Home తాజా వార్తలు ఎదిగే వయసుకు హెల్దీ డైట్

ఎదిగే వయసుకు హెల్దీ డైట్

 

బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తర్వాత చిన్నారులకు సరైన ఆహారం ఇవ్వాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. పిల్లలకు అందించే ఆహారం వారి శారీరక, మానసిక వికాసం కోసం తోడ్పడుతుంది. అప్పుడే వారి శరీరం, మెదడు సరిగ్గా పనిచేస్తుంది. రెండు సంవత్సరాల వరకు పిల్లలకు స్తన్యం తప్పనిసరి. పాలు తాగడం మానేయగానే వారికి పోషకతత్వాలన్నీ పూర్తిగా ఆహారంతోనే అందించాలి. అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారు. ఎలాంటి ఆహారం అందించాలో చెబుతున్నారు నిపుణులు.

విటమిన్లు శరీరం లోపలి కండరాల సాధారణ కార్యకలాపాలు, వికాసానికి తోడ్పడతాయి. విటమిన్ లోపంతో పిల్లల శరీరంలో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వారి శారీరక వికాసంపై ప్రభావం చూపిస్తాయి.

1. విటమిన్ ‘ఎ’ : ఎముకల ఎదుగుదలలో ఇది ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. కణాలు, కణజాలం వికాసాన్ని పెంపొందిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరిచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. క్యారెట్, స్వీట్ పొటాటో, మెంతికూర, బ్రొకోలీ, క్యాబేజీ, చేపనూనె, గుడ్డులోని పసుపు భాగం, ఆకుకూరలు అంటే పాలకూర, మెంతికూర లాంటి వాటిలో విటమిన్ ఎ ఎక్కువ మోతాదులో ఉంటుంది.

2. విటమిన్ ‘బి’: ఇది ఎర్ర రక్తకణాల నిర్మాణంలో కలిసి ఉంటుంది. మన శరీరం మొత్తానికి ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది లోపిస్తే పిల్లల్లో ఎనీమియా వస్తుంది. ఈ విటమిన్ కోసం తృణ ధాన్యాలు, చేపలు, మాంసం, కోడిగుడ్డు, పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరలు, పళ్లు తీసుకోవాలి.

3. విటమిన్ ‘సి’ : పిల్లల్లో రోగ నిరోధకశక్తి తగ్గగానే వారు ఇన్ఫెక్షన్లకు గురవుతారు. విటమిన్ సి పిల్లల రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఎర్ర రక్తకణాల నిర్మాణం, వాటి మర మ్మత్తులో సహాయపడుతుంది. రక్త నాళాలకు బలాన్ని ఇస్తుంది. ఐరన్ లభిస్తుంది. పుల్లని పండ్లయిన నారింజ, స్ట్రాబెర్రీ, టొమాటో, తర్భుజా, బొప్పాయి, మామిడిపండు లాంటి వాటిలో సి విటమిన్ లభిస్తుంది.

4. విటమిన్ ‘డి’ : పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి విటమిన్ డి తప్పనిసరి. ఇది శరీరంలో కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఇది ఎముకల దృఢతానికి, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి తప్పనిసరి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ డి పొందడానికి అన్నిటికంటే మంచి ఆధారం సూర్యకిరణాలు. వీటితో పాటు పాలు, కోడిగుడ్డు, చికెన్, చేపలు చిన్నారులకు ఇవ్వాలి.

5. విటమిన్ ‘ఇ’: ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంలో సహాయ పడుతుంది. సమయానికి ముందే జన్మించే పిల్లల్లో, జన్మతః విటమిన్ ఇ మోతాదు తక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి పిల్లలకు విటమిన్ ఇ అదనపు ఆహారంగా ఇవ్వాలి. ఇది అస్థిపంజరం నాడులు వికసించడానికి అతవసరమైనది. ఎలర్జీని నిలువరించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. లివర్, కోడిగుడ్డు, బాదం, అక్రోట్స్, పొద్దు తిరుగుడు పూవు గింజలు, ఆకు కూరలు, చిలగడ దుంప, బీట్‌రూట్, మామిడి పండు, బొప్పాయి, సొరకాయలాంటి వాటిలో లభిస్తుంది.

6. విటమిన్ ‘కె’: ఇది ఎముకల నిర్మాణం, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఇది పిల్లల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి కాపాడటంలో మేటి. బ్రొకోలీ, క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆకుకూరలు (పాలకూర, మెంతికూర)
చేపలు, కోడిగుడ్డు, లివర్ లాంటి వాటిలో లభిస్తుంది.

7. ఐరన్ : పిల్లల్లో ఆరోగ్యకరమైన రక్తం తయారు చేయడానికి ఇనుము చాలా అవసరం. శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు ఆక్సిజన్ తీసుకెళుతుంది. ఐరన్ లోపంతో ఎనీమియా, అలసట, బలహీనత ఏర్పడతాయి. రెడ్‌మీట్, లివర్, పౌల్ట్రీ, డ్రైఫ్రూట్స్, పళ్లు, పాలకూర, మెంతికూర లాంటి వాటిలో ఐరన్ లభిస్తుంది.

8. క్యాల్షియం: పిల్లల్లో ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియం అవసరం. ఇది రక్తం చిక్కబరచడానికి ఉపయోగపడుతుంది. ఇది పిల్లల ఎదుగుదలకు చాలా సహాయపడుతుంది. డెయిరీ ఉత్పాదనల్లో పెరుగు, పాలు, కొవ్వు తక్కువగా ఉన్న వెన్న, టోఫూ, కాటేజ్ చీజ్ లాంటి వాటిలో క్యాల్షియం కావలసినంత లభిస్తుంది. కోడిగుడ్డులోని పసుపు భాగం, బ్రొకోలీ, పాలకూర, మెంతికూర లాంటి వాటిలో క్యాల్షియం కావలసినంత లభిస్తుంది.

9. జింక్: జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇది వైరస్ ఇతర వ్యాధులను విస్తరించే సూక్ష్మజీవులతో పోరాడి పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. లివర్, తృణ ధాన్యాలు, డ్రైఫ్రూట్స్, పాలు లాంటివి ఇవ్వాలి.

10. పొటాషియం : శరీరంలోని దాదాపు ప్రతి ఒక్క కణం, ప్రతి ఒక్క అంగం తన పని నిర్వర్తించడానికి పొటాషియం అవసరం. రక్తపోటు, గుండె చక్కగా పనిచేయడానికి పొటాషియం అవసరం. దీనితో మాంస కండరాలు కూడా బలంగా మారుతాయి. పిల్లల్లో ఇది చరుకుదనాన్ని పెంచుతుంది. అరటి పళ్లలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనితోపాటు చిలగడదుంప, కొవ్వులేని పాలు, తక్కువ కొవ్వు ఉన్న పెరుగు, గింజ ధాన్యాలు ( పప్పులు), బాదంలో లభిస్తుంది.

11. మెగ్నీషియం: శరీర కణాల నిర్మాణానికి, శక్తిని కలిగించడానికి మెగ్నీషియం అవసరం. చిన్న వయసులో తగినంత మోతాదులో మెగ్నీషియం తీసుకుంటే వయసు పెరగడంతో పాటు వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ధాన్యం, బ్రౌన్ రైస్, బీన్స్, బాదం, ఇతర డ్రైఫ్రూట్‌లో మెగ్నీషియం దొరుకుతుంది.
వీటితోపాటు శరీరానికి అధిక మోతాదులో అవసరమయ్యేవి కూడా ఉంటాయి. అవి

12. కార్బోహైడ్రేట్స్: మన భోజనంలో శక్తినిచ్చే వాటిలో ప్రముఖమైనవి కార్బోహైడ్రేట్స్. ఇవి శరీరంలో కొవ్వు, ప్రొటీన్ ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. ఇవి కణజాల నిర్మాణం, వాటి మరమ్మతుకు కూడా ఎంతో అవసరం. కార్బోహైడ్రేట్స్ వేరు రూపాల్లో లభిస్తాయి. షుగర్, స్టార్, ఫైబర్‌లాంటి రూపంలో లభిస్తుంది. పిల్లలకు స్టార్చ్, ఫైబర్ ఎక్కువ మోతాదులో, షుగర్ తక్కువ మోతాదులో తినిపించాలి. బ్రెడ్, ధాన్యం, బియ్యం, పాస్తా, బంగాళాదుంప, చిలగడదుంపలాంటి వాటి నుండి కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి.

13. ప్రొటీన్: ఇది శరీర కణజాల నిర్మాణంలో సహాయపడుతుంది. శారీరక బలహీనతపై పోరాడడానికి ఆక్సిజన్ సరఫరాకు ప్రొటీన్ అవసరం. ఇది శారీరక ఎదుగుదలకు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో అవసరమైనది. పిల్లలు, టీనేజీ యువత ప్రతీరోజూ 45 నుండి 60 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి. మాంసం, చేపలు, డైరీ ఉత్పాదనలు, సోయాబీన్, పప్పులు, డ్రైఫ్రూట్స్ మొదలైనవి.

14. కొవ్వు: పిల్లలకు శక్తినిచ్చే మంచి తత్వం కొవ్వు. ఇది సులభంగా శరీరంలో కలిసిపోతుంది. కొవ్వు శరీరంలో కొన్ని ఇతర పోషకతత్వాల ఉపయోగంలోనూ సహాయపడుతుంది. విటమిన్ల కోసం కూడా ఇది అవసరం. పాలు, పాల పదార్థాలు, మాంసం, చేపలు, డ్రైఫ్రూట్స్, నూనె, వెన్న, నెయ్యి, ఫ్యాటీ ఫిష్ పెరిగే పిల్లల వికాసం కోసం వారికి సరైన సమయంలో సరైన డైట్ ఇవ్వడంతో పాటు వారిలో ఫిజికల్ యాక్టివిటీలను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నప్పటినుంచీ ఇలాంటి పోషకాహారాన్ని అలవాటు చేస్తే బాలలు ఆరోగ్యంగా ఉంటారు.

Healthy Diet for Increase Height