Friday, March 29, 2024

కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో జలం.. పుష్కలం

- Advertisement -
- Advertisement -

కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో జలం ..పుష్కలం
జలాశయాల్లో నీటినిలువ సామర్ధం 692టిఎంసీలు
ఇప్పటికే 592టిఎంసీలకు చేరిన నిల్వలు
మరో వందటీఎంసీలు వరద కుషన్
తెలుగు రాష్ట్రాల్లో 76లక్షల ఎకరాలకు సాగునీరు
మనతెలంగాణ/హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కృష్ణాబేసిన్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాగునీటి సంత్సరం ప్రారంభ దశలోనే కృష్ణాకు నదిలో వరద ప్రవాహం రైతుల్లో ఆశలు రేకెత్తించింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటల సాగుకు పెద్ద భరోసా కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కృష్ణానది, దాని ఉపనదులపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ పులిచింతల, తుంగభద్ర, మూసి తదితర ప్రాజెక్టుల్లో జలం పుష్కలంగా చేరింది. కృష్ణాబేసిన్ ప్రాజెక్టుల ద్వారా రెండు రాష్ట్రాల్లో 76లక్షల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో పుష్కలంగా నీరందే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 692టీఎంసీలు కాగా, అందులో ఇప్పటికే 592.76టిఎంసీల నీరు నిలువ ఉంది. ఒక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు తప్ప మిగిలిన అన్ని ప్రాజెక్టులు ఇప్పటికే ఒకసారి పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహాలతో జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, మూసి తదితర ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో మాత్రం ఇంకా 76టిఎంసీల నీటినిలువ మేరకు ఖాళీ ఉంది. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిలువ సమార్ధం 312.05టిఎంసీలు కాగా, గురువారం నాటికి ప్రాజెక్టులో 235.71టిఎంసీల నీరు నిలువ ఉంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ఇప్పటివరకూ 94.48టీఎంసీల నీరు చేరుకుంది.
శ్రీశైలానికి 279టిఎంసీల కొత్తనీరు:
జూన్ ఒకటినుంచి ప్రారంభమైన ఈ నీటిసంవత్సరంలో కృష్ణానది దాని ప్రధాన ఉపనదుల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇప్పటివరకూ 279టిఎంసీల కొత్త నీరు చేరుకుంది. కృష్ణానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్రకు ఈ సారి భారీగావరద వచ్చింది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 100టిఎంసీలు కాగా ,ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టు రెండు సార్లు పూర్తిగా నిండిపోయింది. జూన్ నుంచి ఇప్పటివరకూ ఎగువ నుంచి 219టిఎంసీల నీరు తుంగభధ్ర ప్రాజెక్టులోకి చేరింది. కృష్ణానదికి తెలుగు రాష్ట్రాల ముఖద్వారంగా ఉన్న జూరాల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 151టిఎంసీలు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరిన 279టిఎంసీల కొత్తనీటిలో తుంగభద్ర నదిద్వారానే 128టిఎంసీలు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం కూడా ఈ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 2లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది.
ఆయకట్టుకు ఢోకాలేదు:
ఈ సారి కృష్ణానది పరివాహకంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని ఆయకట్టులో సాగునీటికి ఢోకాలేదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో వానాకాల పంటలసాగుకు సంబంధించి 76లక్షల ఎకరాలకు కృష్ణానదీజలాలు అందాల్సివుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని 21.33లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించి జూరాల ప్రాజెక్టు ద్వారా 17.84టిఎంసీలు ఉపయోగించుకుని 1.05లక్షల ఎకరాలు సాగులోకి రావాల్సివుంది. అదేవిధంగా తుంగభద్రనదినుంచి ఆర్టీఎస్ ద్వారా 15.90టిఎంసీలను ఉపయోగించుకుని 87500ఎకరాలు సాగులోకి రావాల్సివుంది. భీమా ప్రాజెక్టు ద్వారా20టిఎంసీలతో 2.03లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ ద్వారా3.90టిఎంసీలతో 50వేల ఎకరాలు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 105.70టిఎంసీలతో 6.58లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఇవే కాకుండా మధ్య తరహా ప్రాజెక్టుల కింద 28.10టిఎంసీల నీటితో 90వేల ఎకరాలు, చిన్న తరహా ప్రాజెక్టుల ద్వారా 96.52టిఎంసీలతో 9.60లక్షల ఎకరాలు సాగులోకి వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.అంతే కాకుండా వరద జలాల ఆధారంగా చేపట్టిన మూడు ప్రాజెక్టుల్లో నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 22టిఎంసీలతో 2లక్షల ఎకరాలు, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద 25టిఎంసీలతో 3.40లక్షల ఎకరాలు, ఎఎంఆర్పీ ద్వారా 30టిఎంసీలతో 3.70లక్షల ఎకరాల్లో పంటల సాగుకు ఢోకాలేదన్న అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేశారు. ఏపి పరిధిలో కూడా 32.50లక్షల ఎకరాలకు సంబంధించి నాగార్జున సాగర్ కుడి కాలువ కింద 174టిఎంలతో 14.59లక్షల ఎకరాలు, కృష్ణాడెల్టా కింద 152టిఎంసీలతో 13.09లక్షల ఎకరాలు, పులిచింతల ప్రాజెక్టు ద్వారా45టిఎంసీలతో కృష్ణాడెల్టా స్థిరీకరణకు పూర్తి స్థాయిలో అవకాశం ఏర్పడింది. దీంతోపాటు మధ్య తరహా ప్రాజెక్టుల కింద 9.30టిఎంసీలతో 33వేల ఎకరాలు, చిన్న తరహా ప్రాజెక్టుల ద్వారా 11.54టిఎంసీల నీటినిఉపయోగించుకునేందుకు అవకాశాలు మేరుగు పడ్డాయి. తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా ఎల్లెల్సీ, హెచ్‌ఎల్సీ, కేసి కాలువలకు 92టిఎంసీల నీరందనుంది. వరద జలాల ఆధారంగా చేపట్టిన తెలుగు గంగ ద్వారా 29టిఎంసీలతో 2.75లక్షల ఎకరాలు, హంద్రీనీవా పధకం కింద 40టిఎంసీల ద్వారా 6.02లక్షల ఎకరాలు, గాలేరునగరి ద్వారా 38టిఎంసీలతో 2.60లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి.
3కోట్ల జనాభాకు తాగునీరు:
తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 3కోట్ల జనాభా తాగునీటి అవసరాలకు పుష్కలంగా కృష్ణానదీజలాలు అందనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగర ప్రజలతోపాటు పూర్వకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ , నల్లగొండ జిల్లాల ప్రజల తాగు నీటి అవసరాలకు కృష్ణాజాలు పుష్కలంగా లభించనున్నాయి. ఆంధప్రదేశ్‌లో కూడా పూర్వపు కర్నూలు జిల్లాతోపాటు కడప, అనంతపుం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చేవిధంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అందుబాటులోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

Heavy flood water to Krishna Basin Projects

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News