Home ఖమ్మం హ్యాపీ ఫ్యూచర్ సొసైటీ మోసంలో ఏడుగురు రిమాండ్

హ్యాపీ ఫ్యూచర్ సొసైటీ మోసంలో ఏడుగురు రిమాండ్

Happy Future Society in fraud

పరారీలో నలుగురు
వసూళ్లు చేసింది రూ.4.1 కోట్లు
వెంకట్ వాడుకున్నది రూ.1.50 కోట్లు
విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపిన ఖమ్మం సిపి తప్సీర్ 

మన తెలంగాణ/ఖమ్మం క్రైం : తమిళనాడు రాష్ట్రానికి చెందిన హ్యాపీ ప్యూచర్ మల్టి పర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లి॥ సంస్థకు సంబంధించి జరిగిన మోసంలో ఏడుగురు రిమాండ్‌కు పంపినట్లు, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఈనెల 25న ఖమ్మం టూటౌన్ సిఐ రాజిరెడ్డి తన సిబ్బందితో అరెస్టు చేసి వారు ఒప్పుకున్న మేరకు బుర్హాన్‌పురంలోని హెచ్‌ఎఫ్‌సిఎస్ కార్యాలయంలో అక్కడ ఉన్న సదరు రికార్డులు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. ఇంకా కేసు విచారణ కొనసాగుతుందని తెలంగాణ, ఆంధ్రాలో అనేక చోట్ల 26 బ్రాంచీలను ఏర్పాటు చేసి మరో 22 కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజల వద్ద నుండి డిపాజిట్ల రూపంలో రూ.4.1 కోట్లు వసూలు చేసినట్లు సిపి తెలిపారు. ప్రస్తుతం చేసిన విచారణ మేరకు 70 మంది ఉద్యోగుల నుంచి, 1600 మంది బాధితుల నుంచి రూ.4.1 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. మొత్తం ఖమ్మం బుర్హాన్‌పురం బ్రాంచ్‌తో పాటు  మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు, మర్రిపేడతో పాటు ఖమ్మం జిల్లాలో కూసుమంచి, తల్లాడ, వైరా, ఖమ్మం త్రీటౌన్, సత్తుపల్లి, ఖమ్మం రూరల్, ఖానాపురం హవేలీలో వీరిపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో కంపెనీకి సంబంధించిన సొసైటీ చైర్మన్ సెంథిల్‌కుమార్‌కు రూ.8లక్షలు, హెడ్ ఆఫీస్ హెచ్‌ఆర్ మేనేజర్ భానుమతి రూ.7.60 లక్షలు, సంస్థ వైస్ చైర్మన్ సురేష్ రూ.4లక్షలు, చైర్మన్ ఎండి రఫీ రూ.8లక్షలు వెంకట్ ఇచ్చినట్లు సిపి తెలిపారు. దీంతో పాటు నగదును లోన్ల రూపంలో ప్రజలకు రూ.81 లక్షలు ఇవ్వగా ఉద్యోగుల వేతనాలు, కార్యాలయాల కిరాయి అడ్వాన్సుల రూపంలో రూ.88లక్షలు, రూ.3 లక్షలు, ఫర్నీచర్ కొరకు రూ.15 లక్షలు వెంకట్ ఖర్చు పెట్టాడు. వీటితో పాటు ఉద్యోగులు, మెంబర్స్‌కు సంబంధించిన రూ.1.25 కోట్లు, రూ.35 లక్షలు సంస్థ పాత, కొత్త చైర్మన్లకు, వైస్ చైర్మన్ సురేష్‌లకు ఇవ్వగా మిగిలిన రూ.1.50 కోట్లను తన జల్సాలకు ఖర్చు పెట్టినట్లు సిపి తెలిపారు. జల్సాలకు సంబంధించి ఖర్చుపెట్టిన దానిలో నాలుగు తులాల గొలుసు, బ్రాస్‌లెట్, భార్యకు ఎనిమిది తులాల బంగారం, గాజులు, చెవి కమ్మలు, గొలుసులు కొన్నాడు. మోసం చేసిన సొమ్ముతో ఒక మహేంద్ర కంపెనీ వెరిటో కారు, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్, బ్రాస్ లెట్లు రెండు, వెంకట్ తమ్ముడైన రాము పేరుతో కొనుగోలు చేశాడు. మరిన్ని కుటుంబ అవసరాలకు రూ.10 లక్షలు ఖర్చు చేశాడు. ఖమ్మం నగరంలో గట్టయ్య సెంటర్‌లో ఈ ఏడాది జనవరిలో ఓ సూపర్ మార్కెట్, చర్చి కాంపౌండ్‌లో రూ.5 లక్షలతో మరో సూపర్ మార్కెట్ ప్రారంభించి వరంగల్లులో రాయల్ -1 విస్కీ లిక్కర్ డిస్టిబ్యూషన్ వ్యాపారంలో చేరేందుకు గానూ శంకర్ అనే వ్యక్తికి రూ.5లక్షలు ఇచ్చినట్లు సిపి తెలిపారు. దీంతో పాటు సంస్థ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేసుకోనుటకు రిజిస్ట్రేషన్ లాంచింగ్ ప్రోగ్రాంను ఖమ్మంలో ఏర్పాటు చేసేందుకు రూ.3లక్షలు ఖర్చు చేశాడు. ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డిపాజిట్లు సేకరించి నమ్మించి మోసం చేస్తూ నమ్మక ద్రోహం చేసిన గాజరి  వెంకటేశ్వరరావు అలియాస్ వెంకట్‌తో పాటు సంస్థకు చెందిన మరో ఆరుగుర్నీ రిమాండ్ చేశారు. రిమాండ్ అయిన వారిలో వెంకట్‌తో పాటు తన తమ్ముడు గాజరి రాము, సంస్థ చైర్మన్ మహ్మద్ రఫీ, వైస్ చైర్మన్ సురేష్‌కుమార్, డైరెక్టర్ బి.గౌతం, ఆర్‌ఎం బూర సైదారావు, అసిస్టెంట్ ఆర్‌ఎం భూక్యా నాగేశ్వరరావులు ఉన్నారు. వీరితో పాటు మరో నలుగురిపై ఇవే కేసులు నమోదు చేసినట్లు వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న వారిలో సెంథిల్ కుమార్, మేనేజర్ భానుమతి, ప్రసాద్, సంతోష్‌కుమార్‌లు ఉన్నారు. వీరిపై నమోదు చేసిన సెక్షన్లు 471,477 (ఫేక్ డాక్యుమెంట్లు), 409 నమ్మక ద్రోహం, 420 చిటింగ్, రెడ్‌విత్ 34 (అన్ని సెక్షన్లు అందరిపై వచ్చేవిధంగా), 120బి కుట్ర, సెక్షన్ 15ను నమోదు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ డిసిపి కొల్లు సురేష్‌కుమార్, ఖమ్మం నగర ఏసిపి గంటా వెంకట్రావు, టూటౌన్ సిఐ రాజిరెడ్డి, త్రీటౌన్ సిఐ వెంకన్నబాబు, సిసిఎస్ సిఐ కరుణాకర్ తదితరులు ఉన్నారు.