Thursday, April 25, 2024

సంక్షేమం..సాగు

- Advertisement -
- Advertisement -

Harish rao

 

మాంద్యంలోనూ రెండంకెల వృద్ధి, లోటును రాష్ట్రమే పూడ్చుకుంది : అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి, సాగునీటికి, సంక్షేమ రంగానికి 2020-21లో రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆర్థిక మాంద్యం ఉన్నా ఇచ్చిన హామీ మేరకు ఈ నెలలోనే రూ.25 వేల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ రైతుల సంఖ్య రాష్ట్రంలో 5,83,916 మంది ఉందని, వారందరి రుణాలను నూటికి నూరు శాతం ఒకే దఫా మాఫీ చేసేందుకు ఈ నెలలోనే ప్రభుత్వం రూ.1198 కోట్ల రూపాయలను విడుదల చేస్తుందన్నారు.ఈ రుణమాఫీ మొత్తాలను ప్రతి రైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎంఎల్‌ఎల చేతుల మీదుగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం చదివారు.

మేనిఫెస్టోలో హమీ ఇచ్చిన విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష మంది లబ్ధిదారులకు తమ సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని హరీశ్‌రావు ప్రకటించారు. ఇందుకోసం రూ. 11, 917 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఉన్న రాజీవ్ స్వగృహ తరహాలో నిరర్థకంగా పడి ఉన్న ఆస్తులను పారదర్శకంగా విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రం ఖనిజ సంపదకు నెలవని, ఇసుక, ఇతర ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. రూ. 40 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు పేదలకు జీవన భద్రతను, భవిష్యత్తుపై భరోపాను కల్పిస్తున్నాయన్నారు. దేశంలో సంక్షేమం కోసం అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు.

సంక్షేమ కార్యక్రమాల నిధులలో ఎక్కడా కోత విధించలేదన్నారు. పైగా సంక్షేమ పథకాల లబ్ధిదారులను పెంచే నిర్ణయాలను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తుందన్నారు. దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతటి నిబద్ధతతో ఉందో ఈ బడ్జెట్ దాటి చెబుతోందని తెలిపారు. పూర్తిగా ప్రజలే కేంద్రంగా రూపొందిన ప్రగతిశీల బడ్జెట్‌గా పేర్కొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహా కవి దాశరథి నినదిస్తే, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలని సిఎం స్వప్నించారు. ఈ కల నెరవేరేందుకు అహరహం పరిశ్రమిస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి ఫలితాలు త్వరలోనే చూస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొంత మెరుగ్గానే ఉందని మంత్రి తెలిపారు.

ఈ బడ్జెట్ కేవలం వార్షిక బడ్జెట్ అన్న దృక్ఫథంతో కాకుండా, వచ్చే నాలుగేళ్ల రాష్ట్ర భవిష్యత్‌ను కూడా దృష్టి పెట్టుకుని అభివృద్ధి ప్రణాళిక చేసినట్లు చెప్పారు. మంత్రి హరీశ్‌రావు ప్రసంగం ఆయన మాటాల్లోనే.. ప్రజల అవసరాలు, ప్రాధాన్యాతలపై స్పష్టమైన అవగాహనతో వాస్తవిక దృక్పథంతో ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. కేవలం కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదు. బడ్జెట్ అంటే సామాజిక విలువల స్వరూపం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి పట్ల సిఎం కెసిఆర్‌కు ఉన్న సమగ్ర దృష్టిని, శ్రద్ధాసక్తులను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది.

ఆదాయ మార్గాలకు ద్విముఖ వ్యూహం
గత ఐదేళ్లలో రాష్ట్రం పొంత రాబడి సగటు వృద్ధి రేటు 21.5 శాతం ఉంటే , ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసాంతానికి 6.3 శాతానికి తగ్గింది . అంటే 15.2 శాతం తగ్గింది. మారిన ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ, ఎప్పటికప్పుడు ఉత్పన్న మయ్యే పరిస్థితులకు తగ్గట్టు వ్యూహ రచన చేస్తూ ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఆర్థిక శాస్త్రంలో చెప్పిన గోల్డెన్ రూల్ ప్రకారం వివిధ సంస్థల నుండి వస్తున్న రుణాలన్నింటినీ పెట్టుబడి వ్యయం కోసమే ప్రభుత్వం వినియోగిస్తున్నది. ఆర్థిక మాంద్యానికి విరుగుడు ప్రజల కొనుగోలు శక్తిని పెంచడమే . సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చుతున్నది . ప్రజల కొనుగోలు శక్తిని అంతకంతకూ పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నది.

గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు అన్ని రకాల ఎన్నికలు పూర్తయ్యాయి . ప్రతీ ఎన్నిక సందర్భంలో ప్రజలు తమ ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసాన్ని కనపర్చారు. మేం ఎంచుకున్న బాట సరైందని, మేం అవలంబిస్తున్న వ్యూహాలు సఫలం అవుతున్నాయని ప్రజా నిర్ణయం దాటి చెప్పింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చే పన్నుల వాటా 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గింది. దీని వల్ల 202021 ఆర్ధిక సంవత్సరంలో మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో 2,384 కోట్ల రూపాయలు తగ్గాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో , సరైన వ్యూహాలను రూపొందించి , అభివృద్ధి దిశగా పురోగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టిన పూర్తి 201920 బడ్జెట్‌లో అంచనాల మేరకు, ఈ మార్చి నెలాఖరు వరకు 1,36 ,000 కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుంది . కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్లలో కోత పడినప్పటికీ ఆ లోటును స్వీయ ఆదాయ వృద్ధి ద్వారా పూడ్చుకోగలిగాము.

రాష్ట్ర జిఎస్‌డిపి 2019-20 లో 9,69, 604 కోట్ల రూపాయలు ( ప్రస్తుత ధరల్లో ) ఉంటుందని అంచనా. రాష్ట్ర జిఎస్‌డిపి వృద్ధి రేటు 2018-19లో 14.3 శాతం ఉంటే , దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల 2019-20 నాటికి 12.6 శాతంకు తగ్గింది. అదే సమయంలో దేశ వృద్ధి రేటు 11.2 శాతం నుండి 7.5 శాతానికి తగ్గింది. దేశం మొత్తం తీవ్రమైన ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ తెలంగాణ రెండంకెల వృద్ధి రేటును సాధించింది. రాష్ట్రంలో పంటల ఉత్పత్తిలో 23.7 శాతం , పాడి పశువుల రంగంలో 17.37 శాతం, చేపల పెంపకంలో 8.1 శాతం వృద్ధిని సాధించింది. సేవారంగంలో 201920లో 14.1 శాతం వృద్ధి రేటు నమోదైంది.

తలసరి ఆదాయం
రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ. 201920 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,28,216 ఉండగా, దేశ తలసరి ఆదాయం రూ.1,35,050లగా ఉంది. దేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం రూ. 93,166 ఎక్కువ కావడం మన ప్రగతికి స్పష్టమైన సంకేతం.

తుమ్మలు మొలిచిన ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల్లో నీళ్లు
బడ్జెట్ లో సింహభాగం నిధులు నీటి పారుదల రంగానికి కేటాయిస్తూ , లారీ ప్రాజెక్టులను ఆరవేగంగా నిర్మిస్తున్నది . ఇంకో వైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నది. మూడేళ్ల రికార్డు సమయంలో కాళశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి 2019 జూన్ లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతికి అంకితం చేశారు. పాలమూరు – రంగారెడ్డి , సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుపుతున్నది. సమైక్య రాష్ట్రంలో తుమ్మలు మొలిచిన ఎస్సారెస్పీ కాలువలు నిండుగా ప్రవహిస్తున్న నీటితో కళకళలాడుతున్నాయి. కాళశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ , జనగాం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల రైతులకు అందింది. త్వరలో రంగనాయక సా గర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ నిర్మాణం పూర్తవుతుంది.

మహిళాభివృద్ధి సమాజ వికాసానికి కొలమానం
ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం ఏదంటే . . ఆ సమాజంలో మహిళాభివృద్ధి స్థాయి మాత్రమే అని అంటేద్కర్ మహాశయుడు చెప్పారు. వారి మాటలు మననం చేసుకుంటూ మహిళా లోకానికి ప్రభుత్వం తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.ఈ బడ్జెట్‌లో మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.1200 కోట్లు ప్రతిపాదించడమైనది. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి విస్తృం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ నగరంలో 118 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటిని 350కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

Harish rao who introduced Budget in Assembly
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News