Home తాజా వార్తలు రాష్ట్రం ధాన్యాగారం

రాష్ట్రం ధాన్యాగారం

Harish Rao said the Telangana state is becoming a foodgrain

కెసిఆర్ హయాంలో పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి
గోదాముల సామర్థాన్ని మరింత పెంచుకోవాలి
వజ్రోత్సవాలు గిడ్డంగుల శాఖ గౌరవాన్ని పెంచాయి  – మంత్రి హరీశ్ రావు

మన తెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ నాయత్వంలో తెలంగాణ రాష్ట్రం ధాన్యగారంగా మారుతోందని, రైతుల కు కావాల్సిన అన్ని అవసరాలనూ తీరుస్తోన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణే అని రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగుల శాఖమంత్రి టి. హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని రకాల పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, దీంతో పండిన పంటను నిల్వ చేసేందుకు గోదాముల సామర్థాన్ని మరింత పెంచుకోవా ల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ వజ్రోత్సవ వేడుకలకు మంత్రి హరీశ్‌రావు హరిత ప్లాజాలో శనివారం మధ్యాహ్నం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ హయాంలో రైతులు ఏనాడూ సుఖసంతోషాలతో గడిపిన రోజులు లేవని, కానీ తెలంగాణలో రైతుల పరిస్థితి పూర్తిగా మారిందని, గుండెపై చేయివేసుకుని హాయిగా నిద్రించే పరిస్థితి నెలకొందన్నారు. ఏ రాష్ట్రంలోనై తే రైతులు సుఖసంతోషాలతో ఉంటారో అది గణనీయమైన ప్రగతిని సాధిస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ముందు వరసలో ఉండడం కెసిఆర్ పాలనకు, తీసుకున్న నిర్ణయాలను నిదర్శమన్నారు. వజ్రోత్సవాలు గిడ్డంగుల గౌరవాన్ని పెంచుతున్నాయన్నారు. గతంలో ప్రభుత్వ గోదాములను ఖాళీగా ఉంచి ప్రైవేటు గోదాములలో నిల్వచేసేవారని, కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ గోదాంలలో నిల్వచేయాలంటూ జీవో ఇచ్చామన్నారు. అవి పూర్తిగా నిండిన తరువాతనే ప్రైవేటు గోదాములలో నిల్వ చేయాలని సూచించామని, ఈ ఆదేశాలు మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు. గోదాముల్లో వందశాతం ఆక్యుపెన్సీతో దేశంలో మనం మొదటి స్థానంలో ఉన్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విజయం ముఖ్యమంత్రి, సంస్థ ఉద్యోగులదేనన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 10 లక్షల టన్నుల సామర్ధం కలిగిన గోదాములు ఉంటే ఇప్పుడు 21 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అరవై సంవత్సరాలలో ఎన్ని గోదాములు కట్టారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కేవలం నాలుగు సంవత్సరాలలోనే రెట్టింపు గోదాములు నిర్మించామన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా పంట దిగుబడి బాగా పెరిగిందని, దాదాపు పన్నెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించగలిగిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్సేనని అన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు ఎనిమిది వేలు రైతులకు ఇస్తున్నామన్నారు. గతంలో బ్యాంకుల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ రైతులు తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. రానున్న రోజులు రైతులకు స్వర్ణయుగమేనని, సంస్థ ఆదాయం పెంచితే ప్రోత్సాహం ఇస్తామని హరీశ్‌రావు తెలిపారు. త్వరలోనే మార్కెటింగ్, గిడ్డంగి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కన్నతల్లిగా సంస్థను కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. దేశంలోనే గిడ్డంగుల సంస్థ మొదటి స్థానంలో నిలవడం చాలా గర్వంగా ఉందని అన్నారు. అంతుకు ముందు గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సామెల్ మాట్లాడుతూ, వజ్రోత్సవాలు తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు జరగజం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.