Friday, April 19, 2024

ఆధ్యాత్మిక నిలయం హంపి

- Advertisement -
- Advertisement -

మన దేశంలో ఉన్న చాలా ఆలయాలు చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లుగా తారసపడడం అత్యంత సహజం. అయితే చారిత్రక విశేషాలతో పాటు పౌరాణిక ప్రాశస్త్యాన్ని కూడా కల్గిన మహత్తర ఆలయాలెన్నో మన దేశంలో ఉన్నాయి. అది మహత్తర ఆలయమే కాదు, మనం అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే వసంతోత్సవానికి (హోలీ) పునాది వేసిన పుణ్య స్థలమది. అదే కర్ణాటక రాష్ట్రంలోని హంపి.

Hampi

హంపి అనగానే అద్భుతమైన కట్టడాలు, దేవాలయాలు స్ఫురణకు వస్తాయి. ప్రపంచ వారసత్వ సంపదగా రికార్టులకెక్కిన హంపి క్షేత్రాన్ని సందర్శించడానికి నేను ఇతర మిత్ర బృందంతో కలసి వెళ్లాను. హైదరాబాద్ నుంచి బళ్ళారి సుమారు 360 కిలోమీటర్లు దూరం. అందువల్ల మేమంతా ఓ వాహనంలో బయలుదేరాం. హైద్రాబాద్ నుంచి సుమారు ఎనిమిది గంటలు పట్టింది. అక్కడ నుంచి మరో 75 కిలోమీటర్ల దూరంలో హంపి ఉంది. అందువల్ల బళ్ళారి నుంచి తిరిగి గంటన్నర సమయం పట్టింది.
హంపి పరిసరాల్లోకి చేరుకోగానే అద్భుతమైన రాతి ద్వారాలు, కొండలు, గుట్టలు, కట్టడాలు నన్ను విపరీతంగా ఆకర్షించాయి. నేనేమీ మరో లోకంలోకి అడుగుపెట్టడం లేదుకదా అన్న అనుమానం కూడా నాలో కల్గింది. అంత అందమైన చిత్రమైన కట్టడాలను నేను అంతకు ముందు చూడలేదు. అందువల్ల వాటిని నఖశిఖ పర్యంతం చూస్తూ ముందుకి కదలిపోయాం. హంపిలో అనేక హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మా లగేజీ నంతటిని లాడ్జిలో ఉంచి హంపి పర్యటనకు ముందుకి వెళ్ళాను. హంపిలో నన్ను బాగా ఆకర్షించిన ఆలయం విరూపాక్ష దేవాలయం.

విజయనగర రాజుల కళాభిరుచికి, వారి ధార్మిక ప్రవృత్తికి నిదర్శనంగా నిలిచిన దివ్య క్షేత్రమిది. ఈ దివ్య క్షేత్రంలో శివుడు విరూపాక్షేశ్వర స్వామిగా పూజాదికాలందుకుంటున్నాడు. హంపి ఆధ్యాత్మిక చారిత్రక వైభవానికి ప్రధాన సాక్ష్యం పంపా విరూపాక్ష దేవాలయమని తెలుసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. హంపి విజయ నగర ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన పంపా విరూపాక్ష ఆలయం అంతు తెలియని అనేక ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. విజయనగర స్థాపన, హరిహర బుక్కరాయల ధర్మరాజ్య స్థాపనాదీక్ష ఈ ఆలయం నేపథ్యం నుంచే ప్రారంభమైంది. ఈ ఆలయ రాజగోపురం దూరం నుంచే నాకు కనిపించింది. తొమ్మిది అంతస్థులతో ఈ గోపురం ఉంది.

ఈ తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ. దానిని కింద నుంచి చూడడం నాకు బలే ముచ్చటేసింది. గోపురం లోపల ఎలాంటి అడ్డ నిలువు దూలాలు వాడకుండా పైదాకా సూచీ ముఖంగా నిర్మాణం చేపట్టారు. అష్టకోణాకృతిగా ఉండే ఈ రాజగోపురం నిర్మాణ సాంకేతిక నైపుణ్యం ఈనాటికీ అబ్బురమే. ఈ గోపురం 165 అడుగుల ఎత్తు, కింది భాగం 20 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు కలిగి పదకొండు అంతస్థులతో కనిపించింది. దీనిని బిష్టప్పయ్య గోపురమని పిలుస్తారట. విరూపాక్ష ఆలయానికి రెండు గోపురాలున్నాయి. మొదటి ప్రాంగణం నుంచి పశ్చిమ దిశకు వెళితే మరో గోపురం కనిపించింది. ఈ గోపురాన్ని రాయల గోపురమని పిలుస్తారట. ఈ గోపురం ద్వారా ప్రవేశిస్తే రెండో ప్రాకారం ఉంది. ఇక్కడ ధ్వజస్తంభాలు, దీపస్తంభాలున్నాయి. ఎడమవైపున పాతాళేశ్వర, ముక్తి, నరసింహ, సూర్యనారాయణ స్వామి ఆలయాలు, కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, మహిషాసుర మర్దని, వేంకటేశ్వర స్వామి ఆలయాలున్నాయి. దీనికి ఎదురుగా విరూపాక్షేశ్వరస్వామి వారి సన్నిధి ఉంది. ఆలయానికి ముందు రంగమండపం ఉంది. 1509లో శ్రీకృష్ణ దేవరాయలు దీనిని కట్టించారట.

7వ శతాబ్దం నుండి ఈ ఆలయం ఉందని అక్కడి వారు చెప్పగా విన్నాను. ప్రధాన దేవాలయానికి చాళుక్యులు, హోయసాల రాజుల పరిపాలన కాలంలో అనేక మార్పులు చేర్పులు జరిగాయని, అయితే ప్రధానాలయాన్ని మాత్రం విజయనగర రాజులే నిర్మించినట్లు తెలిసింది. అయితే విజయనగర రాజులు పతనమయ్యాక 16వ శతాబ్దం ప్రాంతంలో జరిగిన దండయాత్రల వల్ల హంపి నగరంలోని అత్యద్భుత శిల్ప సౌందర్యం పూర్తిగా నాశనమైపోయిందట. కానీ విరుపాక్ష- పంపా ప్రాకారం మాత్రం దండయాత్రల బారిన పడలేదు. ఆ సమయంలో విరుపాక్షునికి ధూప దీపనైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయట. అనంతరం 19వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కొంతమేర జీర్ణోద్ధరణ చేసినట్లు అక్కడి ఆధారాల ద్వారా నాకు తెలిసింది. హంపిని పూర్వం పంపావతి అని పిలిచేవారట. తుంగభద్ర నదీతీరంలో ఉన్న ఈ దివ్యాలయాన్ని ఎప్పుడు నిర్మించిందీ ఇతిమిద్దమైన ఆధారాలు లేక పోయినప్పటికీ, క్రీ.శ. 1510 సంవత్సరంలో మాత్రం ఈ ఆలయం మొదటిసారిగా జీర్ణోద్ధరణ అయ్యిందని అక్కడి వారి ద్వారా తెలుసుకున్నాను. ఆలయానికి సమీపంలోనే తుంగభద్ర నది ఉంది. హంపి దివ్య క్షేత్రం ఐదు పర్వతాల సముదాయం. మాతంగ, మాల్వవంత, హేమకూలు, బసవశృంగ, కిష్కింధ లాంటి ఐదు పర్వతాల నడుమ ఇది అలరారుతోంది. త్రేతాయుగంలో వనవాసకాలంలో శ్రీరాముడు ఇక్కడున్న పంపావతి అమ్మవారిని, విరూపాక్షేశ్వర స్వా మిని దర్శించుకున్నట్టు ఇక్కడి ఆధారాల ద్వారా తెలిసింది. అలాగే శ్రీరాముడు సుగ్రీవ, హనుమంతులను కలుసుకుని సుగ్రీవుని ఇక్కడే రాజుగా చేశాడట. ఆనా టి నుంచి రామలక్ష్మణులు ఈ క్షేత్రంలో ఉన్నారని చెబుతారు. అలాగే హనుమంతుడు సీతమ్మవారిని కనుగొని రాములవారికి తెలియ చేసిన క్షేత్రమిదేనట. ఆ కారణంగా ఈ క్షేత్రానికి కిష్కింధకాండ అనే పేరు వచ్చింది.

పురాణ గాధ : ఇక్కడ శివుడు విరూపాక్షుడిగా పేరు పొందడానికి ఓ పురాణగాధ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఇంద్రాది దేవతలు, మునులు అసురుల అకృత్యాలకు విసిగి బ్రహ్మదేవుడ్ని శరణువేడారట. అంతట బ్రహ్మదేవుడు శివ కుమారుని వల్లే ఈ సమస్య తీరుతుందని, అయితే శివుడు తపోనిష్టుడై పార్వతిని విడిచి వెళ్ళడం వల్ల కుమార సంభవం అసంభమని చెప్పాడట. దాంతో శివుడ్ని తిరిగి పార్వతి వైపు మళ్ళించడానికి ఒక్క మన్మథుడే అర్హుడని, మన్మదుడ్ని ఆ పనికి పురమాయించారట. మన్మథుడు తన మన్మథ బాణాలతో శివుడి తపస్సుని భంగపరచి, అతని మనస్సును మళ్ళించే ప్రయత్నం చేశాడట. దాంతో తపోభంగంతో కోపించిన మహాదేవుడు తన మూడో నేత్రంతో మన్మథుడ్ని భస్మం చేయగా, ఇంద్రాది దేవతలు శివుడి ప్రార్ధించగా శివుడు శాంతించి మన్మథుడ్ని రూపం లేకుండానే జీవించమని అనుగ్రహించాడట. ఆనాటి నుంచి శివుడికి విరూపాక్షుడనే పేరు సార్ధకమైంది. మన్మథుడు తిరిగి జీవం పోసుకున్న రోజుకు గుర్తుగా ఆనాటి నుంచి వసంతోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. గర్భాలయానికి సమీపంలో విద్యారణ్య స్వామి ప్రతిష్టించిన శ్రీచక్రం ఉంది. అలాగే పంపాదేవిగా పురాణకాలంలో భువనేశ్వరి దేవిగా చారిత్రక కాలం నుంచీ పూజలందుకుంటున్న దుర్గాదేవిని, పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలను కూడా దర్శించుకున్నాం. దీనికి సమీపంలోనే పాతాళ మాధవ స్వామి ఉన్నాడు. ఈ ఆలయంలో ఉత్తర భాగాన మణక గోపురం ఉంది. దీనిని కనకగిరి గోపురమని పిలుస్తారట. ప్రధానాలయానికి వెనుక భాగంలో విద్యారణ్య స్వాముల వారి దేవాలయం ఉంది. దీనికి ఉత్తరాన మఠం ఉంది. దీనికి సమీపంలోనే లోక పావన తీర్ధముంది. ఇక్కడ నుండి వెనుతిరిగి మహా ద్వారం గుండా బయటకు వస్తే గోపురానికి ఎదురుగా సుమారు రెండు కిలోమీటర్లు పొడవైన హంపి రాజవీధిని దర్శించుకున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News