Friday, March 29, 2024

రైతులను కొన్ని శక్తులు రెచ్చగొడుతున్నాయి

- Advertisement -
- Advertisement -

Haryana CM Khattar indirectly blamed the Punjab CM

ఎన్ని సార్లు ఫోన్ చేసినా అమరీందర్ స్పందించలేదు
పరోక్షంగా పంజాబ్ సిఎంపై హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ ఆరోపణ
ఆయన క్షమమాపణ చెప్పేదాకా స్పందించను: అమరీందర్

చండీగఢ్: ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను పంజాబ్‌లోని కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ప్రోత్సహిస్తున్నాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆరోపించారు. గుర్గావ్‌లో జిల్లా ఫిర్యాదుల కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై ఈ ఆరోపణలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో మాట్లాడడానికి తాను గత మూడు రోజులుగా అనేక సార్లు ప్రయత్నించానని, అయితే ఆయన మాట్లాడలేదని చెప్పారు. తాను ఆరేడు సార్లు ముఖ్యమంత్రి సిబ్బందికి ఫోన్ చేశానని, అయితే ఇప్పుడు ఆయనతో మాట్లాడడం వీలుకాదని మాత్రమే వారినుంచి సమాధానం వచ్చిందని ఖట్టర్ చెప్పారు. ‘ఒక ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రితో మాట్లాడలేకపోవడం ఇదే మొదటి సారి. గత ఆరేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు మేము ఫోన్ చేస్తే ఒక వేళ ఆయన బిజీగా ఉంటే తర్వాత గంటా, గంటన్నరలో ఆయనతో మాట్లాడే వాళ్లం’ అని హర్యానా ముఖ్యమంత్రి చెప్పారు.

ఖట్టర్ కాల్‌కు స్పందించను: అమరీందర్

కాగా తాను ఫోన్ చేసినా స్పందించలేదంటూ హర్యానా సిఎం ఖట్టర్ చేసిన ఆరోపణలపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. రైతుల పట్ల ఖట్టర్ ప్రవర్తించిన తీరు కారణంగానే తాను ఆయన ఫోన్ కాల్స్‌కు స్పందించలేదని ఓ టీవీ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అన్నారు. ‘ ఏం చెప్పాలో తెలియకనే ఆయన ఇదంతా మాట్లాడుతున్నారు. నిరసన తెలపడం రైతు హక్కు కాబట్టే మా ప్రభుత్వం వారికి అడ్డుకోవడం లేదు. మీరెందుకు వారిని ఆపుతున్నారు? మీరెందుకు వారిపై వాటర్ క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. మేము, కానీ, ఢిల్లీ కానీ ఆపనప్పుడు, వారిని అడ్డుకోవడానికి మీరెవరు? ఈ అవమానకర ప్రవర్తన నాకు నచ్చలేదు. అందుకే ఆయన పది సార్లు ఫోన్ చేసినా నేను మాట్లాడను. తన ప్రవర్తనకు ఖట్టర్ క్షమాపణ చెప్పేదాకా ఆయన ఫోన్‌కాల్‌కు స్పందించను’ అని అమరీందర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News