Home లైఫ్ స్టైల్ తీరికలేని జీవితాలకు ఉపయోగాలెన్నో..!

తీరికలేని జీవితాలకు ఉపయోగాలెన్నో..!

health benefits with music and yoga

పండక్కి రావా అదేమిటే?
సెలవేదీ ? కొత్త ప్రాజెక్ట్… క్షణం తీరిక లేదు.
కొత్త బట్టలు కొనుక్కొన్నావా?
చెప్పాకదా తీరిక లేదు. ఆఫీసు నుంచి వచ్చాక కూడా పని చేస్తూనే ఉన్న?
అమ్మ దగ్గరకు వెళ్తావా మరి? మీ ఆయన ఏమన్నాడు?
ఏవిటీ అంటం, అస్సలు వారంలో మేం పదినిమిషాలు కూడా మాట్లాడుకోలేదు. ఫుల్ బిజీ… నాకీరోజు డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంది…నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను పరుగెత్తుతా?
ఆస్పత్రి ఏమిటే… ఏదైన విశేషమా ?
టైమ్ లేదు అనబోయి నాలుక కొరుక్కొని ఏదో టెన్షన్‌లేమ్మా… బుర్ర ఖరాబుగా ఉంది అన్నది ఆ ఇరవై ఆరేళ్ళ ఐ.టీ. ప్రొఫెషనల్.

అందరూ ఇంతే. తీరిక లేని జీవితమే. ప్రతి నిత్యం ఒక పని తర్వాత ఒక పని. ఇంట్లో పని.. ఆఫీసులో సంక్షోభం. క్షణం క్షణం పుట్టుకొస్తున్న అవసరాలు. ఇవన్నీ ఈ తరం జీవన శైలిలో ఒక భాగం. విశ్రాంతి తీసుకోవటానికి, కాసేపు వ్యాయామం చేసేందుకు, దేనికీ సమయం సరిపోదు. ఒత్తిడి, ఆందోళన ఇతర మానసిక శారీరక ఇబ్బందులు. ఇవే.. వీటి మూలంగానే ఇతర ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర నుంచి ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటీ? నిజానికి ఆరోగ్య పరిరక్షణకు గొప్ప తీర్మానాలు అవసరం లేదు. చిన్న జాగ్రత్తలు… కొన్ని మార్పులు చాలు. కొద్ది సమయం కేటాయిస్తే సరిపోతుంది. కొన్ని చక్కని అలవాట్లలోనే జీవన సౌందర్యం కూడా ఇమిడిపోయి ఉంది. మంచి సంగీతం, చక్కని కళలు, ఆరోగ్యవంతమైన భోజనం, వ్యాయామం, ప్రకృతి సహజమైన వనరులన్నీ ఉపయోగించుకుంటే చాలు. అనారోగ్యపు మూలాలే నశించి పోతాయి. ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేవటం అలవాటు చేసుకొని వట్టి కాళ్ళతో పచ్చని పచ్చికలో కాసేపు నడిస్తే ఆ సమయంలో చక్కని సంగీతం వింటే మనసుకి ఎంత శాంతి.

 

health benefits with music and yoga

 

అసలు సంగీతం సహజ సిద్ధమైన చికిత్స. ఆధునిక శాస్త్రం కొన్ని రాగాలు మానవ శరీరంలోని కొన్ని న్యూరాన్లను స్పందింపజేసి అనారోగ్యాలకు స్వాంతన ఇస్తాయంటున్నాయి. రాగాల ఆరోహణ అవరోహణలు మానసికస్థితిని ప్రభావితం చేస్తాయట. మెదడు పనితీరు మెరుగుపరిచి జీవితాన్ని వికసింపజేస్తాయి. ఒత్తిడి తగ్గించుకొనేందుకు మానసిక బలాన్ని పెంచుకొనేందుకు కాఫీ దర్బారీ రాగాలు, అద్భుతమైన తెలివితేటల కోసం శివరంజని, మానసిక హింస వదిలించుకొనేందుకు సహన రాగం వినాలి. భాగేశ్వరి, మాల్కేన్స్, తోడి, పూర్వ అహిర్ భైరవి, వైజయింతి రాగాలు రక్తపోటును అదుపులో పెడతాయి. గుండె సమస్యలు సారంగ్ కుటుంబానికి చెందిన కళ్యాణీ రాగం, చారుకేసి రాగాలు వింటే తగ్గుతాయి. మంద్రస్థాయి నుంచి మధ్యస్థాయి వరకు సాగే భజనలు మనసుకి ప్రశాంతత ఇస్తాయి. సమయం దొరికినప్పుడల్లా శ్రావ్యమైన సంగీతం వినాలి. ఇది మనసుకి హాయినిస్తుంది.
సత్సంబంధాలు కొత్త శక్తినిస్తాయి. బంధువులతో, స్నేహితులతో సంబంధాలు గల వాళ్లు మరింత ఆనందంగా ఎక్కువ కాలం జీవిస్తారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చెబుతోంది. మనకు అండగా ఉన్న చుట్టు ప్రపంచం భోరోసాని కొండంత బలాన్ని ఇస్తోంది. నిజమే. సమయం లేని మాట కానీ కొద్ది సేపు రాత్రి పడుకొనే ముందర మొబైల్స్, డెస్క్‌టాప్‌లు ల్యాప్‌టాప్, టీ.వీ.లు కట్టిపెట్టి, మెదడు ఆరోగ్యం కోసం మంచి పుస్తకం పదినిమిషాలు చదువుకొన్న చాలు. చక్కని నిద్ర వస్తుంది.

ఎందుకు మనసు దాచుకోవటం, నవ్వితే చాలు ఎండార్ఫన్లనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మనసు తేలికవుతోంది. కనీసం ఒక అరగంట పాటు చేసే వ్యాయామం శృంగార సామర్ధాన్ని కూడా పెంచుతుంది. సంతోషకరమైన కుటుంబ జీవనం అనుభవంలోకి తెస్తోంది. ఒకే రకంగా చేసే వ్యాయామానికి శరీరం అలవాటుపడి స్పందించటం మానేస్తుంది. సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చే డాన్స్‌యోగా, పవర్ యోగా, ఏరియల్ యోగాలు ప్రయత్నించవచ్చు. కొన్ని రకాల నాట్య ముద్రలు కూడా కొన్ని నొప్పులను తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. కీళ్ళు, కాళ్ళనొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే డాన్స్ యోగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ మన పూర్వీకుల దగ్గర నుంచి వారసత్వంగా వస్తూ ఉన్నాయి.

వ్యాయామం అంటే శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచటం. అలాగే యోగా అంటే ఒక మ్యాట్ వేసుకుని ఒక్క చోటే చేసే విన్యాసాలు కాదు. ఎన్నో సరికొత్త ప్రక్రియలు అందుబాటులోకి వచ్చేశాయి. సినిమా నటులు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు చేసే ఏరియల్ యోగా పిల్లలు ఆడుకొనే ఉయ్యాల ఆట వంటిదే. ఇంట్లో సీలింగ్‌కు ఓ బలమైన వస్త్రాన్ని వేలాడదీసి చిన్నప్పుడు ఆడిన ఆటలు గుర్తు చేసుకుంటే ఏరియల్ లిఫ్ట్ ఏరియల్ బాలెన్స్ ఏరియల్ హాండ్ స్టాండ్, ఏరియల్ ఏరోబిక్ ఇవన్నీ చేసేయొచ్చు. మరీ భయం వేస్తే ఓసారి జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తే సరి. 15 నుంచి 50 ఏళ్ళ వాళ్ళు కూడా ఈ యోగాసనాలు వేసేయచ్చు. జిమ్నాస్టిక్స్, కరాటే, కుంఫూలోని కొన్ని ముద్రలు ఈ ఏరియల్ యోగాలో చేర్చారు. నేర్చుకోవాలి అంతే . కొంత శిక్షణ తీసుకొంటే ఇవన్నీ ఎంత సేపు.. తీరిక లేకుండా గడపటం మన జీవన శైలిలో భాగం అయిపోయింది. ఇలా ఉన్నాం కనుకనే అనారోగ్యాలు. మరి ఈ జబ్బులు ఊరికే వచ్చాయా? మన కష్టార్జితాలు.

శారీరక శ్రమతో పాటు ఆరోగ్య వంతమైన చక్కని భోజనం అవసరం. బయట తిండి తినేవాళ్లతో పోలిస్తే ఇంట్లో వండుకొనే ఆహారం తినేవాళ్ళలో 50 శాతం మంది పదేళ్ళు ఎక్కువగా జీవిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వంట ఎలా ఉండాలి? ఏమేం దినుసులు ఏ మోతాదులో వాడాలి మనసు పెడితే చాలు. చక్కని భోజనంతో మెదడు పని తీరు మెరుగవుతుంది. గంటల కొద్ది కూర్చోకుండా కాసేపు కాళ్ళకు పని చెపితే మధుమేహం, రక్తపోటు, అధిక బరువు తగ్గిపోతాయి. నిజమే కెరీర్ పరుగు తీయమని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇంటి బాధ్యతలు, బరువులు తరుముతాయి. మానవ సంబంధాలు కాళ్ళకు అడ్డం పడతాయి. వీటన్నింటినీ బాలెన్స్ చేసుకోవాలి. ఒక గమ్యం గురించి, విజయ సాధన కోసం పరుగులు పెడుతూనే జీవితానందాల్ని పొందాలి. సమయాన్ని మన గుప్పెట్లో కి తీసుకోవాలి. ఒక టైం టేబుల్ కూడా ముఖ్యమే. కానీ ఏ లెక్కలకీ అందనీ, ఈక్వేషన్లకు లొంగని చక్కని అందమైన జీవితాన్ని అనుభవం లోని రానివ్వకపోతే అసలు జీవితమే వృథా.

health benefits with music and yoga in daily life