Home జాతీయ వార్తలు సైకిల్‌పై వెళ్లి ఓటేసిన హర్యానా సిఎం (వీడియో)

సైకిల్‌పై వెళ్లి ఓటేసిన హర్యానా సిఎం (వీడియో)

Manohar-Lal-Khattar

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సోమవారం ఓటేయడానికి వచ్చేందుకు వినూత్నరీతిలో ప్రయాణించారు. ఆయన చండీగఢ్ నుంచి కర్నాల్‌కు రైల్లో, ఆ తర్వాత సైకిల్‌పై వచ్చి పోలింగ్ బూత్ చేరుకున్నారు. కర్నాల్‌కు వచ్చేటప్పుడు తను రైల్లో తోటి ప్రయాణికులతో ప్రత్యక్షంగా మాట్లాడానన్నారు. ‘కర్నాల్ చేరుకునేందుకు జన్ శతాబ్ది రైల్లో వచ్చాను. తర్వాత ఒక ఇ రిక్షాలో, అటుపిమ్మట సైకిల్ ఎక్కి పోలింగ్ బూత్ చేరుకున్నాను’ అని ఖట్టర్ ఓటేసిన తర్వాత, విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇదివరకు కూడా ఆయన చాలాసార్లు చండీగఢ్‌లోని తన అధికార నివాసం నుంచి సచివాలయానికి సైకిల్‌మీదే వచ్చారు.

సాధ్యమైనంత వరకు ప్రజలు ప్రయాణానికి సైకిల్ నే వాడాలని, కనీసం తక్కువ దూరాలకైనా దాన్ని ఉపయోగించాలని, అలాచేసి పర్యావరణాన్ని కాపాడాలని ఖట్టర్ సూచించారు. ‘ఈ ప్రజాస్వామ్య పండగలో అధిక సంఖ్యలో పాల్గొని ఓటేయాలి. ఇది నా ప్రార్థన.శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటులో ప్రతి ఒక్క ఓటు కూడా నిర్ణయాత్మకమవుతుంది’ అని హర్యానా సిఎం ట్వీట్ చేశారు. 65 ఏళ్ల ఖట్టర్ కర్నాల్ నుంచి తిరిగి ఎన్నికయ్యేందుకు పోటీ చేశారు. ఈసారి 75 స్థానాల్లో విజయం సాధించాలని అధికార బిజెపి లక్షంగా పెట్టుకుంది.

Haryana CM Rides Cycle to Polling Booth