Wednesday, April 24, 2024

బెంగాల్ ఎన్నికల వేడి!

- Advertisement -
- Advertisement -

Heat in West Bengal Assembly Elections

 

ఈ నెలాఖరు నుంచి జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ ఘట్టానికి ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ లేదని చెప్పుకోవచ్చు. తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల మీద లేనంతగా దేశ ప్రజల దృష్టి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బ్యాలట్ మీద కేంద్రీకృతమైంది. పదేళ్ల క్రితం సుదీర్ఘ వామపక్ష పాలనకు తెర దించి ఆ రాష్ట్ర అధికార దుర్గాన్ని కైవసం చేసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈసారి కేంద్ర పాలక పక్షమైన బిజెపి నుంచి చెప్పనలవికానంత సవాలును ఎదుర్కొంటున్నది. వాస్తవానికి 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఆ రాష్ట్రంలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 2016లో మూడు అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకున్నది. గత లోక్‌సభ ఎన్నికల (2019)లో మాత్రం అనూహ్యంగా ఆ రాష్ట్రంలో గల 42 స్థానాలలో 18ని కైవసం చేసుకొని 40.64 శాతం ఓట్లు సాధించు కుని బిజెపి అందరి దృష్టినీ విశేషంగా ఆకట్టుకున్నది.

ఒకప్పుడు దశాబ్దాల తరబడిగా వామపక్షాల దుర్భేద్య దుర్గం అనిపించుకున్న పశ్చిమ బెంగాల్ అందుకు పూర్తి వ్యతిరేక దిశకు తిరిగిపోయి మతతత్వ రాజకీయాల ఒడిలో వాలనున్నదనే అభిప్రాయానికి అవకాశం కల్పించింది. అప్పటి నుంచి బిజెపి కేంద్ర నాయకత్వం బెంగాల్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఇప్పుడు జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో విశేష విజయాన్ని సాధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకోవాలనే దృఢ సంకల్పంతో కొంత కాలంగా పావులను బలంగా కదుపుతున్నది. ఇప్పటికే ఫిరాయింపుల ద్వారా తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు శాసన సభ్యులను చేర్చుకున్నది. సుధేందు అధికారి, మిథున్ చక్రవర్తి వంటి హేమాహేమీలనూ తన వైపు లాక్కున్నది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సహా ఆ పార్టీ అగ్రనేతలు తరచూ బెంగాల్‌ను సందర్శిస్తూ మమతా బెనర్జీపైనా, ఆమె పార్టీ పాలన పైనా సునిశితమైన విమర్శలు చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పే తమకు అలవాటైన పద్ధతిని అక్కడ ప్రయోగిస్తున్నారు.

రాజకీయ ఘర్షణను ఏ స్థాయికైనా దిగజార్చి వీధి పోరాటాలకు కూడా వెనుకాడని నేతగా నిరూపించుకున్న మమతా బెనర్జీని అదే స్థాయిలో ఎదుర్కోడానికి బిజెపి వెనుకాడడం లేదు. ఆదివారం నాడు కోల్‌కతాలోని పేరొందిన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని మోడీ బహిరంగ సభకు ప్రజలు ఒక మాదిరిగా మాత్రమే హాజరు కావడం పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. గత నెల 28న అంటే తొమ్మిది రోజుల క్రితం ఆదివారం నాడు ఇదే మైదానంలో జరిగిన వామపక్షాలు కాంగ్రెస్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్‌ఎఫ్) సంయుక్త బహిరంగ సభకు అత్యంత భారీగా జనం హాజరై ఆశ్చర్యపరిచారు. అయితే మొన్నటి ప్రధాని సభకు ప్రజలు పలుచగా హాజరు కావడాన్ని బెంగాల్‌లో బిజెపి దెబ్బతింటున్నదనడానికి నిదర్శనంగా తీసుకోరాదని, ఆ పార్టీది కనిపించని ఓటని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు.

ఆదివారం నాటి సభలో ప్రధాని మోడీ ప్రసంగమంతా మమతా బెనర్జీ పై వ్యక్తిగత దాడికి, నిర్దిష్టత లోపించిన పాలనాపరమైన మార్పుకి మాత్రమే పరిమితం కావడం గమనించవలసిన విషయం. మమతా బెనర్జీ ఇటీవల స్కూటీ మీద ప్రయాణం చేసి ప్రచారం నిర్వహించిన సంఘటనను ప్రస్తావిస్తూ ఆ సమయంలో ఆమె వాహనం గతి తప్పి పడిపోతుందని అనుకున్నామని అలా జరిగి ఉంటే ఆ స్కూటీ తయారైన రాష్ట్రాన్ని కూడా ఆమె ద్వేషించే వారని, నందిగ్రామ్‌లో ఆమె స్కూటీ కిందపడడం ఖాయమని ప్రధాని అన్నారు. ఆమె రాష్ట్రాన్ని నాశనం చేసిందనే మాట ఆయన నోట రావడం ఇది మొదటిసారి కాదు. ఇందుకు సమాధానంగా మమతా బెనర్జీ సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన సభలో మాట్లాడుతూ మోడీ, అమిత్ షాలకు చెందిన గుజరాత్ రాష్ట్రంలోనే మహిళలపై రోజుకు నాలుగు అత్యాచారాలు, రెండు హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు.

కరోనా టీకాలను కూడా ప్రధాని తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారన్నారు. ఈ విధంగా పరస్పర దూషణల పరాకాష్ఠతో ప్రచారాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఎవరి హయాంలో ఏమి జరిగింది, ఇంకేమి జరగవలసి ఉంది అనే చర్చకు బొత్తిగా అవకాశం కల్పించడం లేదు. అయితే బెంగాల్ ఓటర్లలో 30 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు ఈ ఎన్నికల ఫలితాన్ని నిర్ధారించే అంతిమ నిర్ణేతలు కానున్నాయి. అవి గరిష్ఠంగా ఇప్పటి వరకు మమతా బెనర్జీ వైపే ఉన్నాయి. వాటిని చీల్చడానికి ఆమె ప్రత్యర్థి పక్షాలు సాగించే ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందనే దాన్ని బట్టి అంతిమ ఫలితాలు ఉండే అవకాశముంది. ఇటీవల వెలువడిన పలు అభిప్రాయ సేకరణల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్ వైపే ఒకింత మొగ్గును చూపించడం గమనించవలసిన విషయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News