Saturday, April 20, 2024

లయ తప్పుతున్న చిన్ని గుండె

- Advertisement -
- Advertisement -

బాల్యం బాగుంటేనే భవిష్యత్తులో పౌరులు బాగుంటారు. లేదంటే ఆరోగ్యపరంగా, విద్యాపరంగా వెనుకబడిన పౌరులతో దేశం బలహీనంగా తయారవుతుంది. ఈ బాల్యానికి ఆరోగ్య భద్రత అందని ద్రాక్షలా మారింది. ఈ బాధ్యత ఇక్కడ, అక్కడ అని కాకుండా తల్లి వొడి నుంచి పాఠశాల వరకూ అవసరం. కానీ మన చిన్నారులకు తల్లి గర్భం నుంచే ఆరోగ్య భద్రత కరువవుతోంది. పుట్టుకతోనే చుట్టుముడుతున్న రోగాలు, ఐదు నెలల్లో వేల మంది పిల్లల్లో అవకరాలను వైద్యులు గుర్తిస్తున్నారు. ప్రతి ఏటా గుండె జబ్బుల కేసులు నమోదవుతున్నాయి.

ఇందులో కొందరు నెలల పసికందులుండగా, అధిక సంఖ్యలో మూడేళ్లు పైబడినవారుంటున్నారు. కొందరికి శస్త్ర చికిత్స ద్వారా గుండె జబ్బు నయమయ్యే అవకాశముండగా, అధిక శాతం మందికి ఆ అవకాశం ఉండటం లేదు. కారణం, జబ్బును ఆలస్యంగా గుర్తించడం. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా రెండు లక్షలకుపైగా శిశువులు గుండె లోపాలతో పుడుతున్నారు. వీరిలో డ్బ్బై వేల మందికి పైగా తీవ్రత ఎక్కువగా వుంటోంది. వీరందరినీ కాపాడాలంటే ఏడాదిలోపే చికిత్స చేయవలసి వుంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 20 వేల మంది వరకు పిల్లలు గుండె లోపాలతో పుడుతున్నారు.

గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో గుండె జబ్బులు ఎక్కువ కావడం ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తోంది. సరైన జీవనశైలి కొరవడటం, కుటుంబ చరిత్ర గుండె జబ్బులకు కారణమవుతోంది. కరోనా మహమ్మారి ఈ జబ్బుకు మరింత ఊతమిస్తోంది. పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె లోపాలు సకాలంలో గుర్తించగలిగితే చికిత్స లేకుండానే నయమయ్యే పరిస్థితి ఉంది. కొన్ని మాత్రం ప్రాణాంతకం కాగా, దీనికి జీవిత కాలం చికిత్స ఉంటుంది. గర్భం దాల్చిన తొలి ఆరు వారాల్లో పిండం గుండె ఆకారాన్ని పొందడం, స్పందించడం, ప్రయాణించే ప్రధాన రక్తనాళాలు పెరుగుతుంటాయి.

వంశపారంపర్యత, తీసుకునే మందుల ప్రభావం, ధూమపానం, పర్యావరణ పరిస్థితులు కారణంగా పుట్టుకతో గుండె లోపాలు ఏర్పడతాయి. ఊపిరి ఆడకపోవడం, అలసట, బలహీనంగా ఉండటం, శ్వాస సమస్యలు తలెత్తుతున్న పరిస్థితులు కలిగితే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. పెదవులు, గోర్లు, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు గుండె వ్యాధికి కారణమవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం, తరచుగా మూర్చపోవడం, ఊబకాయం వంటివి కూడా గుండె సమస్యలుగా గుర్తించాలి. ఈ సమస్యని తల్లిదండ్రుల దృష్టికి వచ్చిన వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.

ప్రపంచ వ్యాప్తంగా పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో పది మంది పిల్లల్లో ఏదో ఒక రకమైన గుండె సమస్య ఎదురవుతోంది. కొంత మంది వైద్య నిపుణులు 2022లో జరిపిన సర్వే ప్రకారం… గుజరాత్, పంజాబ్, మహారాష్ర్ట, చత్తీస్‌గఢ్, అసోం, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్లలోపు 937 మంది పిల్లలను పరిశీలించగా రకరకాల కారణాలు గుండె జబ్బుకు దారితీసినట్లు తెలుసుకున్నారు. బాల్యం నుంచి కౌమార దశకు వెళ్లే చిన్నారుల ఆహారంలో సోడియం, కొవ్వు, షుగర్ అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. పీచు పదార్థాలతో కూడిన ఆహారం స్వల్పంగా ఉన్నట్లు వెల్లడైంది. 26 శాతం మంది పిల్లల్లో అధిక కొవ్వు, కేలరీల ఆహారం తీసుకుంటున్నట్లు తెలిసింది. నూనెలో వేయించిన ఆహారాన్ని తీసుకుంటున్న పిల్లలు 30 శాతం మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఐదు ఏళ్లలోపు పిల్లల్లో 3.4 శాతం ఊబకాయంతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సర్వే తేల్చింది. 2015లో ఇది కేవలం 2 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. యునిసెఫ్ వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2022 అంచనా ప్రకారం 2030 నాటికి మన దేశంలో 27 మిలియన్ల పిల్లలు ఊబకాయంతో ఉంటారని తెలిపింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మంది పిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు.

ప్రపంచ ఊబకాయ పటంలో మన దేశం ఐదవ స్థానంలో ఉండగా, అనారోగ్యమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లతో గుండె జబ్బులు రావడానికి కారణమవుతుందని స్పష్టం చేసింది. థయమిన్ (విటమిన్ బి1) లోపంతో తలెత్తుతున్న గుండె జబ్బు (కార్డియాక్ బెరిబెరి) తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారుల్లో అధిక సంఖ్యలో ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారు. తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో; ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, ఒంగోలు, తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లోని చిన్నారులు ఈ జబ్బుతో బాధపడుతున్నారు. 36 నెలల శిశువులు, 6 15 ఏళ్ల వయస్సున్న పిల్లల్లో కార్డియాక్ బెరిబెరి తలెత్తుతున్నట్లు తెలిపారు. థయామిన్ స్థాయిలు లీటరుకు 66200 నానోమోల్స్ ఉండాల్సి ఉండగా, కేవలం 10 నానోమోల్స్ లోపు ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో హఠాత్తుగా ఆయాస పడడం, డొక్కలు ఎగరేయటం, గొంతు పీచుగా మారడం, పాలు తాగలేకపోవడం వంటి లక్షణాలు తలెత్తుతున్నాయి.

సకాలంలో చికిత్స అందక మరణిస్తున్నట్లు వివరించారు. చిన్నారుల గుండె సమస్యలు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవేమీ కావు. 1990వ దశకం నుంచి వచ్చిన పర్యావరణ, ఆహార మార్పులు ఇందుకు కారణమవుతున్నాయి. ఈమేరకు 15 నుంచి 29 వయస్సు వారిని, అలాగే 1995 నుంచి 2012 వరకు జన్మించిన పిల్లలను తీసుకుని బెంగళూరుకు చెందిన జిందాల్ నేచర్ క్యూర్ ఇన్‌స్టిట్యూట్ సమగ్ర పరిశోధనను నిర్వహించింది. శారీరకంగా, చురుగ్గా పిల్లలు ఉంటున్నప్పటికీ, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బ తింటున్నట్లు పేర్కొంది. ఈటింగ్ డిజార్డర్, డిప్రెషన్‌తో ఊబకాయం రావడం, దీంతో గుండె జబ్బులకు దారి తీస్తున్నట్లు వివరించింది.

ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో క్లిష్టమైన గుండె సమస్యలకు చికిత్స అందుతున్నప్పటికీ, పేదవారికి తలకు మించిన భారంగా మారింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005లో సామాజిక ఉద్యమంగా చిన్నారుల గుండె జబ్బు సమస్యను మందకృష్ణ మాదిగ తెరపైకి తెచ్చాడు. దండోరా ఆధ్వర్యంలో గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో హైదరాబాద్ లోయర్ టాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన సమావేశం మానవీయ కోణంతో సంచలనం రేపింది. అప్పటికప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ ఉచిత వైద్యానికి పచ్చజెండా ఊపాడు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో గుండె జబ్బుల నిర్ధారణ శిబిరాలను నిర్వహించి వెయ్యి మందికి పైగా చిన్నారులను గుర్తించారు.

వీరిలో కొంత మందికి మాత్రమే శస్త్ర చికిత్స అందింది. ఆ తర్వాత ప్రభుత్వాలు పెద్దగా స్పందించలేదు. ఆడపాదడపా దాతలు ముందుకు వచ్చినా కొంత మంది చిన్నారులకు మాత్రమే పరిమితమవుతోంది. తెలుగు సినీనటుడు మహేష్ బాబు ఏడాదిన్నర క్రితం ముందుకు వచ్చి రెయిన్ బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌తో చేతులు కలిపి ‘ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్’ను స్థాపించి పేద పిల్లలకు బాసటగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కూడా చిన్నారులపై దృష్టి సారించింది. అరుదైన గుండె జబ్బులతో నివ్‌‌సులో చేరిన 8 మంది చిన్నారులకు ఇటీవల బ్రిటన్ వైద్యుల సాయంతో శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. నివ్‌‌సు, నీలోఫర్ ఆసుపత్రులకు చెందిన వైద్యులతో కలిసి నాలుగు రోజుల్లో వీటిని నిర్వహించారు. ఇలాంటి శస్త్రచికిత్సలు మరిన్ని నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం ముందుకు రావడం చిన్ని గుండెకు భరోసా అందినట్లయింది.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News