Sunday, July 13, 2025

శ్రీశైలానికి జలకళ

- Advertisement -
- Advertisement -

ప్రాజెక్టుకు లక్షా74వేల క్యూసెక్కుల
వరద నీరు కుడి, ఎడమ
జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి
షురూ సుంకేసుల, జూరాల
ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్‌కు 67వేల
క్యూసెక్కుల ప్రవాహం

కృష్ణా బేసిన్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. మరోపక్క తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయడంతో తెలంగాణలోని సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు సుంకేసుల బ్యారేజీ 12 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం వైపునకు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా ఎగువ కర్ణాటక, మహారాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకు లక్షా 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 14 గేట్లను ఎత్తి 93 వేల క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 29 వేల క్యూసెక్కుల వంతున నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలో 24 గంటల వ్యవధిలో ఐదు టిఎంసిల మేరకు నీరు చేరనుంది. ప్రస్తుతం జలాశయంలో 215 టిఎంసిల మేరకు నీరు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 215 టిఎంసిలకు గాను 175 టిఎంసిల మేర నీరు నిల్వ ఉంది.

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి షురూ..
శ్రీశైలం కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఆంధ్రపద్రేశ్‌కు చెందిన రైట్ బ్యాంక్ పవర్ హౌస్ ద్వారా 31 వేల క్యూసెక్కులను వినియోగించి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణకు చెందిన లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఏపి పవర్ హౌస్ ద్వారా 16.187 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా తెలంగాణకు చెందిన లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ ద్వారా 17.2341 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

నాగార్జునసాగర్‌కు వరద
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుండడంతో అధికారులు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు 67 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ వైపునకు వదులుతున్నారు. మరో మూడు రోజుల పాటు శ్రీశైలం జలాశయానికి లక్ష క్యూసెక్కుల మేరకు వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే మోతాదులో వరద కొనసాగితే మరో మూడు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జూరాలకు కొనసాగుతున్న వరద
కర్ణాటక జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టు జలాశయంలోకి శనివారం 1,20,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో డ్యామ్ అధికారులు 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. స్పిల్ వే ద్వారా 92,890 క్యూసెక్కులు బయటకు వెళ్తుండగా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,571 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా 1,24,710 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. కాగా, జూరాల డ్యామ్ పూరిస్తాయి నీటి మట్టం 318.518 మీటర్లు ఉండగా… ప్రస్తుతం నీటి మట్టం 317.390 మీటర్లు వద్ద ఉన్నది. మొత్తం నీటి నిల్వ సామర్థం 9.657 టిఎంసిలకుగాను ఇప్పుడు 7.445 టిఎంసిలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News