Home తాజా వార్తలు జోరు వానలు

జోరు వానలు

Heavy Rain

 

శివారులలో అధికం.. గ్రామాల్లో తక్కువ వర్షపాతం

రంగారెడ్డి : వరుణుడు తన ప్రతాపం చూపించారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. నగర శివారులలో మద్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నిమిషాల వ్యవదిలోనే వర్షం దంచికొట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్‌పల్లిలో 95.8 మి.మి, కుత్బుల్లాపూర్‌లో 92.5 మి.మి, ఉప్పల్‌లో 57.6 మి.మి నమోదు కాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని చెవెళ్లలో 81.5 మి.మి, ఇబ్రహింపట్నం మండలం మంగల్‌పల్లిలో 74.5 మి.మి, హయత్‌నగర్‌లో 43.5, సరూర్‌నగర్‌లో 39.3 మి.మి, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 30.5 మి.మి వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో మెజారిటి మండలాల్లో వర్షం నమోదైంది.

నగర శివారులోని కుత్బుల్లాపూర్‌లో మల్లారెడ్డి వైద్య కళాశాలలో నీరు ఎకంగా సెల్లార్‌లోని ఐసియూలోకి చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి లోని పలు కాలనీలలోకి నీరు రోడ్లపై నిలిచి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. ఎల్.బి.నగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో సైతం వర్షం జోరుగా పడటంతో పండుగ సమయంలో షాపింగ్‌కు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సద్దుల బతుకమ్మ సంబరాల ఏర్పాటులలో బిజిగా ఉన్న జనంకు వరుణుడు ఇబ్బందుల పాలు చేశారు. మొయినాబాద్, చెవెళ్ల మండలాలలో వర్షం జోరుగా కురిసింది.

శంషాబాద్‌లో 25.4 మి.మి,యాచారంలో 10.3 మిమి వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో 541.8 మి.మి వర్షం కురవవలసి ఉండగా ఇప్పటికి 577.1 మి.మి వర్షం కురిసింది. జిల్లాలోని శేరిలింగంపల్లి, తలకొండపల్లి, కడ్తాల్, కందుకూర్, మహేశ్వరం, షాబాద్, కొందూర్గు మండలాల్లో సాదారణ వర్షపాతం కన్న అధికంగా వర్షం నమోదైంది. శంకర్‌పల్లి, చెవెళ్ల మండలాలు మినహయించి మిగత మండలాల్లో సాదరణ వర్షపాతం నమోదైంది.

Heavy Rain hit many parts of Rangareddy district