Home తాజా వార్తలు ఉరుములు, మెరుపులు,గాలులు వర్షం…

ఉరుములు, మెరుపులు,గాలులు వర్షం…

Heavy Rain

 

హైదరాబాద్‌లో, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో

నేడు కూడా కురిసే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో 46 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు
ఎపిలో అత్యధికంగా 48 డిగ్రీలు నమోదయ్యే అవకాశం
నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పిడుగుపాటు,
25 మేకలు మృతి

హైదరాబాద్ : మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతోపాటు భారీగా ఉరుములు, మెరుపులు చోటుచేసుకోవడం, గాలులు బలంగా వీయడంతో రైతన్నలు, ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.. మాదాపూర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో వర్షం భారీగా కురవడంతో ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విపత్తు నివారణల టీంలను ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఉప్పల్, హయత్ నగర్, పెద్దఅంబర్ పేట, సికింద్రాబాద్, కీసర మండలం నాగారంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం బటవర్లపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు 25 మేకలు మృతిచెందాయి.

కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో నేడు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలో కొన్ని చోట్ల ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించిందని అధికారులు పేర్కొన్నారు. అలాగే కర్ణాటక, రాయలసీమ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇంకా ఎండ తీవ్రత నెలకొనడం, సముద్రం మీదుగా తేమగాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోమంగళవారం ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. రాను న్న 24 నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని పలు జి ల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, అనంతరం మూడు రోజుల్లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అత్యవసరమైతేగానీ ప్రజలు బయటకు రావద్దు

మంగళవారం రాయలసీమ, కోస్తా, తెలంగాణలోని పలుచోట్ల ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఎపిలో అత్యధికంగా 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వడగాల్పులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాల అధికారులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరింది. బుధవారం కూడా వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతేగానీ ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు అధికం…

రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్, కొమురంభీం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల అధికంగా నమోదయ్యాయి.

దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం 43 డిగ్రీలు, ఆదిలాబాద్ 45, భద్రాద్రి కొత్తగూడెం 43, భద్రాచలం 41.6, హన్మకొండ 41.5, హైదరాబాద్ 41, జగిత్యాల 44, జయశంకర్ భూపాలపల్లి 44, జోగలాంభ గద్వాల్ 42, కామారెడ్డి 43, కరీంనగర్ 44, మహబూబ్‌నగర్ 42, మెదక్ 42, నల్లగొండ 44, నిజామాబాద్ 45.2, రామగుండం 43.6, కొమురం భీం ఆసిఫాబాద్ 43, మహబూబాబాద్ 43, మంచిర్యాల 45, మేడ్చల్ 41, ములుగు 44, నాగర్‌కర్నూల్ 43, రంగారెడ్డి 42, సంగారెడ్డి 42, సిద్ధిపేట 44.8, సూర్యాపేట 44, పెద్దపల్లి 44.2, నారాయణపేట 42, నిర్మల్ 43, రాజన్న సిరిసిల్ల 41.5, వికారాబాద్ 42, వనపర్తి 42, వరంగల్ రూరల్ 43, జనగాం 42, మంచిర్యాల 44, యాదాద్రి భువనగిరి43 డిగ్రీలుగా నమోదయినట్టు అధికారులు తెలిపారు.

Heavy Rain in Several Districts along with Hyderabad