అమెరికాలో వలసలు, వీసాల జారీలో కీలక బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థ అయిన అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) వారు ప్రతి ఏటా ఈ వీసా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఇప్పుడు తాము ఎలక్ట్రానిక్ నమోదు ప్రక్రియను పూర్తి చేసినట్లు ఈ సేవా విభాగం వారు తెలిపారు.

విశేషాలు, వివరాలు

హెచ్ 1 బి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను దాఖలు చేసుకోవాలి.
దరఖాస్తు పరిశీలన రుసుంగా పది డాలర్లు చెల్లించాలి.
2012 ఆర్థిక సంవత్సరానికి ఈ వీసాల జారీకి దరఖాస్తుల స్వీకరణ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి చేపడుతారు.
ఎలక్ట్రానిక్ సంవిధానంతో ఇకపై కాగితాలతో పని ఉండదు. డాటా వినిమయం సౌకర్యవంతం అవుతుంది. దరఖాస్తుదారులపై వ్యయ భారం తగ్గుతుంది.
హెచ్ 1 బి వీసా పరిధిలో ఉద్యోగులను తీసుకోదల్చిన కంపెనీల వారు వీటి జారీ పరిమితులకు కట్టుబడి ఉండాలి. దరఖాస్తులో ఆయా కంపెనీలు తమ మౌలిక సమాచారాన్ని , తాము తీసుకోబోయే ఉద్యోగుల వివరాలను పొందుపర్చాలి. ఇక హెచ్1 బి ర్యాండమ్ సెలక్షన్ విధానం పరిధిలో అవసరం అనుకుంటే యుఎస్‌సిఐఎస్ వారు వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ప్రాధమిక నమోదు ప్రక్రియను చేపడుతారు. ఇందులో వడబోసిన వారి పేర్లను వెల్లడిస్తారు. వీరంతా ఆ తరువాత ఏప్రిల్ నుంచి ఆరంభం అయ్యే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పేర్ల నమోదుకు అర్హులుగా ఉంటారని సంస్థ తెలిపింది. ప్రాధమిక స్థాయిలో వచ్చే దరఖాస్తులలో ఎంపిక అయిన వారు పూర్తి స్థాయి దరఖాస్తులకు అర్హులు కావడంతో ఎంపిక ప్రక్రియ సులభతరం అవుతుందని సంస్థ ఉప నిర్వహణాధికారి మార్క్ కౌమాన్స్ తెలిపారు. దేశంలో సరైన రీతిలో వీసాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఈ దిశలో పలు సదస్సులు నిర్వహించినట్లు పరిశ్రమల ప్రతినిధులతో చర్చించినట్లు వెల్లడించారు. పత్రరహిత నమోదు ప్రక్రియ నుంచి ఆన్‌లైన్ విధానానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.

H1B Visa application