Home తాజా వార్తలు నైట్‌షిఫ్ట్‌లో పనిచేస్తున్నారా.. జర జాగ్రత్త

నైట్‌షిఫ్ట్‌లో పనిచేస్తున్నారా.. జర జాగ్రత్త

Healthy Tips for Night Shift Workers

నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసే వారు చాలామంది ఆహారం, నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు పాటించరు. ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటుపడి, ఒత్తిడితో కూడిన విధులు నిర్వరిస్తూంటారు. ఇలా అయితే కొన్నాళ్లకు తీవ్ర అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఒత్తిడిని తగ్గించుకుంటూ ఆహార నియమాలు పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అంటున్నారు. ఎవరికి వారే కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే చక్కని ఆరోగ్యంతో ఉల్లాసంగా ఉండొచ్చని, అవేంటో సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.

రాత్రి పూట విధులు నిర్వర్తించేవారికి జీతాలు ఎక్కువగా ఉంటాయి. విశ్రాంతి తక్కువగా ఉంటుంది. దీంతో తినే తిండిపై, నిద్ర విషయంలో అలక్షంగా ఉంటారు. అలా చేయడం వల్ల జబ్బులను ఆహ్వానించినట్లే. తీవ్రమైన పనిఒత్తిడి వల్ల నిద్రకు దూరమయ్యేవారున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక సమస్యల్ని ఎదుర్కోక తపదు.

1. మనమేం తింటున్నామో గమనించాలి. ఏది పడితే అది తినడం వల్ల క్రమంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసేవారు డిన్నర్‌తో రోజును మొదలెడతారు. అలాంటివారు డ్యూటీకి వెళ్లాక కాసేపటికి భోజనం చేసేయాలి. డిన్నర్ విషయంలో ప్రతిరోజూ ఒక సమయాన్ని తప్పక పాటించాలి.

2. ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాస్త విరామం తీసుకుంటూ కొంచెంకొంచెంగా తీసుకోవాలి. అలాగని ఏదిపడితే అది తినేయొద్దు. జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకుంటే మంచిది. దీనివల్ల ఊబకాయం వస్తుంది. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.

3. ఫైబర్ ప్రొటీన్ ఉన్న ఆహారం తీసుకుంటే చురుగ్గా పనిచేయగలుగుతారు.

4. చిప్స్, బిస్కట్ల స్థానంలో పండ్లు, సలాడ్స్ తీసుకోవాలి.

5. నిద్రలేకుండా పనిచేయాల్సిన అవసరం లేదు. షిఫ్ట్‌కు వెళ్లేముందు కాసేపు కునుకు తీయండి. అప్పుడు కొంచెం విశ్రాంతిగా ఉంటుంది. పడుకునే గదికి ముదురు రంగు పరదాలు వేసుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టేయాలి. పడుకునే కొద్దిగంటలైనా హాయిగా, కలతనిద్ర పోకుండా చూసుకోవాలి.

6. సిస్టమ్ ముందు కదలకుండా గంటలకొద్దీ పనిచేయడం అస్సలు మంచిదికాదంటున్నారు నిపుణులు. మధ్యమధ్యలో రిలాక్స్ అవ్వాలి. ఓ ఐదు పది నిముషాలు వాకింగ్ చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మధ్యలో బ్రేక్ తీసుకుంటూ, నడవడం వల్ల కళ్లకు , మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.

7. రాత్రి పూట విధులు నిర్వర్తించే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఉదయం పూట పనిచేసేవారితో పోలిస్తే అది 44 శాతం ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల డయాబెటీస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు.

8. నిద్రను బలవంతగా ఆపుకోవడానికి చాలా మంది కాఫీ, టీలు తాగుతుంటారు. విపరీతంగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటికి బదులు పండ్ల రసాలు తాగితే మంచిది. కూల్ డ్రింక్స్ జోలికి పోవడం మాత్రం ప్రమాదం అంటున్నారు నిపుణులు. రాత్రులు పనిచేసేవారు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా కావాలంటే నీళ్లు అవసరం. నీళ్లు ఎక్కువగా తాగితే నిద్ర రాకుండా ఉంటుంది. అవసరం అనుకుంటే అలారం పెట్టుకుని నీళ్లు తాగొచ్చు.

9. నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే అమ్మాయిలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు వైద్యులు. శరీరంలో మెలటోనిస్ హార్మోన్‌లపై ప్రభావం పడటం వల్ల ఈ సమస్య వస్తుందట. మన మెదడులోని మెలటోనిస్‌ను అర్ధరాత్రి దాటాక ఉత్పత్తి చేస్తుంది. అలాంటి సమయంలో నిద్రపోకుండా కృత్రిమ వెలుగులో పనిచేస్తే మెదడు మెలటోనిస్‌ను విడుదల చేయదు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. పగలు పనిచేసేవారితో పోలిస్తే రాత్రిళ్లు పనిచేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు 48 శాతం దాకా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

10. నైట్ షిప్ట్‌ల్లో పనిచేసేవారు స్వీట్లు తినకపోవడమే మంచిది. చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి ఉదయం వేళ్లల్లో శరీరానికి అవసరం. కానీ రాత్రిపూట ఈ అవసరంఉండదు.

11. నైట్‌షిఫ్ట్ వాళ్లు గదిలో తెల్లటి వెలుగుల నిచ్చే దీపాలకన్నా, ఎర్రటి వెలుగునిచ్చే దీపాలు పెట్టుకుంటే మంచిది. దీనివల్ల ఉత్సాహంగా పనిచేస్తారు. అనారోగ్యసమస్యలు దూరం అవుతాయంటున్నారు నిపుణులు.

12. రాత్రిపూట కార్బొహైడ్రేట్స్ ఉన్న ఆహారం తినడం వల్ల జీర్ణం కావడం కష్టం. అన్నం, బ్రెడ్, ఆలూ, ధాన్యాలతో చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి. సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ ఫుడ్‌ను తీసుకోండి. సీజనల్ పండ్లు , గ్రీన్ టీలు తీసుకోవాలి.
13. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత ఫోన్ వాడకాన్ని తగ్గిస్తే మంచిది.

Healthy Tips for Night Shift Workers