Home తాజా వార్తలు మరి 15 ఏళ్లు టిఆర్‌ఎస్‌దే అధికారం

మరి 15 ఏళ్లు టిఆర్‌ఎస్‌దే అధికారం

Harish has promised to meet the difficulties of farmers

మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి చేసిన ప్రసంగాల్లో మంత్రులు హరీశ్ రావు, నాయిని నర్సింహారెడ్డి ప్రకటన
రైతుల కష్టాలు తీర్చడానికి కట్టుబడి ఉన్నామని హరీశ్ హామీ  

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో అన్ని రంగాల్లో జరుగుతున్న ప్రగతిని చూస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని, రాష్ట్ర మంత్రులు టి. హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డిలు జోస్యం చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీసేది లేదని భీష్మించిన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇకపై గడ్డం కుమార్‌రెడ్డిగానే మిగలడం ఖాయమని ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి ముందు ఏ పార్టీలూ నిలవలేవన్నారు. పట్టుమని ఐదు మంది ఎంఎల్‌ఎలు లేని బిజెపి, సిఎం అభ్యర్థి ఎవరో తెలియని కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలు తుస్సుమన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బిజెపిలకు ఢిల్లీలో బాస్‌లు ఉన్నారని, టిఆర్‌ఎస్‌కు మాత్రం ఇక్కడి తమ బాస్‌లని వారన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మం త్రులు శనివారం ప్రారంభించారు. రూ. 2 కోట్లతో కోస్గిలో నూతన అర్‌టిసి బస్సు డిపోకు శంకుస్థాపన చేశారు. కోటి రూపాయల వ్యయంతో బస్టాండ్ ఆధునీకరణకు శంకుస్థాపనలను చేశారు. అదే విధంగా పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డిలు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రైతుల కష్టాలు తీర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.  టిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధితో కాంగ్రెస్ పవర్ పోయి, జనంకు పవర్‌కు వచ్చిందని ఆయన అన్నారు. బహిరంగ సభను చూస్తే ఎన్నికలు ఎప్పడు వచ్చినా ఇక్కడ గులాబి జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులు అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఇది మంచిది కాదన్నారు. ఎన్ని కేసులు వేసినా టిఆర్‌ఎస్ పాలమూరు రంగారెడ్డిని సాధిస్తామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పారు. బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రిని ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. కోస్గిలో కూరగాయల మార్కెట్‌కు స్థలం చూపిస్తే రైతు బజార్ మంజూరు చేస్తామన్నారు. కొడంగల్‌లో కూడా నూతన రైతు వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభిస్తామన్నారు.  మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ రైతు భీమా పథకం కింద ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను ఎల్‌ఐసికి ప్రీమియం చెల్లించినట్లు ఆయన చెప్పారు. త్వరలో రైతులకు బీమా బాండ్లు అందిస్తామన్నారు.

స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పిల్లవాడని ముఖ్యమంత్రిని విమర్శించడం విడ్డూరమని, సిఎం కుమారుడు కెటిఆర్ వయస్సంత లేని వాడు సిఎం పదవిపై కళలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు రేవంత్‌రెడ్డిని ఆగం చేయడం ఖాయమన్నారు.  రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలు, రైల్వే లైను సాధించామని గొప్పలు చెప్పే రేవంత్ అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలని సవాల్ చేశారు.  ఎంపి ఎ.పి.జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు ఖర్చపెట్టి   కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రి హరీశ్ రాత్రి పగలు కష్టపడుతున్నారని చెప్పారు.  హరీశ్‌రావు ఎక్కడ కాలు పెడితే అక్కడ పచ్చదనమేనని ప్రశంసించారు.