Friday, April 19, 2024

హరితహాసం ‘సంతోష’ సంకేతం

- Advertisement -
- Advertisement -

Haritha haram by MP Santhosh Kumar

 

హరితం… సమాజ హితం.. పుడమికి ఆకుపచ్చదనం. మొక్కలు మానవాళికి చేసే మేలు గురించి ఈ రోజు కొత్తగా ఎవరూ చెప్పనవసరంలేదు. కానీ మానవాళి మనుగడకే ముప్పు కలిగించేంత తీవ్రంగా చెట్ల నరికివేత యధేచ్ఛగా సాగింది. అభివద్ధి చెందిన, చెందుతున్న, అగ్ర, వర్ధమాన దేశాలన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రతువు నిరాటంకంగా సాగిపోతూ వచ్చింది. గ్లోబల్ వార్మింగ్‌కి, ప్రకృతి వైపరీత్యాలకీ కారణమైంది. ఈ పరిస్థితికి మీరు కారణమంటే… మీరు కారణమంటూ ప్రపంచ దేశాలు వాదులాటకు దిగాయేతప్ప… తప్పు సరిదిద్దుకోవడానికి చేయాల్సిన చర్యలపై, రూపొందించాల్సిన కార్యాచరణపై చర్చించడానికి జరిగిన సమావేశాలు ఎటువంటి సత్ఫలితాలనూ ఇవ్వలేదు.ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు పచ్చదనం కరవైతే వచ్చే పెను ముప్పు గురించి ఎంతగా చెప్పినా, ఉద్యమాలు చేసినా అదే పరిస్థితి ఏర్పడింది.అయితే ఆశాకిరణాల్లా వనజీవి రామయ్య వంటి వారు మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి తమ పని ద్వారానే చాటుతూ వెళుతున్నారు.

దశాబ్దంన్నర అలుపెరుగని పోరాట స్ఫూర్తితో ప్రత్యేక రాష్ర్ట సాధనను సాకారం చేసి తెలంగాణ కలను వాస్తవం చేసిన తెరాస అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని హరిత నిలయంగా, పచ్చటి పూదోటగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. హరితహారం పేరిట ఏటా మొక్కలు నాటే మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం కోసం ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం దేశం దృష్టిని ఆకర్షించింది. అందరూ ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్న స్ఫూర్తిని రగిలించింది. అయితే హరితహారం పిలుపుతో పని చక్కబడినట్లు కాదు. వరుసగా జరుగుతున్న హరితహారం ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఉత్సాహంగా అందరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నా ఆ తరువాత ఆ నాటిన మొక్కల సంరక్షణను విస్మరించడంతో ఆశించిన ప్రయోజనం, ఫలితం దక్కని పరిస్థితి.

సరిగ్గా ఈ సమయంలో యువ ఎంపి, తెరాస నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న ఆలోచనతో, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అదే గ్రీన్ ఇండియా చాలెంజ్. దేశంలో మొదటి సారిగా ఛాలెంజ్ విసిరిన వ్యక్తి సంతోష్ కుమార్, సామాజిక మాధ్యమంలో అంతకు ముందు చాలా ఛాలేంజ్‌లు వచ్చాయి. అయితే అవేవీ సమాజానికి, సహజ హితానికి, సమాజ శ్రేయస్సుకూ పెద్దగా దోహదపడినవికావు. అయితే సంతోష్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తలపెట్టిన హరితహారం స్ఫూర్తిని అన్ని రంగాలవారు, అన్ని వర్గాల వారిలోనూ రగల్చడానికి దోహదం చేసే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినియోగించారు. నేను మొక్కలు నాటి మీకు సవాల్ విసురుతున్నాను … స్వీకరించి … మీరు మరొకరికి సవాల్ విసురండి అన్న పిలుపుతో హరిత హారానికే ఓ కొత్త ఊపు. అంతకు ముందు ఎన్నడూ లేని ఓ జోష్‌ను తీసుకువచ్చారు. దీంతో మొక్కలు నాటడమన్నది హరితహారం జరిగే పక్షం రోజులకే కాకుండా ఏడాది పొడవునా సాగే ఒక ఆకుపచ్చ ఉద్యమంగా మారిపోయింది.

కాదు … కాదు సంతోష్ కుమార్ మార్చేశారు. ఎంపిగా ఆయన బీజం నాటిన హరిత ఉద్యమం ఈ రోజు రాష్ర్టం నలు చెరగులకూ విస్తరించింది. ఈ గ్రీన్ ఇండియా ఛాలేంజ్ కు ఎవరూ అతీతులు కారు. రాజకీయ ప్రముఖులు, సినీనటులు, క్రీడా కారులు , వాణిజ్య, వ్యాపారవేత్తలు, వృత్తినిపుణులు అందరూ గ్రీన్ ఇండియా ఛాలేంజ్ లో భాగస్వాములు అవుతున్నారు. తాము మొక్కలు నాటడమే కాకుండా … మరొకరికి ఆ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇలా గ్రీన్ ఇండియా ఛాలేంజ్‌లో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ఆ నాటిన వారిదే. అదే సంతోష్ కుమార్ సమాజంలోని అన్ని వర్గాల వారిలో రగిల్చిన స్ఫూర్తి. పర్యావరణ ప్రాధాన్యతపై కలిగించిన చైతన్యం.

నటుడు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం ముందు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా చేయాలనుకున్నప్పుడు ఆయన వద్దకు ఓ సినిమా వచ్చింది. అందులో హీరోగా ఆయన ఎవరికైనా సహాయం చేస్తే థాంక్స్ చెప్పవద్దు, మీరు మరో ముగ్గురికి సహాయం చేసి… ఆ ముగ్గురినీ ఒక్కొక్కరూ, మరో ముగ్గురికి సహాయం చేయమని చెబుతారు. సరిగ్గా ఈ గ్రీన్ ఇండియా ఛాలేంజ్ కూడా అలానే… మొక్కలు నాటి సంతోష్ కుమార్ ఎవరికైనా ఛాలెంజ్ అంటూ సవాల్ విసిరితే దానిని స్వీకరించిన వారు తాము మొక్కలు నాటడమే కాకుండా… ఆసవాల్‌ని మరొకరికి ఇవ్వాలి. అలాగే ఇస్తున్నారు. అందుకే తెలంగాణ ఇప్పుడు సమాజ వనాల ఆకుపచ్చ తోటగా మారుతోంది. హరితహారం లక్ష్యాన్ని చేరుకునే క్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వేగవంతం చేసింది. ఈ ఉద్యమంలో ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల నుంచి నాల్గవ తరగతి ఉద్యోగుల వరకూ… సినీ నటుల నుంచి… రాజకీయ నేతల వరకూ, వ్యాపార, వాణిజ్య దిగ్గజాల నుంచి విద్యార్ధుల వరకూ అందరూ భాగస్వాములయ్యారు.

భావి పౌరులు సైతం ఈ ఛాలెంజ్‌లో భాగస్వాములవుతున్నారు. తెలంగాణను ఆకు పచ్చహబ్ (గ్రీన్ హబ్) గామర్చే మహా యజ్ఞంలో భాగస్వాములు కావడానికి జనం తహతహలాడుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలేంజ్ లో తామూ భాగమే అన్న భావనతో హరిత విప్లవ బాటలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. జనంలో పర్యావరణ కాంక్షను రగిలించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక కెటలిస్ట్‌గా మారింది. మొక్కలు నాటడమేకాదు … వాటిని సంరక్షించి పచ్చదనం పెంపునకు దోహదపడాలన్నసందేహం ఇప్పుడు రాష్ర్టంలో క్షేత్రస్థాయికి కూడా చేరిపోయింది. రాష్ర్ట సాధన ఉద్యమం జనం అందరినీ ఎలా కదలించిందో… ఇప్పుడు హరితస్ఫూర్తిని జనం అందరిలో రగిలించిన ఘనత కచ్చితంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌దే .. దానికి శ్రీకారం చుట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్‌దే !

జోగినపల్లి సంతోష్ కుమార్ వెనుక కూడా ఒక ఛాలెంజ్ ఉంది. టిఆర్‌యస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు “గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్‌”కు స్పందించిన సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. ఆ అటవీ ప్రాంతంలోని సింహభాగాన్ని సొంత నిధులతో సామాజిక వనంగా అభివృద్ధి చేయడమే కాకుండా ఎకో టూరిజం స్పాట్‌గా రూపుదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన ప్రాంతాన్ని కూడా రక్షిత అటవీ ప్రాంతంగా రూపుదిద్దుతానని కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా తన వంతు సామాజికహితానికి, హరిత ఉద్యమానికీ దోహదపడుతూనే … గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట అన్ని వర్గాల వారిలోనూ పర్యావరణ సమతుల్యత రక్షణపై చైతన్యం రగులుస్తున్నారు. ఇప్పటికే అర్బన్ పారెస్టులు నగర వాసులకు కనువిందు చేస్తున్నాయి.

నగరాన్ని ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి. ఉమ్మడి పాలనలో కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిన హైదరాబాద్ మహా నగరం మళ్లీ పచ్చదనాన్ని సంతరించుకునేలా చేయడమే లక్ష్యంగా అందరినీ కదిలించే మంచి పనికి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు వాతావరణంలో స్వచ్ఛత ఉంటేనే గాలిలో నాణ్యత ఉంటుంది. పుడమికి ఆక్సిజన్ పచ్చదనం. ఆ పచ్చదనాన్ని పరిరక్షించడమే కాదు, పెంపొందించడమే లక్ష్యం గా సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అప్రతిహతంగా, నిరాటంకంగా సాగుతోంది. ఇది ఇలాగే సాగాలనీ, సియం కెసిఆర్ లక్ష్యం నెరవేర్చాలన్న సంతోష్ కుమార్ ఆశయం సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…

సంగని మల్లేశ్వర్
9866255355

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News