Saturday, April 20, 2024

అభివృద్ధిని అడ్డుకోకండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గజ్వేల్ జోన్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కేంద్రం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నానా ఇబ్బందుల గురిచేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జి ల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియం ఆవరణలో జరిగిన బిఆర్‌ఎస్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్న అభివృద్ధి నిరోధక చర్యలను మంత్రి ఘాటుగా విమర్శించా రు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం చేస్తున్న అనేక కార్యక్రమాలపై బిజెపి ఓర్వలేని తనంతో గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని అడ్డంకుల సృష్టిస్తుందన్నారు.ఆక్రమంలోనే గజ్వేల్‌కు ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పా టు అందులో ప్రొఫెసర్ల నియామకాలకు గాను కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫైల్‌ను ఆమోదం కోసం గవర్నర్కు పంపించామని అయితే రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసుతో ఆ ఫైల్‌ను ఏడు నెలల పాటు తొక్కి పెట్టారని, గవర్నర్ తీరుపై మంత్రి మండిపడ్డారు. చివరకు గవర్నర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు సిద్ధం కాగానే ఉన్నఫలంగా ఆ ఫైల్ ను ఆమోదించకుండా ప్రభుత్వానికి గవర్నర్ వెనక్కి పంపిం చారన్నారు.

ఇలాంటి ప్రజా ప్రయోజనమైన అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకొని తెలంగాణ ప్రగతిని ముందుకు సాగకుండా చేస్తోందని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. దేశంలో బిజెపి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై ఇదేవిధంగా కక్ష గట్టి అక్కడి ముఖ్యమంత్రిలను ఇబ్బందులు పాలు చేస్తుందని ఇది కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనం అన్నారు. అంతేకాకుండా దేశంలో సంపద కలవారు పరిశ్రమల స్థాపనకు ముందుకు రాకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టే కొర్రీలకు భయపడి వారంతా తమ పెట్టుబడులను విదేశాల్లో పెట్టడానికి పాస్‌పోర్టులను తీసుకొని వెళుతున్నారన్నారు. దీనివల్ల దేశం అభివృద్ధికి దూరంగా నిలుస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిరోధక చర్యలను మానుకొని గవర్నర్ వ్యవస్థలను కూడా సజావుగా నడపాలని ఆయన సూచించారు. రాష్ట్రాల అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న వాస్తవాలను కేంద్రం గుర్తుంచుకొని అందుకు తగిన విధంగా మసలుకోవాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని ఉద్యమ సమయంలో ఎందరో చెప్పారని కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సమర్ధుడైన కెసిఆర్ వల్ల రాష్ట్రం సాధించామన్నారు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన కాలేశ్వరం సాధించారన్నారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండే కొన్ని పథకాలు ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టే విధంగా మారిన పరిస్థితులు తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా నిలిచాయన్నారు. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా సిఎం కెసిఆర్ అభివృద్ధి చేశారన్నారు. గత 60 ఏండ్లలో జరగని అభివృద్ధి 6 ఏళ్లలో చేసి చూపిన ఘనత కెసిఆర్‌దన్నారు గజ్వేల్‌కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎడ్యుకేషన్ హబ్ ఐఓసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రైల్వే స్టేషన్ కొండపోచమ్మ సాగర్ లాంటివి ఎన్నో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సిఎం కెసిఆర్‌కు సొంత నియోజకవర్గమైన గజ్వేల్ అంటే ఎంతో ప్రేమాభిమానం ఉందన్నారు. గజ్వేల్‌కు ఆయన చేయని అభివృద్ధి అంటూ లేదన్నారు.

గజ్వేల్ ప్రజలు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిని బెరీజు వేసుకొని నిండు మనసుతో కెసిఆర్‌కు, బిఆర్‌ఎస్‌కు అండగా ఉండి ఆశీర్వదించాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలను కార్యకర్తలను కోరారు. అంతకుముందు ప్లీనరీలో సుమారు 14 అంశాలపై ప్రతినిధులు చర్చించి సభలో తీర్మానం చేశారు. ఎఫ్‌డిసి చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సి రాజమౌళి గుప్తా, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, జడ్పిటిసిలు, ఎంపిపిలు, బిఆర్‌ఎస్ వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News