Home జాతీయ వార్తలు హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

RathYatra

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ చైతన్య రథ సారధిగా హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. రాష్ట్రంలో 1983, 1985, 1994లో జరిగిన ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ ఏనాడూ హరికృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ఉపయోగించే చైతన్య రథానికి సారధి (డ్రైవర్)గా మాత్రమే కొనసాగారు. 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్ళి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినప్పటికీ హరికృష్ణ మాత్రం వెనకడుగు వేయలేదు. లక్ష్మీపార్వతిని పెళ్ళిచేసుకుని ఆమెతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేసినప్పుడూ చైతన్యరథం డ్రైవర్ హరికృష్ణే.

పార్టీలో చీలిక, చంద్రబాబు వెంట హరికృష్ణ

తదనంతరం పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో లక్ష్మీపార్వతి జోక్యం పెరిగిపోవడంతో టిడిపిలో శరవేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్‌పై చంద్రబాబునాయుడు తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో 1995 ఆగస్టులో టిడిపి రెండుగా చీలిపోయింది. చంద్రబాబుకు అత్యధిక శాతం ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఎపిసోడ్‌లో నందమూరి హరికృష్ణ ముందుకు వచ్చి తన తండ్రి అయిన ఎన్టీఆర్‌ను కాదని చంద్రబాబుకు మద్దతు తెలుపడం వల్లే చాలా మంది పార్టీ శాసనసభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి బాబు గూటిలో చేరిపోయారు. అనంతరం సిఎంగా చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారు. తన క్యాబినెట్‌లో హరికృష్ణకు రవాణా శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. అప్పటికి హరికృష్ణ శాసనసభ్యుడు కాకపోవడంతో ఆయన కోసం హిందూపురం సిట్టింగ్ శాసనసభ్యుడితో చంద్రబాబు రాజీనామా చేయించారు. దీంతో ఆ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో హరికృష్ణ పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీంతో 1996 నుంచి 1999 వరకు హరికృష్ణ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగారు.

చంద్రబాబుతో విభేదాలు

ఎమ్మెల్యేగా పనిచేసిన అనతి కాలంలోనే తన బావ, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడుతో విభేదాలు తలెత్తాయి. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలవాడు కావడంతో బాబు పాలనలో జరుగుతున్న లోపాలను ఆయన బహిరంగంగానే ఎత్తిచూపారు. విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో 1999లోనే టిడిపికి రాజీనామా చేశారు.

‘అన్న తెలుగుదేశం’ పేరుతో సొంత పార్టీ

టిడిపి నుంచి బయటకు వచ్చిన హరికృష్ణ సొంతంగా ‘అన్న తెలుగుదేశం’ పేరుతో ఏర్పాటు చేసుకున్నారు. 1999,జనవరి 26న పార్టీని ఆబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్‌లో ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్న టిడిపి పక్షాన హరికృష్ణ రాష్ట్ర మంతటా విస్తృతంగా ప్రచారం చేశారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీకి 191 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటిస్తే వారికి మొత్తంగా ౩,71, 718 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో 1.12 శాతం మాత్రమే సాధించింది. ఇరవైమంది లోక్‌సభ అభ్యర్ధులను బరిలో దింపగా వారికి మొత్తంగా 2,44,045 ఓట్లు వచ్చాయి.
సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసిన ఏకైక ఎంపి
అన్న తెలుగుదేశం’ పార్టీ ఒక విఫల ప్రయోగం కావడంతో కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన హరికృష్ణ తిరిగి టిడిపిలో చేరారు. అప్పటికి టిడిపి అధికారంలోనే ఉంది. చివరకు 2008లో రాజ్యసభ సభ్యుడిగా చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే తెలంగాణ ఉద్యమం ఉధృతమై రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంథో రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్ర డిమాండ్‌తో 2013లో హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వెంటనే ఆమోదింప చేసుకున్నారు. ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో అనేక మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమైక్యాంధ్ర అంటూ నినదించినా ఎవ్వరూ రాజీనామా చేయలేదు. కానీ హరికృష్ణ మాత్రం రాజీనామా పరంపరలో ముందు వరసలో నిలిచారు.

శివ భక్తుడు : నందమూరి హరికృష్ణ శివుడిని ఎక్కవగా ఆరాధిస్తారు. అందుకే ఆయన ఆహార్యంలోనూ, మెడలో ఎక్కువగా రుద్రాక్షమాలు కనిపిస్తాయి. ఆయన నటించిన పలు సినిమాల్లోనూ ఎక్కువగా శివుడిని పూజించే సన్నివేశాలే అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నల్గొండలోని శివాలయాలకు కూడా తరుచూ వెలుతుంటారని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే ఓసారి అక్కడి శివాలయానికి ప్రత్యేక పూజలు చేస్తారని అభిమానులు పేర్కొంటూ ఉంటారు.

ఎన్నికల బరిలోకి దిగిన మొదటి సారే ప్రత్యర్ధులకు వణకు

రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన హరికృష్ణ చరిత్ర సృష్టించారు. మొట్టమొదటిసారి ఎన్నికల బరిలో దిగి ప్రత్యర్ధికి వణుకు పుట్టించారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎన్టీఆర్ వారసుడిగా తన సత్తాను చాటుకున్నారు. 1996లో హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి లక్ష్మీనారాయణ రెడ్డిపై సుమారు 62 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

చివరి లేఖలో అభిమానులకు సందేశం

సెప్టెంబర్ 2న తన అరవై రెండో పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపొద్దని మిత్రులు, అభిమానులు, శ్రేయాభిలాషులను కోరుతూ హరికృష్ణ ఒక లేఖ రాశారు. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని, ఇది మనందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయమని పేర్కొని, తన జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్పగుచ్ఛాలు, దండలు తీసుకరావద్దంటూ విజ్ఞప్తిచేశారు. వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందచేయాలని ఆ లేఖలో కోరారు.

తండ్రికి తగ్గ తనయుడు : హరికృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ జోలెపట్టి జనంలోకి వెళ్ళేవారు. తోటివారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మన ధర్మం అంటూ విరాళాలు సేకరించేవారు. 1962 భారత్, పాక్ యుద్ధం సమయంలోనూ, దివిసీమ ఉప్పెన సందర్భంగానూ జనంలోకి ఎన్టీఆర్ వెళ్ళి ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. పదేళ్ళ వయసు కూడా లేని హరికృష్ణ తన తండ్రికంటే ముందే నడిచారు. ఆ తర్వాత కూడా ఆ మార్గాన్ని హరికృష్ణ అనుసరించారు. 1998లో తుఫాన్ ధాటికి తీరప్రాంతం తల్లడిల్లి 122 మంది చనిపోతే వరద బాధితులను ఆదుకునేందుకు హరికృష్ణ జోలెపట్టి విరాళాలు సేకరించారు.