Home తాజా వార్తలు ప్రశ్నించి పరిశోధించడమే సైన్స్ లక్షణం : మంత్రి హరీశ్‌రావు

ప్రశ్నించి పరిశోధించడమే సైన్స్ లక్షణం : మంత్రి హరీశ్‌రావు

Harish Rao

 

సంగారెడ్డి : పరిశీలించు.. పరిశోధించు.. ప్రశ్నించు అనేదే సైన్స్‌కు నిర్వచనమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పాత డిఆర్‌డిఒ కార్యాలయంలో బుధవారం సైన్స్ మ్యూజియం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సైన్స్‌లేనిదే జీవితం లేదని, నేటి ఆధునిక సమాజంలో సైన్స్ ప్రాముఖ్యత పెరుగుతోందన్నారు. బిర్లా సైన్స్ మ్యూజియం లాగా సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తున్న ఈ మ్యూజియం కూడా విద్యార్థులు ఎంతో ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రం వల్ల పిల్లల్లో విజ్ఞానం పెరుగుతుందని, ఉపాధ్యాయుల్లోనూ అవగాహన మెరుగుతుందన్నారు. జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఈ మ్యూజియం తోడ్పడుతుందన్నారు.

అనంతరం యోగా భవన్‌కు శంకుస్థాపన చేసి ప్రతి రోజు యోగా చేసినందు వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రోగం వచ్చిన తర్వాత కాకుండా, ముందస్తుగానే ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా ఆసుపత్రి అవసరం రాదని, ఆహారాన్ని ఔషదంగా తీసుకోవాలని, అప్పుడే ఆర్యోగంగా ఉంటామన్నారు. యోగాతో మానసిక ఒత్తిడి, ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. నిత్య జీవితంలో యోగా ఒక భాగంగా మాలుచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు సామాజిక బాధ్యత కూడా అలవడుతుందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు యోగా నేర్పించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

స్థానిక మున్సిపల్ చైర్మన్‌తో పాటు వార్డు సభ్యులు కూడా రోజు యోగా, ప్రాణాయామం చేసిన తర్వాతనే వార్డుల్లో పర్యటించాలన్నారు. తద్వారా వార్డుల్లో ప్రజలతో ఓపికగా మాట్లాడగలుగుతారని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ కలుగుతుందని చెప్పారు. . అనంతరం జిల్లా ఆసుపత్రిలో కార్డియాలజీ, యూరాలజీ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ రాజశ్రీషా, యోగా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Harish Rao laying foundation stone for Science Museum