Home తాజా వార్తలు ప్రేమలో ఒడిదుడుకులు సహజమే!

ప్రేమలో ఒడిదుడుకులు సహజమే!

Valentines Day

 

ప్రేమానుబంధాల్లో చిన్నా పెద్దా గొడవలు జరుగు తుంటాయి. తరచుగా జరిగే ఆ ప్రేమ గొడవల గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదంటున్నారు నిపుణులు. మహిళల్లో సర్‌ప్రైజ్ క్రేజ్ మగవారితో పోల్చుకుంటే ఎక్కువే ఉంటుందని అంటున్నాయి అధ్యయనాలు. ఈ పరిస్థితుల్లో వాళ్లు తరచుగా తమ భర్త తమను సర్‌ప్రైజ్ చేయడం ఆపేసాడని, గొడవకు దిగుతుంటారు. చూడ్డానికి ఇది చాలా మామూలు విషయం అయినప్పటికీ గొడవకు దారితీస్తుంది. ఒక్కోసారి ఈ గొడవ పెరిగి పెద్దదవుతుంది. ఒక్కోసారి భార్యాభర్తలు పనిలో పూర్తిగా బిజీ అయిపోవడం కూడా గొడవలకు కారణమౌతోంది. భర్త సెలవు తీసుకున్నప్పుడు కూడా ఆ సమయాన్ని తన కోసం కేటాయించలేదని అలుగుతుంటారు. ఒకవేళ ఈ సెలవుల్లో వాళ్ల అమ్మ వాళ్లకు సంబంధించిన కార్యక్రమాలకు సమయం ఇవ్వకపోతే, ఆ కార్యక్రమానికి వెళ్లకపోతే ఇక ఆ భర్తను రక్షించడం ఎవ్వరితరం కాదు.

భర్తలకు ఓ పెద్ద సమస్య ఏంటంటే వారు ఉపయోగించే వస్తువులు ఉన్న చోట కనిపించకపోవడం. దాంతో నానాఅవస్థలు పడతారు. ఈ సమస్యకు చెక్ పెట్టేది భార్యే. ఆమె వాటిని మరింత భద్రంగా ఉంచుతుంది. శుభ్రం చేస్తుంది. ఈ మధ్య చాలా మందికి ఉండే సమస్య ఏంటంటే ఒకరినొకరు ప్రేమను ప్రకటించు కోలేకపోవడం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే పని ఒత్తిడి వల్ల వారిద్దరి మధ్య రొమాన్స్ తగ్గిపోతుంది. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ప్రతిదానికీ ఓ సమయం, ప్రణాళిక పెట్టుకోవాలి. అప్పుడప్పుడూ బయటకు వెళ్లడం, ట్రావెలింగ్ చేయడం వల్ల తిరిగి ప్రేమ చిగురిస్తుందని సూచిస్తున్నారు మానసికవేత్తలు.

తడి దిండ్లు, మురికి పట్టిన సాక్సులు, లేదా దుస్తులు చిందరవందరగా వేయడంతో దంపతులు చాలా వరకు గొడవ పడుతుంటారు. చాలా మంది మగవారు ఇలాంటి అలవాట్లను వదులుకోలేరు. దీంతో ఆమెకు కోపం రావడం సహజం. నిర్లక్షాన్ని పక్కన పెడితే అలవాట్లు మార్చుకోవడం సులభమే అంటున్నారు. భార్యకు అన్నిటికంటే ఎక్కువ ఇబ్బంది భర్త స్నేహితులతోనే ఏర్పడుతుంది. వారితో కాలం గడుపుతూ భర్త చాలాసార్లు తనను పట్టించుకోకపోవడం లేదని ఆమె వాదన. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మా వారికి నాతో గడపటానికి సమయమే లేదని ఫిర్యాదు చేస్తుంటుంది. ఇది కూడా పెద్ద సమస్యేంకాదు. ఒకరినొకరు గౌరవం ఇచ్చుకుంటూ సమయం కేటాయించుకుంటే సరిపోతుంది.

ఫిర్యాదులకు ఆస్కారం ఉండదు. ఒకే రకమైన వంట చేసినప్పుడు భర్తలు ఫిర్యాదు చేస్తుంటారు. గొడవ జరగడానికి ఇది కూడా ఒక కారణమవుతుంది. ఇద్దరికీ ఇష్టమైనవి తెలుసుకుని సర్దుకోవాలి. ఏ బంధం కూడా పర్‌ఫెక్ట్‌గా ఉండదు. అంతా మీరు అనుకున్నట్లుగానే మీ ఇష్టప్రకారమే జరగాలని ఎవరికివారే ఆలోచిస్తారు. ఏదో సినిమా కథలాగా ఉండాలని అనుకుంటారు. కానీ ఇలా అనుకుంటే అది ఎదుటివారిని గాయపరచవచ్చు. ఒక్కో బంధం ఒక్కో రకంగా ఉంటుంది. భాగస్వామి మీద అపారమైన నమ్మకం పెట్టుకోవడం సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి కొన్ని మాటలు నచ్చకపోవచ్చు. వాటిని పట్టించుకోకుంటే సరిపోతుంది. అలాకాకుండా మళ్లీ మళ్లీ వస్తే మాత్రం తప్పకుండా ఆలోచించాలి.

భవిష్యత్తులో ఏమి రాసి ఉందో ఎవరికీ తెలియదు. జీవితంలో అమూల్యమైన విషయాలు ఉంటాయి. వివాహ ప్రయాణంలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలిగానీ పారిపోకూడదు. అన్నింటికంటే ముఖ్యం ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, ఇష్టాఇష్టాల్ని గౌరవించుకోవడం …ఇలా సాగిపోతుంటే గొడవలు వచ్చే ఆస్కారం లేదు. ఏదైనా తెగేవరకూ లాగొద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు మంచి బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటే అది కూడా ప్రేమ పెరిగేందుకు కారణమౌతుందని అంటున్నారు నిపుణులు.

Happy Valentines Day 2020