Home ఆఫ్ బీట్ వణికిస్తోన్న చలి… జాగ్రత్తలు తప్పనిసరి

వణికిస్తోన్న చలి… జాగ్రత్తలు తప్పనిసరి

Heavy Bleak in Telangana

మన తెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో నగరవాసులు గజగజలాడుతున్నారు. రానున్న మరో రెండు మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. చలికాలం చర్మం పొడిబారడం, పెదాలు ఆరిపోవడం, కాళ్లు పగడం లాంటి సమస్యలు ఈ కాలంలో సహజం. పిల్లలు, వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి. గుండె వ్యాధులు, ఉబ్బసం, ఆయాసంతో బాధపడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. చలిని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇవేంటో చూద్దాం.

* చలికాలంలో శరీరాన్ని ఎలా రక్షించుకోవచ్చో వైద్య నిపుణులు పలు సూచనలు చేశారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో వచ్చే అన్ని రకాల రుగ్మతల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు.
* -చలి నుంచి ముఖాన్ని రక్షించుకోవడానికి క్రీమ్ బేస్ మాయిశ్యరైజర్లు రాసుకోవాలి. ఎందుకంటే చలికి పొడిబారిన చర్మానికి రాయడం వలనల కాస్త ఉపశమనం కలుగుతుంది. ముఖానికి రాసుకునే కాస్మోటిక్స్‌ల్లో లోటస్, అయాన్, బయోటిక్ లాంటి వాటిని, మెడికేర్‌లోనైతే ఆలోవేరా లాంటి మాయిశ్చరైజర్లు మేలు.
* చలికి చర్మం పొడిబారుతుంది. దీంతో శరీరం బాగా బిగుతుగా ఉంటుంది. చలికి బాగా వణికిపోతాం. ద్విచక్రవాహనాంపై వెళ్లే సమయంలో బాగా చలేస్తుంది. ఇలాంటప్పుడు స్కార్ఫ్, జర్కిన్ తలకు హెల్మెట్ , కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి.
* శరీరానికి లోషన్, మాయిశ్చరైజర్లు రాసుకోవడం వలన కోమలంగా మారుతుంది. గ్లిజరిన్, కొబ్బరి నూనెలాంటివి స్నానం చేసిన వెంటనే శరీరానికి రాసుకోవాలి.
* -ఒంటికి గ్లిజరిన్‌లాంటి సబ్బులు వాడాలి. సోపుతో శరీరంమొత్తం రుద్దకూడదు. ఫియర్స్, పెటల్ లాంటివి మంచివి.
* -వారానికొకసారి ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి. తరువాత తల స్నానం చేయాలి.
* -గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ముందుగా వైట్ ప్యారాఫిన్, పెట్రోలియం జెల్లీ, లిక్విడ్ ప్యారాఫిన్ లాంటి మాయిశ్చరైజర్లు రాసుకోని స్నానం చేయడం మేలు.
* చలికి పెదాలు పగిలి రక్తం కారే ప్రమాదం ఉంది. వ్యాజిలిన్, లిప్‌బామ్ లాంటివి రాయాలి.
* -చలి కారణంగా ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నీరు కారి పొక్కులు వస్తాయి. ఇలాంటప్పుడు వెంటనే వెద్యుడిని సంప్రదించాలి.
* -రాత్రి వేళల్లో విధులు ముగించుకుని వెళ్లేవారు ఊలు దుస్తులు ధరించాలి. వీటిని ధరించడం వల్ల అలర్జీ వచ్చే సూచనలు లేకపోలేదు. అలా వచ్చే వారు సింథటిక్, స్కిన్ ప్రొటెక్షన్ కోట్లను ధరించాలి. తలకు హెల్మెట్, జర్కిన్లు, కాళ్లకు షూ ధరించాలి.
* -చలిలో చిన్న పిల్లలను, వృద్ధులను తిప్పడం మంచిదికాదు. వీరు వెచ్చని దుస్తులు ధరించాలి.
* -కొందరు చలికాలం కదా అని బక్కెట్ల కొద్ది వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివలన శరీరంపై ఉండే కణాలు చనిపోతాయి. చర్మం ముడతలు బారుతుంది. ఫలితంగా వయసు మీదపడినట్లు కనిపిస్తుంది. అందుకే పది నిమిషాల కంటే ఎక్కువ సేపు స్నానం చెయ్యెద్దు. రోజూ పడుకునేటప్పుడు, నిద్ర లేవగానే మాయిశ్చరైజర్లు రాసుకోవడం మరవొద్దు.

పాదాలు పగిలితే : రోజూ పడుకునే ముందు ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటిలో గాని, సాధారణ గోరు వెచ్చని నీటిలో గాని పాదాలను 5 నుంచి 10 నిమిషాల ఉంచాలి. తరువాత సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఈ తరువాత పొడి బట్టతో తుడిచి మాయిశ్చరైజర్లు రాయాలి. విటమిన్ ఇ క్రీమ్స్ రాయడం మంచింది. -కొందరు పగిలిన పాదాలను పదే పదే నీళ్లలో కడుగుతుంటారు. ఇలా చేయడం వలన పగుళ్లలో ఫంగస్ వచ్చే ప్రమాదముంది. పగుళ్లకు పసుపు, నిమ్మరసం వంటివి పూయవద్దు. మధుమేహ రోగుల కాలివేళ్ల మధ్య పగుళ్లు వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటికప్పుడు గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసి జెల్లీ రాయాలి.

హృద్రోగులకు : గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతా వరకు చలిలో తిరగకుండా ఉండటం మంచింది. చలిలో గుండెపోటు, ఛాతీ నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయంటున్నారు. గుండె వైద్య నిపుణులు. హృద్రోగంతో బాధపడే వారు సమయానికి మందులు వేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. చలికి సైనస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. వీలైనంతా వరకు సూర్యుడు కాస్త వెలుగులోకి వచ్చిన తరువాతే జాగింగ్, వ్యాయమం చేయడం మంచింది. సాయంత్రం వేళల్లో మరీ మంచింది. ఉదయాన్నే ఇంట్లో యోగ చేయడం మేలు. రాత్రి పూట ప్రయాణించాల్సి వస్తే స్వెట్టర్లు, జర్కిన్లు, మంకీ క్యాపులు తప్పనిసరిగా ధరించాలి.

ద్రవ పదార్థాలు సేవిస్తే మేలు : చలికాలం సూప్స్ లాంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలంటున్నారు పోషకాహార నిపుణులు. చలికి ఫ్లూ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. వీటి బారి నుంచి బయట పడాలంటే తగినంత రోగ నిరోధక శక్తి అవసరం. ఇందుకు విటమిన్ సి లభించే పదార్థాలను తీసుకోవాలి. పసుపు రంగు, నారింజ రంగు పండ్లు, టమాట సూప్స్ అధికంగా తీసుకోవాలి. గ్రీన్ లీవ్స్‌తో తయారు చేసిన సూప్ కూడ ఎక్కువగా అవసరం. చికెన్, పాలక్ సూప్స్ కూడా మేలు. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం పొడి బారకుండా ఎక్కువ నీటిని తాగాలి.