Home ఆఫ్ బీట్ ఆఖరి ఘడియల్లో ఆత్మీయ స్పర్శ

ఆఖరి ఘడియల్లో ఆత్మీయ స్పర్శ

Happiness give cancer patient by Palliative care

అక్కడ ఎవరినీ కదిలించినా కన్నీళ్లే…  ఆత్మీయులను అలా చూడలేక వారు ఆవేదన చెందుతుంటారు. దేవుడిచ్చిన శాపమో, మనిషి చేసుకున్న పాపమో తెలియదు కానీ, క్యాన్సర్ అనే రక్కసికి మనిషి బలై పోతున్నాడు. ఆ వ్యాధి వచ్చిన వాళ్లు పడే బాధ వర్ణనాతీతం. ఎలాంటి బాధ లేకుండా ఆత్మీయుల మధ్య చనిపోవాలని చాలామంది భావిస్తుంటారు. ఆ చావు కూడా ఎలాంటి నొప్పి, బాధ లేకుండా రావాలనే కోరుకుంటారు. ఆ వ్యాధి వచ్చిన వారు ఏదో రకంగా అంతిమ ఘడియలకు దగ్గరయినట్టేనని భావిస్తుంటారు. క్యాన్సర్ వ్యాధి 3 లేదా 4వ స్టేజీకి చేరిన వారి పరిస్థితి మరింత దారుణం. కనీసం ఆస్పత్రుల్లో చికిత్స అందించేటప్పుడు వారి తాలూకూ వారు దగ్గర ఉండలేని పరిస్థితి. లక్షల రూపాయలను ఖర్చు చేసినా ఆ వ్యాధి వచ్చిన వారు బతకని పరిస్థితి. ఇంటికి తీసుకొచ్చినా వారిని సంతోషంగా చూసుకోలేని పరిస్థితి. అలాంటి వారి కోసం పుట్టుకొచ్చాయి పాలియేటీవ్ కేర్‌లు. చాలావరకు ఈ సంస్థలు ఉచితంగానే రోగికి తమ సేవలను అందిస్తున్నాయి.

పాలియేటీవ్ కేర్ అంటే చివరి దశలో ఉన్న రోగిని సంతోషంగా ఉంచడం. దాని కోసం అక్కడ సేవ చేసే సిబ్బంది అంతే ప్రేమను, ఆప్యాయతను రోగికి పంచుతారు. క్యాన్సర్ రోగులకు స్వాంతన చేకూర్చడానికి విదేశాల్లో పాలియేటివ్ కేర్ యూనిట్‌లు ఉంటాయి. మనదేశంలో కూడా ఈ మధ్యనే అలాంటి కేంద్రాలు ఒక్కొక్కటిగా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. క్యాన్సర్ వచ్చిన రోగుల్లో రెండో స్టేజీ దాటిన వారిని అక్కడకు పంపిస్తుంటారు. ఎలాంటి బాధ లేకుండా ఆత్మీయుల మధ్య చనిపోవాలని భావించే వారి చివరి కోరికలను నిజం చేయడానికి ఈ సంస్థలు కృషి చేస్తాయి. చివరిరోజుల్లో రోగికి సాధ్యమైనంత వరకు సౌకర్యవంతంలా ఉండేలా సేవలందించడమే లక్షంగా అవి పనిచేస్తున్నాయి. రోగికి శారీరకమైన సపర్యలతో పాటు మానసిక స్వాంతన ఇవ్వడం కోసం పరితపిస్తున్నాయి. వారికి ఉన్నన్ని రోజులు బతుకుపై ధైర్యాన్ని కల్పించడంతో పాటు సంతోషంగా ఉంచడానికి అక్కడ పనిచేసే సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తూ వారికి బతుకుపై భరోసా కల్పిస్తున్నారు. చివరి నిమిషంలో అయిన వాళ్లు ఎవరూ పక్కన లేకుండా చచ్చిపోతామోనన్న భయం… అనాథలా చచ్చిపోతామేమో అన్న ఆందోళన అక్కడ చికిత్స పొందుతున్న వారిలో కనిపించదు. ఆ విధంగా రోగులతో పాటు వారి కుటుంబసభ్యులను ఆనందంగా ఉంచడానికి కృషి చేస్తున్న సంస్థ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని స్పర్శ్ హాస్పీస్.

మరణాన్ని తప్పించలేం..మరణ యాతనను తగ్గించగలం

ఒక కవి చెప్పినట్టుగా మరణాన్ని తప్పించలేం..మరణ యాతనను తగ్గించగలం. క్యాన్సర్‌ను తగ్గించలేం..కానీ దానివల్ల కలిగే బాధను తప్పించగలం అన్న నానుడిని ఒంట పట్టించుకొని ముందుకెళుతోంది ఈ సంస్థ. బంజారాహిల్స్ రోటరీ క్లబ్‌కు చెందిన కొందరు 2011 సంవత్సరంలో స్పర్శ్ హాస్పీస్ అనే సంస్థకు అంకురార్పణ చేశారు. ఇప్పటివరకు 2,000ల మందికి తమ వంతు సేవలను అందించారు. అందులో 80 శాతం మంది ఆనందంగా సుదూర తీరాలకు వెళ్లిపోయినా వాళ్ల మనస్సులో మాత్రం వెలితి లేకుండా చేశామని ఆ సంస్థ సభ్యులతో పాటు అక్కడ పనిచేసే వారు చెబుతున్నారు. రోగి తాలూకు కుటుంబసభ్యులు సైతం వీరు అందించే సేవలను చూసి చేతులెత్తి మొక్కుతున్నారు. తమ వాళ్లు తమను విడిచిపోయినా ఆ జ్ఞాపకాలను మరోసారి నెమరేసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఇక్కడకు వస్తారంటే వారు అందించే సేవలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో సేవలందించాల్సి వస్తే తాము అంతలా చూసుకోలేమని రోగి కుటుంబసభ్యులే అంటుంటారు.

గౌరవప్రదమైన మరణం కూడా ఒక హక్కే
గౌరవ ప్రదమైన మరణాన్ని ఇవ్వడం కూడా ఒక వరమని, ప్రతి వ్యక్తికి అలా ఇవ్వగలగడం మన సభ్య సమాజం ప్రధాన బాధ్యత అని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. అంతిమదశలో ఉన్న ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు తమవంతు సాయంగా వారికి ఉపశమనం కలిగించడానికి ఈ సంస్థ 7 సంవత్సరాలుగా కృషి చేస్తోంది.

ఔట్ పేషెంట్ సేవల కింద
నయం కాని రోగుల్లో కొంతమందిని ఇక్కడే ఉంచి ట్రీట్‌మెంట్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. అలాంటి వారికి ఔట్‌పేషెంట్ సేవల కింద మందులను సరఫరా చేస్తారు. ఫోన్‌లో కూడా ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందిస్తున్నారు. డాక్టర్ కానీ నర్సు కానీ పేషెంట్ ఇంటివద్దకే వచ్చి పరీక్షించి వారికి తగిన సూచనలు, సేవలను అందిస్తారు.

సంస్థ అందించే చికిత్సలు, సేవలు
నొప్పి తెలియకుండా నార్కోటిక్స్ సహా రకరకాల మందులతో ఉపశమన చికిత్స. తీవ్రంగా వేధించే వాంతులు, ఊపిరి ఆడకపోవడం, మలబద్ధకం వంటి లక్షణాల నుంచి ఉపశమనానికి వైద్యపరమైన సేవలు. పుండ్లు, రక్తస్రావం వంటి వాటికి సంరక్షణ అవసరమైతే ట్యూబులతో నేరుగా లోపలికి ఆహారాన్ని ఇవ్వడం తదితర నర్సింగ్ సపర్యలు. తోడున్నామన్న భరోసా కలిగించేందుకు రోగితో మాట్లాడడం, వారితో కాలక్షేపం చేయడం. రోగి మనల్ని గుర్తు పట్టకపోయినా మన మాట, మన గొంతు వారికి ఊరట నిచ్చేలా చేయడం. మనసులోని భయాలు, ఆందోళనలను చెప్పుకునేందుకు రోగికి అవకాశం ఇవ్వడం. కుటుంబాన్ని అయిన వారిని వదిలి వెళ్లిపోతున్నామన్న మనోవేదనను వారికి లేకుండా చేయడం. వారి మాటలు, వారి గత జ్ఞాపకాలను వినడానికి సిద్ధపడడం. దాపరికాలు లేకుండా వైద్యపరంగా అన్నీ వారితో చర్చించడం లాంటివి.

తెలంగాణ సాయం
ఉచితంగా వీరు అందిస్తున్న సేవలను చూసి ఈ సంస్థను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, అల్లు అరవింద్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆర్.పి.పట్నాయక్‌లు తమకు తోచిన విధంగా సాయం అందించారు. శాంతాబయోటిక్ ఎండి ఏకంగా రూ.5 కోట్లను విరాళంగా అందించారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా ఈ సంస్థకు చేయూతనందిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఖాజాగూడ (శేరిలింగంపల్లి)లో ఒక ఎకరం స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఇలాంటి వారికి ఏమీ ఇచ్చి రుణం తీర్చుకోగలం: ఇందిరా ప్రియదర్శిని, జంషెడ్‌పూర్
మా అమ్మకు క్యాన్సర్ వచ్చింది. 10 రోజుల క్రితం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాం. వారు తీసుకెళ్లమని చెప్పారు. వేరే వాళ్లు ఈ సంస్థ గురించి చెప్పారు. ఆస్పత్రి నుంచి ఇక్కడకు తీసుకొచ్చి చేర్పించాం. అప్పటి నుంచి ఈ సంస్థ సభ్యులు సేవలను అందిస్తున్నారు. మా కుటుంబ సభ్యులు కూడా ఆమె దగ్గరకు వెళ్లలేని పరిస్థితి, అలాంటిది ఈ సంస్థ సభ్యులు దగ్గరుండి అన్నీ సపర్యలు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం.

ఈ సంస్థకు మనసారా కృతజ్ఞతలు: మౌలా, కర్ణాటక, యాద్గిర్
నా భార్యకు పొట్టకు సంబంధించిన క్యాన్సర్ వచ్చింది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స ఇప్పించాను. రూ.10 లక్షల వరకు ఖర్చయ్యింది. డాక్టర్లు ఇంటికి తీసుకు వెళ్లమని చెప్పారు. ఇంటికి తీసుకెళితే చూసే వారు లేరు. ఈ సంస్థ గురించి వేరే డాక్టర్లు చెప్పడంతో ఇక్కడ 20 రోజుల క్రితం చేర్పించాను. ఇక్కడ అంతా ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. నాలాంటి నిరుపేదలకు ఇలాంటి సంస్థలు చేసే సేవకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఆ దేవుడు ఈ సంస్థ నడపడానికి ఏదో రకంగా సాయం చేయాలి. ఇక్కడకు వచ్చిన తరువాత నాకు కొంత ధైర్యం వచ్చింది.

బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం
క్యాన్సర్ బాధితులకే కాదు. వారు కన్నుమూశాక వారి కుటుంబానికి మా సంస్థ అండగా నిలుస్తోంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్ద మరణిస్తే వారి ఆర్థిక పరిస్థితి తలకిందులైపోతుంది.
అందుకే మా కేంద్రానికి వచ్చే వారి ఆర్థిక, సామాజిక పరిస్థితుల గురించి సిబ్బంది అడిగి తెలుసుకుంటాం. అవసరమైతే దాతల సాయంతో వారికి అండగా నిలుస్తాం.
                                                                                                                                    – సిఈఓ, రాంమోహన్‌రావు

మేమున్నామన్న ధైర్యాన్ని ఇస్తున్నాం
చాలామంది క్యాన్సర్ వ్యాధి ముందుగానే గుర్తించలేకపోతున్నారు. 3వ స్టేజీ ఉన్నప్పుడు లేదా అది కూడా దాటిన తరువాత ఆస్పత్రికి వెళుతున్నారు. అప్పటికే వారి పరిస్థితి చేయి దాటుపోతుంది. దురదృష్టవశాత్తు మూడో, నాలుగో దశలు దానిని ఎదుర్కొంటున్నా వారికి చివరిరోజులుగా మారు తున్నాయి. వైద్యంతో పాటు జీవితంపై నమ్మకం, ప్రేమ ధైర్యం కలిగించాల్సిన దశలు ఇవి. ఈ సమయంలోనే వారికి మేమున్నామన్నా ధైర్యాన్ని కలిగించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం.
                                                                                                                                               – కౌన్సిలర్, శారద

దేవుడికి సేవ చేసినట్టుగా భావిస్తున్నాం

ఇక్కడ రెండురకాలుగా కౌన్సిలింగ్ ఇస్తాం. ఒకటి మెడికల్. మరొకటి సైకలాజికల్ కౌన్సెలింగ్. మెడికల్ కౌన్సెలింగ్ అంటే వైద్యపరంగా వారికి ఇస్తున్న చికిత్సల గురించి పూర్తి అవగాహన కలిగేలా తెలియచెప్పడం. రెండో చికిత్స ఎలాగూ మరణం తప్ప దు కాబట్టి దానిపై ఉన్న భయాన్ని తగ్గించేలా మానసిన స్వాంతన కలిగించడం. అంతిమ ఘడి య ల్లో వారిని సంతోషంగా ఉంచాలన్నదే మా కోరిక. ఆ దిశగా మా సిబ్బంది, మేము కృషి చేస్తున్నాం. వాళ్లకు చేసే సేవ దేవుడిగా చేసినట్టుగానే భావిస్తున్నాం.
                                                                                                                                          – డాక్టర్ ఆంజనేయులు

Happiness give cancer patient by Palliative care

Telangana news