Wednesday, April 24, 2024

భారత్ అంతటా వ్యాపిస్తున్న హెచ్3ఎన్2 ఫ్లూ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రోగులు వైద్యులను సంప్రదించకుండా విచక్షణారహితంగా యాంటీబయోటిక్స్, ఇతర ఔషధాలను వాడకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్), ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) సూచించింది. అప్పుడప్పుడు జ్వరంతో కూడిన దీర్ఘకాలిక దగ్గు గత కొన్ని నెలలుగా భారత దేశమంతటా వ్యాపిస్తోంది. ఇన్‌ఫ్లూయెంజాఎ కు సబ్‌టైప్ వ్యాధే ఈ హెచ్3ఎన్2. ఇతర సబ్‌టైప్స్ కంటే ఈ వ్యాధే ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరడానికి దారితీస్తోంది.
ఈ ఫ్లూ వేగంగా వ్యాప్తిచెందుతుండడం వల్ల బ్రోంకియల్ దగ్గు సిరప్‌లు, అలెర్జీ నిరోధక మందులు, పారాసెటమాల్ మాత్రలు వంటి ఔషధాల అమ్మకాలు ఢిల్లీ వంటి నగరాలలో 25 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.

ఐసిఎంఆర్ తెలిపినదాని ప్రకారం జ్వరంతో పాటు ఎగువశ్వాసకోశ(అప్పర్ రెస్పిటరీ) అంటువ్యాధులు ప్రజల్లో కనిపిస్తున్నాయి. బహుశా వాయుకాలుష్యం వల్ల అది తీవ్రమై ఉండొచ్చు. దీనికితోడు దగ్గు, వికారం, వాంతులు, గొంతు నొప్పి, శరీరపు నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. యాంటీబయోటిక్స్‌ను విచక్షణారహితంగా వాడొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) రోగులకు సూచించింది. వైద్యులను సంప్రదించకుండా ఔషధాలను వాడొద్దంది. ‘ప్రజలు ఎజిథ్రోమైసిన్, అమాగ్సిక్లావ్ వంటి యాంటీబయోటిక్స్ వాడేస్తున్నారు. ఎప్పుడు ఏ మోతాదులో తీసుకోవాలి అనేది తెలుసుకోకుండానే తరచూ వాడేస్తున్నారు. కాస్త నెమ్మదించగానే మానేస్తున్నారు. ఈ పద్ధతిన మానుకోవాలి. దానివల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్‌కు దారితీయొచ్చు’ అని ఐఎంఎ పేర్కొంది. ‘ఎవరితోనైనా కలిసినప్పుడు చేతులు కలిపి కరచాలనం చేయడం కూడా మానుకోవాలి’ అని తెలిపింది.

సాంక్రమిక వ్యాధులు సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోతాయి. జ్వరం మూడు రోజుల్లో తగ్గిపోతుంది. దగ్గు కనీసం మూడు వారాలైనా ఉంటుంది’ అని ఐఎంఎ పేర్కొంది. డాక్టర్లు సింప్టోమేటిక్ ట్రీట్‌మెంట్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి కానీ యాంటీబయోటిక్స్‌కు కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. వాయు కాలుష్యం కారణంగా వైరల్ కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా 15 నుంచి 50 ఏళ్ల వారిలోనే వైరల్ కేసులు ఎక్కువ ఉంటున్నాయంది. దానివల్ల ఎగువశ్వాసకోశ వ్యాధులు, జ్వరం వస్తున్నాయని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News