Friday, March 29, 2024

సంపాదకీయం: భావ ప్రకటన స్వేచ్ఛకు హాని

- Advertisement -
- Advertisement -

Harm to freedom of expression ‘సాధారణ పౌరులకు పోలీసులు సమన్లు (స్టేషన్‌కు పిలిపించుకునే ఆదేశాలు) జారీ చేయడం ఇదే విధంగా కొనసాగితే అది ప్రమాదకరంగా మారుతుంది, రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ ప్రాథమిక హక్కుగా ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడడానికి న్యాయస్థానాలు నడుం బిగించవలసి వస్తుంది… ఈ దేశాన్ని పౌరులు స్వేచ్ఛగా బతికే చోటుగా ఉండనివ్వండి’ సామాజిక మాధ్యమంలో పెట్టిన ఒక వ్యాఖ్యానానికి సంబంధించిన కేసులో బుధవారం నాడు సుప్రీంకోర్టు వెలిబుచ్చిన ఈ అభిప్రాయం ఎంతో విలువైనది. దేశంలో నానాటికీ కుదించుకుపోతున్న ప్రజాస్వామ్య ఆవరణను పునరుద్ధరించడానికి దోహదపడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు సాధారణ జనాన్ని వేధించడం మంచి పద్ధతి కాదని న్యాయమూర్తులు వై.వి. చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఇంత సందేహాతీతంగా పోలీసులకు హద్దు రేఖను గీయడానికి దారి తీసిన కేసు పశ్చిమ బెంగాల్‌లో లాక్‌డౌన్ పాటింపుపై ఢిల్లీ మహిళ రోహిణి బిశ్వాస్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టింగ్‌కు, వ్యాఖ్యానానికి సంబంధించినది. లాక్‌డౌన్ సమయంలో కోల్‌కతా రాజా బజార్ ప్రాంతంలో జనం కిక్కిరిసి ఉన్న దృశ్యాన్ని ఆ మహిళ ఫేస్‌బుక్‌లో పెట్టారు. లాక్‌డౌన్‌ను అమలు చేయడమంటే ఇదేనా అని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిని అభ్యంతరకరమైనదిగా పరిగణిస్తూ కోల్‌కతాలోని బాలీగంజ్ పోలీసులు ఆమెపై గత మే 13వ తేదీన కేసు నమోదు చేశారు. మత వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, మతపరమైన భావజాలాన్ని రెచ్చగొట్టడం, పరువు నష్టం, శాంతికి విఘాతం కలిగించడం, ప్రజలను తప్పుదోవపట్టించడం వంటి నేరాలకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఇంకా సమాచార సాంకేతిక చట్టం (ఐటి), ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం కింద కూడా ఆరోపణలు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా కోల్‌కతా హైకోర్టు నుంచి రోహిణి బిశ్వాస్ స్టే తెచ్చుకున్నారు.

లాక్‌డౌన్ తర్వాత పోలీసుల ఎదుట హాజరు కావాలన్న షరతుపై హైకోర్టు జూన్ 5న ఆ స్టేను మంజూరు చేసింది. పోలీసులు సమన్లు జారీ చేయగా కేసు కొట్టేయాలని కోరుతూ ఆమె మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు అలా ఉండగానే కోల్‌కతా పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ గత నెల 29న హైకోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. దానిని రోహిణి బిశ్వాస్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఫేస్‌బుక్‌లో ఆమె పెట్టిన పోస్టింగ్ కేసు పెట్టదగినంత హానికరం కాదని సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్య గమనించదగినది. పౌరులు, ప్రజాస్వామ్య హితులు సమాజ శ్రేయస్సు కోరి ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యాలపై పాలకుల నిర్ణయాల మీద నిర్భయంగా అభిప్రాయాలను ప్రకటించడానికి ఇప్పుడు సామాజిక మాధ్యమం ఒక్కటే అనువైన వేదికగా ఉంది. పత్రికలు, ఎలెక్ట్రానిక్ మీడియా పాలకుల అదుపాజ్ఞల్లోకి మరింతగా జారిపోతున్నాయనే అభిప్రాయం గట్టిపడుతున్న నేపథ్యంలో ప్రజలు సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయించడం అనివార్యమైపోయింది.

అక్కడ కూడా నిర్భయంగా అభిప్రాయం ప్రకటించడానికి, నిజానిజాల చర్చకు, మథనానికి సందులేకుండా చేయడానికి ప్రభుత్వాలు తమ సొంత చట్టాలను, పోలీసులను ప్రయోగిస్తున్నాయని రుజువు చేసే ఉదంతాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అభ్యంతరకర పోస్టింగ్‌లంటూ ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, త్రిపుర, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో పోలీసులు గతంలో పలువురిని అరెస్టు చేసి కేసులు పెట్టారు. తాజాగా కేరళ ప్రభుత్వం సోషల్ మీడియాలోని పోస్టింగ్‌లకు జరిమానా విధించే అవకాశం కల్పిస్తూ ఆ మేరకు పోలీసు చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకు వచ్చిం ది. భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించేదంటూ సుప్రీంకోర్టు ఐటి చట్టం 66 ఎ సెక్షన్‌ను 2015లో కొట్టి వేసింది. అలాగే, అదే లక్షణమున్న కేరళ పోలీసు చట్టం 118 (డి) ని కూడా రద్దు చేసింది.

సామాజిక మాధ్యమాల్లో ఎవరు ఎటువంటి అభిప్రాయాన్నైనా ప్రకటించవచ్చా అది జాతి శ్రేయస్సుకు, భద్రతకు విఘాతం కలిగించేది, అసత్యాల ఆధారంగా మత కలహాలు, సామాజిక ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఉద్దేశించినదైనా దాని బాధ్యులపై ఎటువంటి చర్య తీసుకోకూడదా అనేది కీలకమైన ప్రశ్న. ఇప్పుడు రోహిణి బిశ్వాస్ పెట్టిన పోస్టింగ్ మాత్రం అంతటి ప్రమాదకరమైనది కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. అందుచేత ప్రభుత్వాలు గాని, వాటి పోలీసులు గాని విచక్షణ ఉపయోగించి కేసులు పెట్టినప్పుడు వాటి పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత రాదు. అలా కాకుండా పౌరులను వేధించి న్యాయమైన, సహేతుకమైన అభిప్రాయ ప్రకటనలు కూడా సహించలేని నిరంకుశత్వాన్ని పాలకులు, వారి పోలీసులు ప్రదర్శించినప్పుడే భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాధారాలైన మానవీయ విలువలకు విఘాతం కలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News