Home తాజా వార్తలు చిత్తుగా ఓడించండి

చిత్తుగా ఓడించండి

Harish rao speech against to congress and TDP parties

కాంగ్రెస్, టిడిపిల అనైతిక పొత్తు
జాతీయ పార్టీలు అవకాశవాద పార్టీలుగా మారాయి: హరీశ్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్, టిడిపి పొత్తు తెలంగాణ ప్రజల పాలిట గుదిబండగా కాబోతుందని, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ఈ అనైతికమైన పొత్తును చిత్తు చిత్తుగా ఓడించి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, కానీ మన నాయకుడు కెసిఆర్‌కు తన ప్రాణం కంటే రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యమని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌రావు, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిల సమక్షం లో బిజెపి మాజీ ఎంఎల్‌ఎ సత్యనారాయణ తన అనుచరులతో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, జాతీ య పార్టీలైన కాంగ్రెస్, బిజెపి పార్టీలు అవకాశవాద పార్టీలుగా మారాయని పేర్కొన్నారు. నాలుగు ఓట్ల కోసం, సీట్ల కోసం ఏదైనా చేసే పరిస్థితి ఉందని అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అప్పుడప్పుడు చుక్క తెగిపడినట్లు తెలంగాణకు వచ్చి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారని, ఆ నైతిక హక్కు బిజెపి ఉందా అన్న ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలకు అర్థమైందని చెప్పారు. 2014లో బిజెపి పార్టీలో టిడిపితో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రభు త్వం ఏర్పడకముందే చంద్రబాబు మాటలు విని రాత్రికి రాత్రే ఏడు మండలాలను ఏపీలో కలిపారని అన్నారు.

లోయేరు సీలేరు ప్రాజెక్టును కూడా బిజెపి ఆంధ్రాకు ధారాదత్తం చేసిందని తెలిపారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లొస్తాయని బిజెపి తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు.  కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో 400 కొత్త పథకాలు నడుస్తుంటే, బిజెపి ప్రభుత్వం పేదప్రజలకు ఒక్క మంచి పథకమైన బిజెపి ప్రభుత్వం చేసిందా అని ప్రశ్నించారు. నోట్లు రద్దు చేసి ప్రజలను లైన్‌లో నిలబెట్టారని విమర్శించారు. నోట్ల రద్దుతో బ్లాక్ మనీ అయితే తీసుకురాలేదు కానీ మహిళలు రోజుల తరబడి సంవత్సరాల తరబడి పోపు డబ్బాల్లో దాచుకున్న డబ్బును కొల్లగొట్టుకుపోయారని ఎద్దేవా చేశారు. 60 రోజులు ఆగితే మొత్తం మారిపోతుందని చెప్పారని, ఏం మారిందో బిజెపి నాయకులే సమాధానం చెప్పాలని అడిగారు.  బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాటు రూపాయి విలువ పతనమైందని, మార్కెట్లు కుప్పకూలిపోయాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఎంత అద్భుతంగా దూసుకుపోతుందో, దేశం ఎంత సంక్షోభంలో పడిపోతుందో దేశ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. నాలున్నరేళ్లు చంద్రబాబు తోక పట్టుకుని హైకోర్టు విభజన గురించి, బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క సారైనా ఆలోచించారా అని బిజెపి పార్టీని ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగితే ఒక్క రూపాయైనా ఇచ్చారా అని అడిగారు. పోలవరంకు మాత్ర బ్రహ్మాండంగా నిధులు ఇచ్చారని, ఇటీవల మహారాష్ట్రలోని ప్రాజెక్టులకు రూ.1200 కోట్లకు పైగా స్పెషల్ గ్రాంట్, తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదో బిజెపి సమాధానం చెప్పాలన్నారు.

రైతులపై భాష్పవాయు గోళాలు, బుల్లెట్లు కొట్టిన చరిత్ర బిజెపిదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని, ఇంత కరువు కాలంలో కూడా మహబూబ్‌నగర్ జిల్లాలో నీళ్లు వస్తున్నాయని, ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్2లో నల్గొండ, తుంగతుర్తి, కోదాడ వరకు నీళ్లు పోతున్నాయని తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పంటలను కాపాడే పనులు చేసిందని అన్నారు. గత ఎన్నికలలో బిజెపి చంద్రబాబుతో జత కలిసి తెలంగాణ అన్యాయం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేస్తుందని చెప్పారు. తాము అధికారంలో వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్‌గాంధీ చెబుతున్నారని, మరి తెలంగాణ ఏం కావాలె అని ప్రశ్నించారు.  తెలంగాణలో కూడా ప్రత్యేక హోదాకు సమానస్థాయలో పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తామని అప్పుడు పార్లమెంట్‌లో చెప్పారని, దాని గురించి రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. ఎపితో సమానంగా తెలంగాణలో కూడా పరిశ్రమలకు రాయితీలు ఇస్తారా..? ఇవ్వరా..? రాహుల్‌గాంధీ స్పష్టత ఇవ్వాలని, ఆ స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి తెలంగాణకు ఇవ్వకపోతే ఇక్కడి పరిశ్రమలు ఆంధ్రాకు తరలిపోతాయని, దాంతో ఇక్కడి నిరుద్యోగ యువత ఉపాధి కోల్పోతుందని అన్నారు.

ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. ఇప్పటికీ విభజన సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని, హైకోర్టు విభజన, సచివాలయం,అసెంబ్లీ విభజన తదితర సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. ఆంధ్రాలో ఓట్లు పోతయని  బిజెపి, కాంగ్రెస్, టిడిపి పార్టీలో తెలంగాణ పక్షాన నిలబడవని అన్నారు. ఒక్క టిఆర్‌ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ పక్షాన నిలబడుతుందని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే టిఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, టిడిపిలకు లేదని అన్నారు. రైతు బంధు చెక్కుల పంపిణీకి కూడా విపక్షాలు అడ్డుపడ్డాయని, తెలంగాణ అభివృద్దిని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటోందని పేర్కొన్నారు. కొడంగల్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన,ఇ కొడంగల్ ప్రజలు రేవంత్‌రెడ్డికి బుద్ది చెబుతారని అన్నారు.

Harish rao speech against to congress and TDP parties

Telangana news