Thursday, March 28, 2024

రైతు కల్లాలపై బిజెపి కయ్యం.!: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై కేంద్ర బిజెపి ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇజిఎస్ ద్వారా నిర్మించిన రైతు కల్లాల డబ్బులు 150 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని పేచీ పెడుతున్నదని కేంద్రం తీరుపై ఆర్థిక మంత్రి మండిపడ్డారు. కోడిగుడ్డు పై ఈకలు పీకేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. జిల్లా కేంద్రమైన రెడ్డి సంక్షేమ సంఘంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, అన్నీ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో వానాకాలంలో వరిసాగు 5 లక్షల 27వేలు ఎకరాలు, యాసంగి వరిసాగు 2 లక్షల 90 వేల లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గజ్వేల్ రేక్ పాయింట్ ఉన్న దృష్ట్యా ఎరువుల విషయంలో అధికారులు జాగ్రతలు పాటించాలి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎరువులు దొరకక లైనులో నిల్చుని 7 మంది రైతులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

డిఎపి ఎరువు ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని, ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు మంత్రి ఆదేశించారు. వచ్చే నెల నుంచి బోరు బావుల్లో వరి పంటకు నీరు కొరత ఏర్పడుతున్న దృష్ట్యా ముందస్తు మల్లన్న సాగర్ 15 టిఎంసి, రంగనాయక సాగర్ లో 3 టిఎంసిల నీరు నిల్వ ఉన్నదని మంత్రి వెల్లడించారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు పెంచేలా కృషి చేయాలని, అవసరమైతే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోయి క్షేత్ర సందర్శన చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల లక్షా 20 వేల కనీస లాభం వస్తుందని, ఆయిల్ ఫామ్ సాగు చేసిన సత్తుపల్లి రైతులు సొంత భవనాలు నిర్మించుకుని కార్లు కొన్నారని చెప్పుకొచ్చారు.

జిల్లాలో రూ.300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, జిల్లాలో 7 వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు పూర్తి కావొచ్చిందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ఎకరానికి లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తుందని, లక్ష కోట్ల రూపాయల పామాయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి కోరిన మేరకు దుబ్బాక నియోజకవర్గానికి అవసరమైన స్పింక్లర్ సెట్లు అందించాలని డిడి రామలక్ష్మికి మంత్రి ఆదేశించారు. జనవరి 2వ తేదీన మనఊరు-మనబడిలో భాగంగా పనులు పూర్తి అయిన 100 పాఠశాలలను ప్రారంభంచుకుందామన్నారు. గతేడాది పదవ తరగతిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ఈ యేటా కూడా సిద్ధిపేట జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని, ఫలితాల్లో ఏ మాత్రం తగ్గినా ఉపేక్షించేది లేదని అధికారులకు మంత్రి హెచ్చరించారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News