Home ఎడిటోరియల్ వైద్యం కోలుకుంటుందా?

వైద్యం కోలుకుంటుందా?

HEALING

ఆరోగ్యంపై కేటాయింపులను, వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం విపరీతంగా తగ్గించడంతో ప్రజలకు వైద్య సేవలు సమర్ధంగా సాగడం లేదని ఇటీవల ఒక నివేదికలో రాజ్యసభ స్థాయీ సంఘం ఎండగట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ఖరారు చేసేటపుడు ఆరోగ్య రంగానికి మరింతగా కేటాయింపులు జరిగేలా జాగ్రత్త తీసుకోవాలని ఆ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించింది. స్థాయీ సంఘం నివేదిక గత ఏప్రిల్‌లో తయారై, డిసెంబర్ 14న విడుదలైంది. ఆరోగ్య రంగంలో తీసుకున్న చర్యల నివేదిక అది. ఆరోగ్యానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించే ధోరణిని విడనాడాలని ఆ నివేదిక గట్టిగా ఆరోగ్య శాఖకు సూచించింది.
వచ్చేనెల ఒకటిన ఆర్థిక మంత్రి జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించ నున్నారు. అంతకు నెల ముందు కొత్తగా కొన్ని సిఫార్సులను ఆరోగ్యరంగం కోసం కమిటీ చేసింది. రాజ్యసభ స్థాయీ సంఘానికి సమాజ్‌వాది పార్టీ ఎంపి రాంగోపాల్ యాదవ్ సారథ్యం వహించారు. మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి ( జిడిపి) లో కేవలం 1.2 శాతం మేరకే ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు జరిగినట్లు ఆ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అతితక్కువ మొత్తాన్ని ఆరోగ్యరంగానికి బడ్జెట్‌లో కేటాయిస్తున్న దేశాల్లో భారత్ అగ్రభాగాన ఉంది. అది నేపాల్, శ్రీలంక, అనేక ఇతర వర్ధమాన దేశాల కేటాయింపుల కంటె తక్కువగా ఉంటోంది. 2012-17 సంవత్సరా లకు 12వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం జిడిపిలో 2.5 శాతానికి ఆరోగ్యంపై ప్రభుత్వ ఖర్చును పెంచడానికి ప్రణాళికా కమిషన్ ఆమోద ముద్ర వేసింది. ఇది ప్రజారోగ్య రంగం ఖర్చును 147 శాతం పెంచుతుంది. కమిటీకి సమాధానంగా ప్రభుత్వం ఓ వివరణ ఇచ్చింది. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల ప్రకారమే ఆరోగ్య రంగ వ్యయం ఉంటుందని పేర్కొంది. కేటాయింపులు జరపడంలో ప్రభుత్వ వనరులపై గల డిమాండ్ల వత్తిడిని, ఆరోగ్య శాఖ నిధులను ఖర్చుపెట్టగల స్తోమతను దృష్టిలో పెట్టుకొనాలని కూడా ప్రభుత్వం వివరించింది.

2005 నుంచి పెండింగ్‌లో నిధులు
కమిటీ తన పరిశీలనలో పెండింగ్‌లో ఉన్న 2,423 నిధుల వినియోగ సర్టిఫికెట్లను కూడా పరిశీలనలోకి తీసుకొంది. అవి ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు ఇచ్చిన వివిధ గ్రాంట్లకు సంబంధించిన ఖర్చు ప్రకటనలు. వాటి మొత్తం రూ. 3,186.88 కోట్లు. ఈ నిధులు 2005 నుంచి ఖర్చుకాకుండా ఉన్నాయి. నిధుల వినియోగ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించక పోవడాన్ని బట్టి ఆరోగ్య పథకాలపై పర్యవేక్షణ, సంప్రతింపులు లేవని అర్ధమవుతోంది.
2015-16లో రాష్ట్రాలనుంచి పన్నుల వాటా 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సు మేరకు 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. ఇలా పెరిగినా, ఆరోగ్య వ్యయాన్ని కోతకోయడానికి రాష్ట్రాలనుంచి పన్నుల వాటాను కారణంగా కేంద్రం చూపింది. అయాతే రాష్ట్రాలు ఈ కోతమూలంగా ఆరోగ్యబడ్జెట్‌ను పెంచకుండా ఊరుకొన్నాయని కమిటీ నివేదిక తెలిపింది. జాతీయ ఆరోగ్య కార్యక్రమానికి నిధుల తగ్గింపు నివారణ ప్రయత్నంలో ఆరోగ్య రక్షణ వ్యయాన్ని 15శాతం మేర పెంచాలని రాష్ట్రాలను కేంద్రం అడిగింది.

రాష్ట్రాలపై బాధ్యత మోపిన కేంద్రం
అంటే ఆరోగ్య రక్షణ బాధ్యతను రాష్ట్రాలకు కేంద్రం బదిలీ చేసింది. రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయడంలో కేంద్రం అతిగా ప్రవర్తించిందని ఆ రంగానికి చెందిన నిపుణులు విమర్శించా రు. రాష్ట్రాలపై నిఘా ఉంచాలని, వాటి ఆరోగ్య వ్యయంపై కూడా దృష్టి పెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. కేంద్రం మాత్రం ఈ సిఫార్సును సాకుగా చేసుకుని రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చింది. వ్యాధుల పర్యవేక్షణ, వ్యాధుల సంక్రమణలపై విచారణ సాగించడానికి ప్రయోగశాల ఆధారంగా నాణ్యమైన సమాచారం అందేలా కూడా కేంద్రం చర్యలు తీసుకో వలసి ఉంది. కమిటీ కూడా ఈ సిఫార్సు చేసింది. మొత్తం ఇటువంటి ప్రయోగశాలలు 300 మంజూరు కాగా ప్రస్తుతం 111 మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రభుత్వం పోలియో నివారణ జాతీయ కార్యక్రమాన్ని కూడా సరిగా అమలుపర్చడంలేదని కమిటీ పేర్కొంది.

పోలియో విజయాలు వెనక్కి?
నోటి పోలియో చుక్కల కార్యక్రమానికి దశల వారీగా స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వ్యాక్సిన్ మందుకు కొరత ఏర్పడడంతో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం కుంటుబరిచింది. దేశంలోని ఉత్పత్తిదారులు ఈ టీకా మందును అవసరపడినంత ఉత్పత్తి చేయలేక పోతున్నారు. కొత్త వ్యాక్సిన్ తగినంత ఉత్పత్తి జరిగేలా చూడాలని కూడా కేంద్రానికి కమిటీ సూచించింది. ఎందుకంటే ఈ మందు కొరత ఏర్పడితే దేశంలో పోలియోను నివారించడంలో సాధించిన పురోగతి మృగ్యమవుతుందని కూడా హెచ్చరించింది. మరోప్రక్క ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలకు కమిటీ ఆమోద ముద్ర వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత తీర్చడానికి పిజి వైద్య విద్యలో 50 శాతం సీట్లను కనీసం మూడేళ్లపాటు గ్రామాల్లో పనిచేసిన డాక్టర్లకే రిజర్వు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది సర్వీసుకు 10 శాతం మార్కులు కలిపే విధానాన్ని కూడా ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా కమిటీ ఆమోదించింది. అయితే ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తగినంత పూనికతో కార్యక్రమాలు చేపట్టడం లేదని కమిటీ విమర్శించింది.
ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగినంత చేయకపోవ డంపై ఆరోగ్య నిపుణులు కేంద్రాన్ని గతంలో కూడా ప్రశ్నించారు. కేంద్రం ఇలా ఆ రంగాన్ని పట్టించుకోకపోవడం వలన ప్రభుత్వాసు పత్రుల్లో పరిస్థితులు ఎన్నడూలేనంత అధ్వానస్థితిని చేరినట్లు మీడియా కూడా బయటపెట్టింది. ఇతర దేశాలతో పోల్చి ఈ రంగం లో మన దేశ పరిస్థితి ఎంత హీనంగా ఉందో తెలుపుతూ మీడియా కథనాలను వ్యాప్తి చేసింది. పలు పత్రికలు ఈ విషయాన్ని పైకెత్తుతూ ఆనేక వ్యాసాలు రాశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమా ణాలకు మన దేశం చాలా దూరంగా ఉన్న విషయాన్ని ఎలుగెత్తి చాటాయి. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన అంతగా లేదు. ఈ పరిస్థితిలో వచ్చే ఏడాది బడ్జెట్‌లోనైనా కేటాయింపులు పెంచకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

– మేనకారావు