Home ఎడిటోరియల్ హేగ్ కోర్టే శరణ్యం

హేగ్ కోర్టే శరణ్యం

Pak-Choopu-Cartoon

పాక్‌లో సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించిన భారత జాతీయుడు కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ శాసనం భారత్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ వివాదాన్ని దౌత్యమార్గంలో పరిష్కరించుకోవాలని భారత్ యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ పాకిస్థాన్‌పై అంత ర్జాతీయ న్యాయస్థానంలో కేసు నడపడం మనకు మంచిది.
భారత జాతీయుడు కుల్ భూషణ్ జాదవ్‌పై తమ మిలిటరీ కోర్టు విచారణ జరిపిందని, గూఢచర్యం, విద్రోహ చర్యల ఆరోపణలు రుజువైనందున మరణ శిక్ష విధించిందని ఈనెల 10న పాక్ సైన్యం పౌర సంబంధాల విభాగం ప్రకటించింది. భారత్ ఈ ప్రకటన పట్ల అనుకున్న ట్టుగానే తీవ్రంగా ప్రతిస్పందించింది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. జాదవ్‌పై పాక్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అవి కల్పిత ఆరోపణలని చాటా రు. జాదవ్‌కు మరణశిక్షను అమలు పరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉండగలవని హెచ్చరించారు. తగినంత సాక్షాధారాలు లేకుండా మరణ శిక్ష విధించడాన్ని నిరసిస్తూ పాక్ ప్రభుత్వానికి ఈ అంశంలో భారత ప్రభుత్వం ఒక దౌత్య స్పందనను కూడా పంపింది. అది ముందే పథకం ప్రకారం సాగించదలచిన హత్య అని కూడా భారత్ ఆ దౌత్య సందేశంలో ప్రత్యారోపణ చేసింది. ఇరాన్ పర్యటనలో ఉన్న జాదవ్‌ను అపహరించి తప్పుడు కేసు పెట్టారన్నది ఈ వివాదంలో భారత్ వాదన.
ఆయనకు భారత దౌత్యకార్యాలయం ద్వారా న్యాయ సలహాదారు ను అందుబాటులో ఉంచాలని పదేపదే చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడం పట్ల పాక్ ప్రభుత్వానికి భారత్ గట్టి నిరసనను తెలిపింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కౌన్సెలర్ సౌకర్యాన్ని జాదవ్‌కు కల్పించాలని మంత్రి స్వరాజ్ ప్రకటన, ప్రభుత్వ దౌత్య స్పందన స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ హక్కును న్యాయ మార్గంలో వినియోగించుకొనే ఉద్దేశం భారత్‌కు లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వ్యవహారాన్ని ద్వైపాక్షికంగానే పరిష్క రించుకోవాలని, అందుకు దౌత్యమార్గం అనుసరించాలని భారత్ నిశ్చయంతో ఉన్నట్లు అర్థమవుతోంది. పాక్, భారత్ సంబంధాల్లో ప్రస్తుత ఎడం వలన జాదవ్‌కు న్యాయ సలహాదారును అమర్చడంలో అటువంటి దౌత్యయత్నాలు ఫలించకపోవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకొని భారతదేశం సకాలంలో పాకిస్థాన్ పై అంతర్జాతీయ కోర్టు (ఐసిజె)లో న్యాయ చర్యలు ప్రారంభించాలి. న్యాయ సలహాదారు సౌకర్యాన్ని కల్పించాలన్న అంతర్జాతీయ నియమాన్ని ఉల్లంఘించినందుకు ఆ దేశంపై తక్షణమే ఈ చర్య భారత్ తీసుకోవాలి. మన దేశపు సలహా యంత్రాంగాన్ని కూడా ఈ నియమం కింద జాదవ్‌కు కల్పించవచ్చు.
ఒక దేశానికి చెందిన ఎవరైనా వ్యక్తి అన్యదేశంలో బందీగా ఉంటే న్యాయ సహాయం అతని దేశం అందించడానికి ఆ నియమం వీలు కల్పి స్తోంది. వియన్నా మహాసభ (విసిసిఆర్) తీర్మానంలోని 36(1) (సి) అధికరణ కింద ఇందుకు ఆస్కారం ఉంది. దానిని జాదవ్ వివాదంలో భారత్ వాడుకోవాలి. 1963లో జరిగిన ఈ మహాసభ తీర్మానంలో భారత్, పాకిస్థాన్ రెండూ భాగస్వాములే. సార్వభౌమ్య దేశానికి విదేశం లోని తన జాతీయుల సంక్షేమంపట్ల బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ఈ అంతర్జాతీయ నియమం అవకాశం కల్పిస్తోంది. విసిసిఆర్ తీర్మానం ప్రకారం ప్రస్తుత కేసులో పాకిస్థాన్ నిర్వర్తించాల్సిన విధులు ఇవి:-
1) జాదవ్‌ను అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచిన విషయాన్ని వెంటనే భారత రక్షణ వ్యవస్థకు ఖచ్చితంగా తెలియపరచాలి. 2) జాదవ్‌కు స్వదేశం నుంచి న్యాయ సలహాదారు సౌకర్యం పొందే హక్కు గురించి కూడా తెలియపరచాలి. 3)న్యాయ నిపుణుల సంద ర్శన, సంప్రదింపులు, ఇతర న్యాయ చర్యల ద్వారా బందీకి రక్షణ వ్యవస్థను అందుబాటులో ఉంచాలి. జాదవ్ కేసులో పాకిస్థాన్ వ్యవహ రించిన తీరు విసిసిఆర్ తీరానానికి అనుగుణంగా లేదు. భారతీయ అధికారులకు ఆ దేశం సకాలంలో ఏ విషయం తెలియ పరచలేదు. జాదవ్‌కు న్యాయసహాయం అందించే అవకాశం కల్పించాలని భారత్ 13 సార్లు గత ఏడాది కాలంలో ఈ డిమాండ్ చేసినా పాక్ పట్టించుకోలేదు. అందుచేత భారత్ తాత్సారం చేయకుండా అంత ర్జాతీయ నియమాలను అనుసరించి హేగ్ కోర్టులో పాక్‌పై కేసు నడపాలి. అంతర్జాతీయ నియమాలను పాకిస్థాన్ పాటించక పోవడం, జాదవ్‌కు విధించిన మరణ శిక్ష వ్యవహారాల్లో అది చేసిన తప్పులను ప్రపంచ దేశాల దృష్టిలోకి తేవడానికి కూడా భారత్ తక్షణమే అంతర్జాతీయ న్యాయ స్థానానికి ఆ దేశాన్ని ఈడ్చాలి. ఇది దౌత్యవేత్తలు, న్యాయ నిపుణుల మాట. ముఖ్యంగా జాదవ్ నిర్బంధం విషయం భారత్‌కు సకాలంలో తెలియపరచడంలో పాక్ విఫలమైన వాస్తవాన్ని దాని మెడకే చుట్టడం భారత్ చేయాల్సిన పని. అలాగే న్యాయ సహాయ సౌకర్యం కల్పనకు నిరాకరించడం కూడా అది చేసిన మరో పెద్ద తప్పు. అందువల్ల ఐసిజెకి ఎక్కక భారత్‌కు తప్పదు. అనేక అంతర్జాతీయ ఒప్పందాల రీత్యా అటువంటి సౌకర్యం దానంతట అదే మనకు అందు బాటులోకి రాదు. వియన్నా మహాసభ తీర్మానానికి భారత, పాక్ రెండూ భాగస్వామ్య దేశాలు కాబట్టి ఈ విషయంలో భారత్‌కు కొంత వెసులు బాటు తప్పక ఉంటుంది.
2004లో అటువంటి చర్యను మెక్సికో తీసుకుంది. ‘అవేనా, ఇతర మెక్సికన్ జాతీయుల కేసు’ను అమెరికాపై ఐసిజెను నడిపించింది. వివిధ అమెరికా రాష్ట్రాలలో మరణ శిక్ష నుంచి మెక్సికన్ జాతీయులకు విముక్తి కల్పించాలని ఐసిజెకు పిటిషన్‌లో ఆ దేశం కోరింది. ఆ వివాదంలో అమెరికా ‘కాన్సులర్ నోటిఫికేషన్’ వంటి బాధ్యతలను మరచి తప్పు చేసినట్లు మెక్సికో ఆరోపించింది. ఆయా నిందితుల అరెస్టు సమయంలో వారికి స్వదేశ న్యాయ సహాయ నియమాన్ని కూడా అమెరికా ఉల్లంఘించిందని మెక్సికో ఈ కేసులో ఆరోపించింది. విసిసిఆర్ తీర్మానం 36వ అధికరణను అమెరికా ఉల్లంఘించినట్లు ఐసిజె తీర్పు చెప్పింది. అందు చేత మరణశిక్ష పడిన మెక్సికో జాతీయుల కేసులను అమెరికా పునఃపరి శీలించాలని ఆదేశించింది. ఈ ఉదాహరణను భారత్ ప్రస్తుతం జాదవ్ కేసులో వరవడిగా తీసుకొని ఐసిజెలో పాక్‌పై కేసు నడిపించాలి. దీని ద్వారా ఇతర దేశాల్లో నిర్బంధంలో ఉన్న భారత జాతీయులకు ఆందోళన నుంచి విముక్తి కల్పించినట్లు అవుతుంది కూడా. * యతీష్ బెగూరె