Home కరీంనగర్ హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి

హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి

కరీంనగర్: గీత కార్మికుల కోసం ఎన్ని అభ్యంతరాలు వచ్చినా.. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కల్లు డిపోలు తెరిపించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన గౌడ కులస్థుల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ”హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతోంది. కల్లుడిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదు. ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు లేకుండా చేసి గీతకార్మికులను ఆదుకున్నాం. గతంలో 2 ఏళ్లకోసారి కల్లు డిపోల లైసెన్సుల పునరుద్ధరణ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు దీన్ని పదేళ్లకు పెంచాం. కల్లు ఆరోగ్యానికి మంచిదని భావించి.. హైదరాబాద్ లో నీరా షాపులు ఓపెన్ చేస్తున్నాం. కరోనా రాకపోతే ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రారంభించేవాళ్లం. త్వరలో హైదరాబాద్ లో ప్రారంభిస్తాం. నీరా దుకాణాలు హైదరాబాద్ లో సక్సెస్ అయితే.. అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తాం. 50 ఏళ్లకే గీతకార్మికులకు రూ.2016 ఫించన్ ఇస్తున్నాం. ముదిరాజ్ లకు ఇచ్చినట్లుగా గీతకార్మికులకు టివిఎస్ లూనా(మోపెడ్)లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా తీసుకురాబోతున్నాం. ఇదే తరహాలో మత్స్య, చేనేత కార్మికుల బీమా కూడా తేవాలని సిఎం ఆలోచిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా ఈత, తాటి వనాలు పెంచుతున్నాం. ఇన్ని మీకోసం మా ప్రభుత్వం చేస్తుంటే.. ఎందుకు బీజేపీకి ఓటేయాలి?. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమని మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే పట్టించుకోవడం లేదు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని, బీసీ జనాభా గణన చేయాలని అడిగితే స్పందించడం లేదు.

కేరళ మంత్రి మురళీధరన్ ను ఇక్కడికి తీసుకువచ్చి మీ గౌడన్నను తెచ్చాం, ఓటేయండి అని అడుగుతున్నారు. ఆయన మీటింగ్ కు మీరు కూడా వెళ్లారు కదా… మీకోసం ఒక్క హామీ అయినా ఆ కేంద్రమంత్రి ఇచ్చాడా?. మాయమాటలు, మొసలి కన్నీరుతో మీకేం లాభం లేదు.బీజేపీవాళ్లు ఇక్కడ ఏం చేస్తారో చెప్పకుండా.. బెదిరింపులకు, దాదాగిరీలకు దిగుతున్నారు. నీ భరతం పాడుతనని ఈటల రాజేందర్ నన్ను బెదిరిస్తున్నడు. నా భరతం పడితే నీకేం వస్తుంది. బెదిరిస్తే ఓట్లు రావు.. మీరు చేసే పనుల వల్ల ఓట్లు వస్తాయి. నాలుగు వేల ఇండ్లు మంజూరు చేస్తే.. ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఆ బాధ్యత మేం తీసుకుంటాం. సొంత ఇంటి స్థలం ఉన్నవాళ్లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తాం. ఇంకా రెండున్నరేళ్లు మేమే ఉంటాం.. ఎండమావిలాంటి బీజేపీ వైపు వెళ్లే బదులు, అధికారంలో ఉన్న మాకు మద్ధతు ఇవ్వండి” అని మంత్రి పేర్కొన్నారు.

Harish Rao Speech at Ellanthakunta