Friday, July 18, 2025

బనకచర్ల బాగోతం బయటపడింది

- Advertisement -
- Advertisement -

బనకచర్ల అసలు భాగోతం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటల ద్వారా బయటపడిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఎక్స్ వేదికగా ఆరోపించారు. బనకచర్లపై చంద్రబాబు నాయుతో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గోదావరిలో 1000 టిఎంసిలు, కృష్ణాలో 500 టిఎంసిలు ఇస్తే చాలనే పల్లవిని వినిపిస్తూ తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టేందుకు సిద్ధమయ్యారని రేవంత్‌రెడ్డి మాటలు చెప్పకనే చెబుతున్నాయని విమర్శించారు. కేబినెట్ సమావేశం ఏర్పాటు,చంద్రబాబుతో చర్చల ప్రతిపాదన ముందే కుదుర్చుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని స్పష్టమైందని వెల్లడించారు. గోదావరిలో తెలంగాణకు ఇప్పటికే ఇచ్చిన జిఒల ఆధారంగా 968 టిఎంసిల హక్కుకు తోడు సముద్రంలో కలుస్తున్న 3 వేల టిఎంసిలలో 1950 టిఎంసిల జలాలు తెలంగాణకు ఇవ్వాలని కెసిఆర్ కోరారని గుర్తు చేశారు. అంటే మొత్తం 2918 టిఎంసిలు కెసిఆర్ అడిగితే రేవంత్ రెడ్డి వెయ్యి టిఎంసిలకు మన వాటా పరిమితం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

కెసిఆర్ కృష్ణా జలాల్లో 763 టిఎంసిల వాటా కోసం ట్రిబ్యునల్ ముందు పోరాడితే రేవంత్ రెడ్డి 500 టిఎంసిలతో సరిపెట్టాలనుకోవడం తెలంగాణను నిండా ముంచడమే అని తీవ్ర విమర్శలు చేశారు. అపెక్స్ కౌన్సిల్‌కు డిమాండ్ చేయకపోవడం,చంద్రబాబుతో చర్చలు చేస్తామనడం వెనక మతలబు ఏమిటో..? అని అడిగారు. ఇది చంద్రబాబుకు గురుదక్షిణగా భావించాలా..? అని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్‌లో కెసిఆర్ బనకచర్లకు ఒప్పుకున్నారనే విధంగా దుష్ప్రచారం చేస్తున్న తీరును ఇప్పటికే పూర్తి ఆధారాలతో ఎండగట్టామని, మరోసారి కెసిఆర్ అపెక్స్ కౌన్సిల్ లో చేసిన వాదన కాపీని ఇక్కడ జత పరుస్తున్నానని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో 299 టిఎంసిలకే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు సిఎం రేవంత్ రెడ్డి అదే పనిగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్‌రావు పేర్కొన్నారు. కెసిఆర్ సెక్షన్ 3 ప్రకారం కొత్త టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌తో కృష్ణా ట్రిబ్యునల్‌ను సాధించి పెట్టారని, బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు 763 టిఎంసిలు తెలంగాణకు కేటాయించాలని అఫిడవిట్ వేశామని తెలిపారు.

మన న్యాయవాదులు ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తున్నారని, రేపో మాపో మనం కోరిన విధంగా 763 టిఎంసిల వాటా సాధించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్,టిడిపిల పాలనలో తెలంగాణలో కృష్ణా నదిపై 299 టిఎంసిల మేరకే నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఉండటంతో అంతే వాటా మనకు పరిమితమైందని వ్యాఖ్యానించారు. ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 299 టిఎంసిలు సరిపోవనీ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 811 టిఎంసిల కృష్ణా జలాల్లో సగం అంటే 405 టిఎంసిలు తాత్కాలికంగా కేటాయించాలని డిమాండ్ చేశామని అన్నారు. అడ్‌హాక్ అగ్రిమెంట్‌కు ఫైనల్ అవార్డుకు తెలియని సిఎం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, అవగాహనా రాహిత్యానికి చింతిస్తున్నానని హరీష్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News