Wednesday, April 24, 2024

హర్ సిమ్రత్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

                  Harsimrat Kaur Badal resigned from Modi cabinet   కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ తప్పుకోడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ లేదు. లోక్‌సభలో ఆ పార్టీకున్న సభ్యులు కేవలం ఇద్దరే. అందులో ఒకరు గురువారం నాడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన హర్ సిమ్రత్ కౌర్ బాదల్, మరొకరు ఆమె భర్త సుఖ్‌వీర్ సింగ్ బాదల్. అలాగే రాజ్యసభలో కూడా అకాలీదళ్‌కు ముగ్గురు సభ్యుల బలమే ఉంది. అందుచేత ఈ పార్టీ దూరం కావడమనేది మోడీ ప్రభుత్వం కొంపలు ముంచేదేమీ కాదు. అయితే హర్ సిమ్రత్ రాజీనామాకు దారి తీసిన అంశం మాత్రం జాతీయ స్థాయిలో విశేష ప్రాధాన్యం కలది. రైతులు పండించే పంట అమ్మకం, కొనుగోలుకు, మొత్తంగా వ్యవసాయ మార్కెటింగ్‌కు సంబంధించి మోడీ ప్రభుత్వం లోక్‌సభ ఆమోదాన్ని సాధించిన మూడు కీలక బిల్లుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి వర్గం నుంచి అకాలీదళ్ తప్పుకున్నది. ఈ బిల్లులపై పంజాబ్, హర్యానాలలో రైతులు గత కొంత కాలంగా భగ్గున మండుతున్నారు.

అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తాజాగా రైళ్లను అడ్డుకునే ఆందోళనకు కూడా పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ‘వీటి గురించి ముందుగా సంబంధించినవారందరితో మాట్లాడాలని నేను చెప్పాను, ఇందులో రాజకీయమేముంది? ఒక్క పంజాబ్‌లోనే కాదు హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో సైతం రైతులు ఆందోళన చేస్తున్నారు. దక్షిణాదిలోనూ వ్యతిరేకత ఉంది’ అని హర్ సిమ్రత్ కౌర్ అన్నారు. అందులో ఆవంతైనా అబద్ధం లేదు. హర్యానాలో బిజెపి కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ కూడా అక్కడి రైతుల నుంచి, ప్రతిపక్షాల నుంచి, సొంత పార్టీ వారి నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నది. పంజాబ్‌లో ప్రతిపక్షంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ ఇప్పుడు ఈ అంశంపై మౌనం వహించి ఉంటే అది మరింత దెబ్బతినే ప్రమాదమున్నది.

గత జూన్ 5న ఈ బిల్లులు ఆర్డినెన్స్‌ల ద్వారా అమల్లోకి వచ్చినప్పుడు కిమ్మనకుండా మంత్రివర్గంలో కొనసాగిన అకాలీదళ్ స్వరాష్ట్రంలో రైతు ఆందోళన ఉధృతిని గమనించి ఆత్మరక్షణ కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు తప్పుకున్నది. రైతుల ఉత్పత్తి వ్యాపారం, వాణిజ్యం (పెంచడం, మెరుగైన సౌకర్యాలు కల్పించడం) బిల్లు, రైతుల (సాధికారికత, రక్షణ) ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల బిల్లు, నిత్యావసర సరకుల చట్టం సవరణ బిల్లు అనే ఈ మూడు రైతులు పండించే పంటల కొనుగోలులో కార్పొరేట్ శక్తులకు పెత్తనాన్ని కలిగించడానికి ఉద్దేశించినవని సులభంగా తెలిసిపోతుంది. అది రైతుల ప్రయోజనాలను ఇప్పటి కంటే దారుణంగా బలి తీసుకుంటుందనే విషయమూ సుస్పష్టం. ప్రస్తుతమున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ యార్డుల వ్యవస్థతో పని లేకుండా బయట ఎక్కడైనా కేవలం ఆధార్ కార్డు ఉన్న వారికెవరికైనా పంటలను అమ్ముకునే అవకాశాన్ని రైతులకు ఈ బిల్లులు కలిగించనున్నాయి.

అందువల్ల మార్కెట్ యార్డుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పొందుతున్న ఆదాయానికీ గండి పడుతుంది. ప్రస్తుతం ఉత్పత్తి విలువలో 8.5 శాతం ఫీజు చెల్లింపు ద్వారా మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు సాగుతున్నాయి. కొత్త విధానంలో అది ఉండదు. అలాగే ప్రస్తుతమున్న లైసెన్సు కలిగిన కమీషన్ ఏజెంట్ల విధానమూ ఇక ఉండబోదు. ముందుగానే రైతుతో నేరుగా మాట్లాడుకొని కుదుర్చుకున్న ధరకు క్రయవిక్రయాలు జరిగిపోతాయి. అందులో పేచీలేమైనా తలెత్తితే వాటిని కోర్టు బయటనే పరిష్కరించుకోవాలన్న షరతు దేశంలో 80 శాతం పైగా ఉన్న చిన్న రైతులకు తీవ్ర హానికరమైనది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే కార్పొరేట్ సంస్థలు గ్రామాలపై పడిపోయి తమకు లాభసాటి అయిన రీతిలో పంటలను కొనుక్కొని పోయే అవకాశాన్ని ఈ బిల్లులు కలిగిస్తాయి. పంట నిల్వలపైన కూడా ఎటువంటి పరిమితులు ఉండవు. అది అక్రమ నిల్వలకు దారి తీసి సాధారణ ప్రజల ఆహార భద్రతను బలి తీసుకునే ప్రమాదమున్నది.

పంజాబ్, హర్యానాలలో బాగా వేళ్లూనుకొని ఉన్న కమీషన్ ఏజెంట్ల వ్యవస్థ మాయమైపోతుంది. అందుచేతనే ఆ రాష్ట్రాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృత స్థాయికి చేరుకున్నది. మొత్తం దేశమంతటా అదే వాతావరణం క్రమంగా అలముకునే సూచనలు కనిపిస్తున్నాయి. స్వామినాథన్ కమిషన్ సూచించినట్టు రైతు పెట్టే పెట్టుబడికి ఇంటిల్లిపాది చేసే శ్రమ విలువను జోడించి ఆ మొత్తంలో 50 శాతాన్ని దానికి చేర్చి మద్దతు ధరను నిర్ణయించే పద్ధతిని అమల్లోకి తేవడానికి బదులు మొత్తంగా మద్దతు ధరకే ఎసరు పెట్టే కుట్ర ఈ బిల్లులలో దాగి ఉందని రైతు ఉద్యమ కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా ఈ మొత్తం కుట్రను దేశ ప్రజల దృష్టికి తీసుకురావడంలో ఎంతగానో తోడ్పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News