Thursday, April 25, 2024

‘హెచ్‌డిఎఫ్‌సి’ మెగా విలీనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మరో రెండు దిగ్గజ సంస్థలు విలీనం అవుతున్నాయి. మాతృ సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి) వ్యాపారాలు హెచ్‌డిఎఫ్ బ్యాంక్ లో విలీనం కానున్నాయి. రెండు సంస్థల మధ్య ఒప్పందం ప్రకారం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో హెచ్‌డిఎఫ్‌సి 41 శాతం వాటా పొందనుంది. సోమవారం జరిగిన హెచ్‌డిఎఫ్‌సి బోర్డు సమావేశంలో ఈ విలీనానికి ఆమోదం తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో లేదా మూడో త్రైమాసికం నాటికి విలీనం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పం దం లక్షం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హౌసింగ్ లోన్ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడం, ప్రస్తుత కస్టమర్ బేస్‌ను విస్తరించడమేనని హెచ్‌డిఎఫ్‌సి తెలిపింది. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ల ఈ విలీనం 202324 రెండో లేదా మూడో త్రైమాసికం నాటికి పూర్తవుతుంది.
విలీన వార్త తర్వాత రెండు కంపెనీల షేర్లు 9 శాతం పెరిగాయి. 2021 డిసెంబర్ 31 నాటికి, హెచ్‌డిఎఫ్‌సి మొత్తం ఆస్తులు రూ.6.23 లక్షల కోట్లు, టర్నోవర్ రూ.35,681 కోట్లుగా ఉంది. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొత్తం ఆస్తులు రూ.19.38 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ రెండు కంపెనీల విలీనం తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 6.8 కోట్లతో అతిపెద్ద కస్టమర్ బేస్‌ను కల్గివుంది. విలీనం వార్త వెలువడగానే రెండు కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్‌లు దాదాపు 9 శాతం పెరిగాయి.
నిబంధనలు మెరుగవ్వడంతో విలీనం సులభమైంది: పరేఖ్
హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ చైర్మన్ దీపక్ పరేఖ్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల అనేక నిబంధనలు మెరుగయ్యాయి. దీంతో విలీనానికి అవకాశం ఏర్పడిందని, ఇది పెద్ద బ్యాలెన్స్ షీట్‌కు పెద్ద మౌలిక సదుపాయాల రుణాలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిందని అన్నారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ రుణ వృద్ధి పెరిగింది, సరసమైన గృహాలు ఊపందుకున్నాయని, వ్యవసాయంతో సహా అన్ని రంగాలకు గతంలో కంటే ఎక్కువ రుణాలు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. అయితే ఈ విలీనం సమానుల విలీనం అని అన్నారు. దీంతో రెరా అమలు, గృహ నిర్మాణ రంగానికి మౌలిక సదుపాయాల హోదా, అందుబాటు ధరలో గృహాలపై ప్రభుత్వ చొరవ, ఇతర అంశాల కారణంగా హౌసింగ్ ఫైనాన్స్ వ్యాపారంలో పెద్ద ఊపు వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
ఐసిఐసిఐ బ్యాంక్ కంటే రెట్టింపు: ఎస్ అండ్ పి
హెచ్‌డిఎప్‌సి బ్యాంక్ విలీనంతో మాతృ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి ఇకపై ఐసిఐసిఐ బ్యాంక్ కంటే రెట్టింపు సంస్థగా అవతరిస్తుందని ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్ సంస్థ పేర్కొంది. ఈ విలీనంతో మార్కెట్ వాటాను పెంచడం, ఆదాయాలను వైవిధ్యం ఉంటుందని తెలిపింది. కార్పొరేట్ చరిత్రలో ఇది అతిపెద్ద విలీనం, హెచ్‌డిఎఫ్‌సిలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు విలీనం భారీ బ్యాంక్‌ను సృష్టిస్తుంది.
రెండు సంస్థల మధ్య తేడా ఏమిటి?
హెచ్‌డిఎఫ్‌సి ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, అంటే ఇది ఇళ్లు, దుకాణాలతో సహా ఇతర ఆస్తుల కొనుగోలు కోసం రుణాలను ఇస్తుంది. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అన్ని రకాల రుణాలు, ఖాతా తెరవడం, ఎఫ్‌డి వంటి బ్యాంకుకు సంబంధించిన అన్ని సేవలను అందిస్తోంది.
విలీనం ఎందుకు జరిగింది?
ప్రభుత్వరంగ బ్యాంకులు, కొత్త-గా వస్తున్న ఫిన్‌టెక్ కంపెనీల నుండి పెరుగుతున్న పోటీ కారణంగా ఈ విలీనం అవసరం అని కంపెనీలు భావించాయి. ఈ విలీన సంస్థ భారీ బ్యాలెన్స్ షీట్‌ను కలిగి ఉంది. అందువల్ల మార్కెట్‌లో పోటీ పెరుగుతుందని మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది.
వాటాదారులపై ప్రభావం ఉంటుందా?
ఈ విలీనం కింద హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ప్రతి 25 షేర్లకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు చెందిన 42 షేర్లు ఇస్తారు. అంటే హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌లో 10 షేర్లు ఉంటే విలీనం కింద 17 షేర్లను పొందుతారు.

HDFC to be merged with HDFC Bank

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News