Friday, March 29, 2024

విషాహారం ఇచ్చి తల్లిని, చెల్లిని కడతేర్చాడు

- Advertisement -
- Advertisement -

He Poisoned his Mother and Sister

 

మనతెలంగాణ/ మేడ్చల్ : క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడి అప్పులు చేసి చివరికి కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని అన్నంలో విషం పెట్టి కడతేర్చాడు ఓ కుమారుడు. కడుపులో తిప్పినట్లు అవుతుంది, ఆసుపత్రికి తీసుకెళ్లాలని కన్న తల్లి, తోడబుట్టిన చెల్లి వేడుకున్నా కనికరం లేకుండా క్రూరంగా ప్రవర్తించాడు. స్పృహ కోల్పోయిన తర్వాత తల్లీ, చెల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేక తనువు చాలించారు. హృదయ విదాకరమైన ఈ సంఘటన మేడ్చల్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మేడ్చల్ పోలీసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రావల్‌కోల్ గ్రామానికి చెందిన పల్లి ప్రభాకర్‌రెడ్డి, పల్లి సునితారెడ్డి దంపతులకు కుమారుడు పల్లి సాయినాథ్‌రెడ్డి(23), కూతురు పల్లి అనుజరెడ్డి ఉన్నారు. కాగా గత మూడేళ్ల క్రితం ప్రభాకర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రభాకర్‌రెడ్డి మృతి చెందిన సమయంలో ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన రూ. 18 లక్షలు బ్యాంకులో ఉండటాన్ని సాయినాథ్ గ్రహించాడు. సాయినాథ్‌రెడ్డి కండ్లకోయ పరిధిలో సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి అదే కళాశాలలో ఎంటెక్ చేస్తూ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా సాయినాథ్‌రెడ్డికి క్రికెట్ బెట్టింగులు పెట్టడం అలవాటుగా మారింది.

దీంతో అతను సుమారు రూ. 25 లక్షల వరకు అప్పులు చేశాడు. తన తల్లికి, చెల్లికి తెలియకుండా బ్యాంకులో ఉన్న డబ్బులను విత్‌డ్రా చేయడంతో పాటు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను అమ్మెశాడు. ఈ విషయం ఎక్కడ ఇంట్లో తెలిసిపోతుందోనని భయాందోళనకు గురైన సాయినాథ్ తన తల్లిని, చెల్లిని కడతేర్చాలని కుట్ర పన్నాడు. దీనిలో భాగంగా ఈ నెల 23వ తేదీన మేడ్చల్‌కు వచ్చి మేడ్చల్‌లోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో క్రిమిసంహారక మందును కొనుక్కొని వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి తన సోదరి అనుజ హాల్‌లో టి.వి. చూస్తుండగా సాయినాథ్‌రెడ్డి వంటింట్లోకి వెళ్లి తనతో పాటు తెచ్చిన క్రిమిసంహారక మందును వంటలలో కలిపి తాను కొంత బాక్స్‌లో పెట్టుకొని తనకు నైట్ డ్యూటీ ఉందని చెల్లి అనుజ, తల్లి సునీతకు చెప్పి రాజబొల్లారంలోని టాటా మోటార్స్ కంపెనీకి వెళ్లిపోయాడు. కాగా భోజనం చేసిన సునీత, అనుజలకు కడుపులో తిప్పుతున్నట్లుగా అవుతుండటంటో సాయినాథ్‌రెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న సాయినాథ్‌రెడ్డి తన తల్లిని, చెల్లిన గ్రామంలోని బంధువుల సహాయంతో మేడ్చల్ పట్టణంలోని ఆదిత్య ఆసుపత్రికి తీసుకొచ్చారు.

ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యులు సునీత పరిస్థితి విషమంగా ఉందని సునీతతో పాటు అనుజను కూడా వేరు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కొంపల్లిలోని రెనోవా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఈ నెల 27వ తేదీన చెల్లి అనుజ మృతి చెందగా 28వ తేదీన తల్లి సునీత మృతి చెందింది. అంత జరిగినా సాయినాథ్‌లో ఎటువంటి మార్పులేకపోవడంతో గ్రామస్తులలో అనుమానం కలిగి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సాయినాథ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన కిరాతకం గురించి నోరువిప్పాడు. ఈ సంఘటనతో రావల్‌కోల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడు సాయినాథ్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించినట్లు మేడ్చల్ సిఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News