Home తాజా వార్తలు నారాయణపూర్‌కు మరమ్మతు.. జురాలకు జలకళ

నారాయణపూర్‌కు మరమ్మతు.. జురాలకు జలకళ

Heavy flood water release to jurala project

 

నాగర్‌కర్నూల్/గద్వాల: కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్ ప్రాజెక్టు క్రస్టు గేట్లకు కర్ణాటక ప్రభుత్వం మరమ్మత్తు నిర్వహిస్తున్న క్రమంలో దిగువ జూరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా 27వేల క్యూసెక్కుల చొప్పున భారీగా ప్రాజెక్టులోని నీటిని విడుదల చేయడంతో జురాల ప్రాజెక్టు నిండుకుండగా మారి జలకళను సంతరించుకుంది.శుక్రవారం 14300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఆధారంగా జురాల ప్రాజెక్టుల పై ఆధారపడిన కోయిల్ సాగర్, నెట్టెం పాడు, భీమా రెండు లిఫ్ట్‌లు, సమాంతర కాలువ , కుడి , ఎడమ కాలువల ద్వారా పూర్తిస్థాయిలో నీటిని వదులుతున్నారు. అయినప్పటికిని ప్రాజెక్టులో వస్తున్న వరదకు అనుగుణంగా 20వేల 197 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.

జురాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టిఎంసీలకు గాను 9.152 టిఎంసీల మేరకు నీరు నిల్వ ఉన్నాయి. 14300 ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. నారాయణపూర్ నుంచి వరద పెరిగితే దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు జురాల గేట్లను ఎత్తి నీటిని వదిలే అవకాశాలు ఉన్నాయి. జురాల ప్రాజెక్టు పై ఆధారపడ్డ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 17052 క్యూసెక్కులు, నెట్టుంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా మొదటి లిఫ్ట్ ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా 315 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 750, భీమా రెండవ లిఫ్ట్ ద్వారా 750 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 490 క్యూసెక్కుల చొప్పున నీటిని వినియోగిస్తున్నారు.

శ్రీశైలం జలాశయంలో 34.2920 టిఎంసీల నీరు: శ్రీశైలం జలాశయంలో 34.2920 టిఎంసీల నీరు నిల్వ ఉంది. 215.807 టిఎంసీలు, 885 అడుగులు పూర్తిస్థాయి నీటి సామార్థం కాగా 810 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నాయి. తుంగభద్రా నది ద్వారా సుంకేసుల ప్రాజెక్టు నుంచి 4412 క్యూసెక్కులు,జురాల ప్రాజెక్టు నుంచి 17.052 క్యూసెక్కుల చొప్పున మొత్తం 21464 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలం ప్రాజెక్టులోకి 13314 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ జురాల , తుంగభద్ర నదుల నుంచి వరద కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి.

నాగార్జున సాగర్‌లో 533 అడుగులు నీటి నిల్వ: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 533 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు, 312.0450 టిఎంసీలు కాగా ప్రస్తుతం 174.0610 టిఎంసీల మేర నీరు నిల్వ ఉన్నాయి. ఎస్‌ఎల్‌బిసి (ఎలిమినేటి మాధవరెడ్డి)ప్రాజెక్టు ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్‌లో వెయ్యి క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది.

Heavy flood water release to jurala project