Thursday, April 25, 2024

60 రోజుల్లో రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ

- Advertisement -
- Advertisement -

Harish Rao speech at Husnabad

కరీంనగర్: రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని అన్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బుధవారం హుస్నాబాద్ మండలం గాంధీనగర్ పరిధిలోని కిషన్ నగర్ లో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తో కలిసి 40 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అన్నీ సౌకర్యాలతో ఆదర్శవంతమైన జర్నలిస్ట్ హౌసింగ్ కాలనీ నిర్మిస్తామన్నారు. హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లను నిర్వహించేందుకు వీలుగా నిర్మించే మీటింగ్ హల్ కు రూ.20 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.42 కోట్లతో జర్నలిస్ట్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిందన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో వైద్య, పోలీస్, శానిటేషన్ సిబ్బంది మాదిరే తమ ప్రాణాలకు తెగించి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలు, ఇబ్బందులను పాత్రికేయుల ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారన్నారు.

కరోనా సమయంలో విధులు నిర్వర్తించే క్రమంలో కోవిడ్ బారిన పడిన జర్నలిస్ట్ లకు ప్రభుత్వం రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం చేసిందన్నారు. కోవిడ్ తో మరణించిన జర్నలిస్ట్ కు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. బాధిత జర్నలిస్ట్ భాగస్వామికి పెన్షన్, పిల్లలకు చదువుల నిమిత్తం స్కాలర్ షిప్ లు అందిస్తుందన్నారు. అలాగే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా విరివిగా అక్రిడేషన్ లు మంజూరు చేస్తుందని తెలిపారు. కరోనా వల్ల మీడియా రంగం తీవ్రంగా నష్టం వాటిల్లిందని, మీడియా సంస్థల ఆదాయం తగ్గిందన్నారు. ఆ ప్రభావం జర్నలిస్ట్ పై కూడా పడిందన్నారు.

రూ.50 వేల లోపు వ్యవసాయ రుణాలను వచ్చే రెండు నెలల్లో మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలను వడ్డితో సహా ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా మాఫీ చేస్తుందని మంత్రి తెలిపారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్ పట్టణం జలమయం అయ్యిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ కోరారని మంత్రి తెలిపారు. త్వరలోనే హుస్నాబాద్ ప్రధాన రోడ్డు జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనున్నందున రహదారులు, భవనాల విభాగం ఇంజనీర్లు, జాతీయ రహదారుల అధికారులను సమన్వయం చేసుకుంటూ హుస్నాబాద్ పట్టణం భవిష్యత్తులో ముంపు బారిన పడకుండా రూ.12 కోట్లతో పట్టణం రెండు వైపులా ‘స్టార్మ్ వాటర్ డ్రైన్’లు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

హుస్నాబాద్ లో అసంపూర్తిగా ఉన్న సమీకృత కార్యాలయాల సముదాయంను 4 నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనీ పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో ప్రగతిలో ఉన్న వెజ్ నాన్ వెజ్, రైతు బజార్, గిరిజన భవనం, డంప్ యార్డ్, లైబ్రరీ లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. హుస్నాబాద్ లోని 7 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ లు కావడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకు వచ్చారని అన్నారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపవలసిందిగా కలెక్టర్ ఆదేశించామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే రిజిస్ట్రేషన్ లు ప్రారంభo అయ్యేలా చూస్తానని అన్నారు. అలాగే హుస్నాబాద్ లోని గౌరవెల్లి రిజర్వాయర్ పెండింగ్ భూ సేకరణ పూర్తి చేసేందుకు రూ.58 కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాకు జమ చేశామని తెలిపారు. వారం రోజుల్లో భూ సేకరణ జరిపిన రైతులకు నష్టపరిహారం చెల్లించి భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంలో ఇంకా మిగిలిన 5 నుంచి 10 శాతం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.

Harish Rao speech at Husnabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News